అసకపల్లిలో భూ కబ్జా
ABN , First Publish Date - 2023-08-02T01:10:55+05:30 IST
మండలంలోని అసకపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. తుప్పలు తొలగించి, స్థలాలను చదును చేసి సెంటు రూ.2-3 లక్షలకు విక్రయిస్తున్నారు. సుమారు ఎకరా భూమి ఆక్రమించగా దీని విలువ రూ.2.5 కోట్లకు పైగానే వుంటుందని అంచనా. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన స్థానిక నేతలే భూ ఆక్రమణలకు పాల్పడడంతో స్థానికులు విస్తుపోతున్నారు.
సర్వే నంబరు-1లో ఎకరాపైగా ఆక్రమణ
హైవేకు సమీపంలో ఉండడంతో సెంటు రూ.2-3 లక్షలు
అధికార, ప్రతిపక్ష నేతలే సూత్రధారులు
తుప్పలు తొలగించి చదును చేస్తున్న వైనం
రెవెన్యూ అఽధికారులకు స్థానికులు ఫిర్యాదు
ఆర్‌ఐ, వీఆర్వో వచ్చి పరిశీలన
కబ్జా స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
సబ్బవరం, ఆగస్టు 1:
మండలంలోని అసకపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. తుప్పలు తొలగించి, స్థలాలను చదును చేసి సెంటు రూ.2-3 లక్షలకు విక్రయిస్తున్నారు. సుమారు ఎకరా భూమి ఆక్రమించగా దీని విలువ రూ.2.5 కోట్లకు పైగానే వుంటుందని అంచనా. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన స్థానిక నేతలే భూ ఆక్రమణలకు పాల్పడడంతో స్థానికులు విస్తుపోతున్నారు.
అధికారులు సైతం చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.
సబ్బవరం మండల కేంద్రానికి సమీపంలో వుండడం, కొత్తగా ఏర్పాటైన ఆరు వరుసల జాతీయ రహదారి పక్కనే వుండడంతో అసకపల్లిలో భూముల విలువ గణనీ యంగా పెరిగింది. మరోవైపు ఇక్కడ ప్రభుత్వ భూములు అధికంగా వుండడంతో కబ్జాదారుల కన్ను వీటిపై పడింది. ఖాళీ స్థలాలను ఆక్రమించి చదును చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని కబ్జాలను అడ్డుకోవడానికి రెవెన్యూ సిబ్బంది వస్తే.. మహిళలతో దాడులు, దుర్భాషలాడడం చేయిస్తున్నారు. అంతేకాక ఆక్రమిత భూముల్లో రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేస్తున్న హెచ్చరిక బోర్డులను పీకేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వే నంబరు-1లో సుమారు ఎకరం మేర కొండ పోరంబోకు భూమిని వైసీపీ, టీడీపీలకు చెందిన ఇద్దరు నేతలు ఆక్రమించారు. దీనికి సమీపంలో జగనన్న కాలనీ వుండడంతో ఇక్కడ స్థలాలకు గిరాకీ ఏర్పడింది. సదరు నేతలు రెండు మూడు రోజుల నుంచి తుప్పలు తొలగించి నేలను చదును చేసే పనులు ప్రారంభించారు. ఒక చోట పక్కా భవనం నిర్మించేందుకు పిల్లర్లు కూడా వేశారు. ఇక్కడ సెంటు రూ.2-3 లక్షలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన నాయకులు కబ్జా చేసిన భూమి విలువ రెండున్నర కోట్ల రూపాయల వరకు వుంటుందని అంచనా. కాగా సర్వే నంబరు-1లో సుమారు ఎకరం భూమి కబ్జాకు గురైనట్టు స్థానికులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ బి.సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆర్‌ఐ వీరయ్య, వీఆర్వో జయశ్రీ సిబ్బందితో వెళ్లి ఆక్రమిత భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినా, తాము ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు తొలగించినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు.