వెదుళ్లనరవలో భూ కబ్జాలు

ABN , First Publish Date - 2023-03-22T00:54:27+05:30 IST

సబ్బవరం మండలం వెదుళ్లనరవలో (జీవీఎంసీ 88వ వార్డు పరిధి) ప్రభుత్వ, గెడ్డ పోరంబోకు భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. కొంతమంది కబ్జాదారులు ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, మరికొందరు సెంట్లు, గజాల చొప్పున అనధికారికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది నాయకులకు ఇదే ప్రధాన వ్యాపారంగా మారింది.

వెదుళ్లనరవలో భూ కబ్జాలు
సబ్బవరం మండలం వెదుళ్లనరవ సర్వే నంబరు 102లోని గెడ్డవాగు పోరంబోకు భూమిలో నిర్మిస్తున్న రెండు అంతస్థుల భవనం

గెడ్డవాగు పోరంబోకు ఆక్రమణ

జిరాయితీ భూముల్లో కలిపేసుకుంటున్న యజమానులు

సెంట్లు, గజాల చొప్పున విక్రయం

దర్జాగా పక్కా ఇళ్ల నిర్మాణం

కన్నెత్తి అయినా చూడని రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు

సబ్బవరం, మార్చి 21: సబ్బవరం మండలం వెదుళ్లనరవలో (జీవీఎంసీ 88వ వార్డు పరిధి) ప్రభుత్వ, గెడ్డ పోరంబోకు భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. కొంతమంది కబ్జాదారులు ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, మరికొందరు సెంట్లు, గజాల చొప్పున అనధికారికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది నాయకులకు ఇదే ప్రధాన వ్యాపారంగా మారింది. ఒకవేళ అధికారులు ఎవరైనా అడ్డుకుంటే వారిపై రాజకీయంగా ఒత్తి తేవడం లేదా మామూళ్లు ఇచ్చి తమ దారికి తెచ్చుకుంటున్నారు. అయినా లొంగకపోతే బెదిరింపులకు దిగుతున్నారు.

సబ్బవరం మండలం వెదుళ్లనరవ, గాజువాక మండలం దువ్వాడ గ్రామాలు పక్కపక్కనే వున్నాయి. వెదుళ్లనరవ సర్వే నంబరు 102లో గెడ్డవాగు/ పోరంబోకు స్థలం 3.87 ఎకరాలు ఉంది. దీనికి కొనసాగింపుగా దువ్వాడ రెవెన్యూ పరిధి సర్వే నంబరు 96లో 5.56 ఎకరాలు, సర్వే నంబరు 94లో 4.32 ఎకరాలు వున్నాయి. ఈ ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరు ఈ భూముల మీదుగా గాజువాక వైపు ప్రవహిస్తుంది. ఈ మూడు సర్వే నంబర్లకు అనుకొని దువ్వాడ రెవెన్యూ పరిధిలో జిరాయితీ భూములు ఉన్నాయి. ఈ భూముల యజమానులు పక్కనే వున్న గెడ్డవాగు, పోరంబోకు భూములను ఆక్రమించి తమ భూముల్లో కలిపేసుకున్నారు. అనంతరం ప్లాట్లుగా వేసి సెంట్లు, గజాల చొప్పున అమ్ముకుంటున్నారు. గతంలో తహసీల్దారుగా పనిచేసిన కె.రమాదేవి... వెదుళ్లనరవలో సర్వే నంబర్లు 128, 99, 98, 102, 101, 39, 12, 117, 121, 113, 76లలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టే ఎటువంటి కట్టడాలకు అయినా విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వొద్దని, ఇంటి పన్ను కట్టించుకోవద్దని, తాగునీటి సదుపాయం కల్పించవద్దని ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఆమె బదిలీ అయిన తరువాత ఆక్రమణలు మళ్లీ మామూలే! తాజాగా వెదుళ్లనరవ సర్వే నంబరు 102లో రెండు అంతస్థులతో పక్కా భవనం నిర్మిస్తున్నారు. దీనిపై గతంలో ఫిర్యాదు చేస్తే అఽధికారులు పనులు నిలుపుదల చేయించారని, మళ్లీ నెల రోజుల నుంచి నిర్మాణం పనులు చేస్తుండడంతో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక సర్వే నంబరు 128లోని ప్రభుత్వ భూమిలో ఐదారుచోట్ల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వలంటీరు ఒకరు ఇటు అధికారులకు, అటు అక్రమార్కులకు మఽధ్యవర్తిగా వ్యవహరిస్తూ భవన నిర్మాణదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. సర్వే నంబర్లు 113, 117, 102, 76, 128లోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదని వెదుళ్లనరవ కొత్తూరుకు చెందిన ఉరుకూటి దండుబాబు ఆరోపిస్తున్నారు. కాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ, దర్జాగా ఇళ్లు నిర్మించడంపై ఆర్‌ఐ వీరయ్యను వివరణ కోరగా, ఇటీవల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో బిజీగా వున్నామని, రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెదుళ్లనరవ సచివాలయం టౌన్‌ప్లానింగ్‌ అధికారి శీనివాస్‌ను వివరణ కోరగా, ప్రభుత్వ భూముల్లో భవన నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు.

Updated Date - 2023-03-22T00:54:27+05:30 IST