ల్యాండ్ పూలింగ్ రైతులు ఆందోళన బాట
ABN , First Publish Date - 2023-02-21T01:14:43+05:30 IST
జగనన్న ఇళ్ల కాలనీ కోసం తమ భూములు సేకరించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకూ పరిహారం చెల్లించలేదంటూ పద్మనాభం మండలం గంధవరం గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.
భూములు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందలేదని పద్మనాభం మండలం గంధవరం రైతుల ఆవేదన
ఆ మొత్తాన్ని వైసీపీ నేతలు, అధికారులు పంచుకున్నారని ఆరోపణ
కేసులు పెడతామని బెదిరించి బలవంతంగా పట్టాలు గుంజుకున్నారంటూ ధ్వజం
పద్మనాభం, ఫిబ్రవరి 20:
జగనన్న ఇళ్ల కాలనీ కోసం తమ భూములు సేకరించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకూ పరిహారం చెల్లించలేదంటూ పద్మనాభం మండలం గంధవరం గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. తమకు ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ...జగనన్న పట్టణ గృహ నిర్మాణ పథకం కోసమంటూ గ్రామంలో తమ నుంచి సుమారు వంద ఎకరాలు బలవంతంగా సేకరించారని ఆరోపించారు. ఆ భూముల్లో తాము సాగు చేసుకుంటున్న జీడిమామిడి తోటలను మొత్తం తొలగించి లేఅవుట్ వేశారన్నారు. డి.ఫారం భూమి అయితే ఎకరాకు 900 గజాలు, పట్టా లేకుండా సాగు చేస్తున్న భూమికి 450 గజాలు ఇస్తామని అధికారులు, వైసీపీ ప్రజా ప్రతినిధులు అప్పట్లో హామీ ఇచ్చారన్నారు. అయితే తమకు ఇస్తామన్న పరిహారం ఇంతవరకూ అందలేదన్నారు. నాయకులు, అధికారులు కుమ్మక్కై తమకు నష్టం చేకూర్చడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. కొందరివి ఆక్రమణ భూములుగా చూపించి...ఆ పరిహారాన్ని కాజేయడానికి వైసీపీ నాయకులు కుట్ర పన్నారని ఆరోపించారు. మూడేళ్లవుతున్న పరిహారం ఇవ్వకపోగా, రికార్డుల్లో ఇచ్చినట్టు చూపుతున్నారన్నారు. ఆ పరిహారాన్ని నాయకులు, అధికారులు పంచుకున్నారని ఆరోపించారు. తమ నుంచి సేకరించిన భూమిలో కొంత విస్తీర్ణంలోనే లేఅవుట్ వేశారని, మిగిలిన భూమిని ఖాళీగా ఉంచేశారని, అది ఎవరికోసమని రైతులు ప్రశ్నించారు. కేసులు వేస్తామని బెదిరించి వైసీపీ నేతలు తమలో కొందరి వద్ద పట్టాలను బలవంతంగా లాక్కున్నారన్నారు. తమకు జీవనాధారమైన ఈ భూములు కోల్పోవడంతో తమకు ఉపాధి లేక మూడేళ్ల నుంచి పస్తులు ఉంటున్నామన్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నామని వారు వాపోయారు. ఇకనైనా తమకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వకపోతే చావే శరణ్యమని, తమ సమాధులపైన ఈ ఇళ్లను నిర్మించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.