Share News

రైల్వే జోన్‌కు ముడసర్లోవలో భూమి?

ABN , Publish Date - Dec 16 , 2023 | 01:22 AM

రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ముడసర్లోవ సమీపంలో 52 ఎకరాల స్వాధీనానికి సిద్ధమైన జీవీఎంసీ సిబ్బందిని అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు యత్నించారు.

రైల్వే జోన్‌కు ముడసర్లోవలో భూమి?

స్వాధీనానికి వెళ్లిన జీవీఎంసీ సిబ్బందిని అడ్డుకునేందుకు స్థానిక గిరిజనుల యత్నం

పోలీసుల సహకారంతో పనులు కొనసాగించిన అధికారులు

ఆరిలోవ, డిసెంబరు 15:

రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ముడసర్లోవ సమీపంలో 52 ఎకరాల స్వాధీనానికి సిద్ధమైన జీవీఎంసీ సిబ్బందిని అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు యత్నించారు. ఆ భూమిని తమకు ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చిందని వాదనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. ముడసర్లోవ సర్వే నంబర్లు 53, 55, 59, 60 61, 62లో గల భూమి చుట్టూ కంచె నిర్మించేందుకు శుక్రవారం జీవీఎంసీ సిబ్బంది పోలీసుల సహాయంతో వెళ్లారు. ఈ విషయం తెలిసి స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఆ భూములకు తాము హక్కుదారులమని, ఫలసాయాన్ని ఇచ్చే చెట్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ కార్యాలయాలను కట్టడానికి ప్రభుత్వం సిద్ధమైతే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గిరిజనులకు, పోలీసులకు నడుమ వాగ్వాదం జరిగింది. అనంతరం గిరిజనులు తమ ఆందోళన కొనసాగిస్తుండగానే...మరోవైపు అధికారులు తమ పని తాము చేసుకోసాగారు. ఈ భూమి గతంలోనే జీవీఎంసీకి దఖలు పడినట్టు చినగదిలి తహసీల్దార్‌ రమణయ్య తెలిపారు. కాగా ఈ భూమిని రైల్వే జోన్‌ కోసం కేటాయించనట్టు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Dec 16 , 2023 | 01:22 AM