రోడ్డు విస్తరణకు భూ సేకరణ తప్పనిసరి

ABN , First Publish Date - 2023-05-26T01:12:42+05:30 IST

రోడ్డు విస్తరణకు తప్పనిసరిగా భూసేకరణ చేయాల్సి ఉందని హైకోర్టు న్యాయవాది వీవీ నారాయణరావు స్పష్టం చేశారు.

రోడ్డు విస్తరణకు భూ సేకరణ తప్పనిసరి
భవన, స్థల యజమానుల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయవాది నారాయణరావు

అధికారులు నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టలేదు

నర్సీపట్నం, మే 25 : రోడ్డు విస్తరణకు తప్పనిసరిగా భూసేకరణ చేయాల్సి ఉందని హైకోర్టు న్యాయవాది వీవీ నారాయణరావు స్పష్టం చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో మెయిన్‌ రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవన, స్థల యజమానులతో వందడుగుల రోడ్డు విస్తరణపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిసిపల్‌ అధికారులు నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణ ప్రక్రియ చేపట్ట లేదన్నారు. సెక్షన్‌ 42 ప్రకారం భూసేకరణ చేసిన తర్వాత నష్ట పరిహారం చెల్లించి, కౌన్సిల్‌ తీర్మానం తీసుకోవాలన్నారు. మునిసిపాలిటీ వద్ద డబ్బులు లేకపోవడంతోనే టీడీఆర్‌ సర్టిఫికెట్లు ఇస్తా మని అంటున్నారని పేర్కొన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ అప్రూవల్‌ ఉంటే రోడ్డు అభివృద్ధి ప్లాన్‌ ప్రకారం నిబంధనల మేరకు రోడ్డు విస్తరణకు ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. భవన, స్థల యజమానులు రోడ్డు విస్తరణ 80 అడుగులు చేసి, నష్ట పరిహారం కోరుతున్నారని వివరించారు. రోడ్డు విస్తరణపై కొన్ని అభ్యంతరాలు తెలియజేస్తూ కమిషనర్‌కు వినతి పత్రాలు అందజేశారని చెప్పారు. మునిసిపల్‌ పాలకవర్గం అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారా.. లేదా.. అనేది చూడాల న్నారు. పాలకవర్గం 100 అడుగులు రోడ్డు విస్తరణ చేయాలని తీర్మానం చేస్తే ఎంత మంది సభ్యులు సంతకాలు పెట్టారన్నది ముఖ్యమన్నారు. కమిషనర్‌ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చే ముందు మాస్టర్‌ ప్లాన్‌ కాపీ, రోడ్డు అభివృద్ధి ప్రణాళిక, మునిసిపల్‌ పాలకవర్గం తీర్మానం ప్రతులను అడిగి తీసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో పలువురు భవన, స్థల యజమానులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T01:12:42+05:30 IST