ఇసుక కొరత!
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:54 AM
జిల్లాలో ఇసుక కొరత అధికంగా వుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక డిపోల్లో ఆరు నెలల నుంచి ఇసుక అందుబాటులో లేదు. ఇదే అదనుగా భావించిన అధికార పార్టీ నేతలు నదుల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతూ అధిక ధరకు అమ్ముకుంటున్నారు.
జిల్లాలో ఆరు నెలల నుంచి ఇసుక డిపోలు ఖాళీ
ఇదే అదనుగా భావించి అక్రమ తవ్వకాలకు తెర తీసిన అధికార పార్టీ నేతలు
జగనన్న ఇళ్ల కాలనీలు, ప్రభుత్వ భవనాల పేరుతో సదుల్లో ఇసుక తవ్వకాలు
ట్రాక్టర్ లోడు రూ.5-7 వేలకు అమ్మకం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఇసుక కొరత అధికంగా వుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక డిపోల్లో ఆరు నెలల నుంచి ఇసుక అందుబాటులో లేదు. ఇదే అదనుగా భావించిన అధికార పార్టీ నేతలు నదుల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతూ అధిక ధరకు అమ్ముకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాన్ని రద్దు చేసి, గనుల శాఖ ద్వారా డిపోలు ఏర్పాటు చేయించి విక్రయాలు చేపట్టింది. ప్రస్తుత అనకాపల్లి జిల్లా పరిధిలో అనకాపల్లి, చోడవరం, అచ్యుతాపురం, నక్కపల్లి, నర్సీపట్నం ప్రాంతాల్లో డిపోలు ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలోని నదుల్లో తగినంత ఇసుక నిల్వలు లేవని పర్యావరణ శాఖ చెప్పడంతో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదుల నుంచి ఇసుక తీసుకువచ్చి డిపోల్లో విక్రయించారు. అయితే ఇసుక డిపోల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో 2021లో జేపీ వెంచర్స్ అనే ప్రైవేటు సంస్థకు ఇసుక తవ్వకాలు, అమ్మకాల కాంట్రాక్టును కట్టబెట్టింది. ఈ సంస్థ కూడా తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇసుకను తీసుకువచ్చి డిపోల్లో విక్రయించింది. కొన్నాళ్ల తరువాత ఇసుక తవ్వకాలు అమ్మకాలు చేపట్టలేమని జేపీ వెంచర్స్ సంస్థ చేతులెత్తేసింది. అయితే కాంట్రాక్టు గడువు ఇంకా ఉన్నందున ప్రభుత్వం టర్న్‌కీ అనే మరో సంస్థకు సబ్ కాంట్రాక్టు అప్పగించింది. అయితే అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక టర్న్‌కీ సంస్థ కూడా కొద్ది కాలం తరువాత ఇసుక అమ్మకాల బాధ్యతల నుంచి తప్పుకుంది. దీంతో ప్రభుత్వం మళ్లీ జేపీ వెంచర్స్‌కే ఇసుక తవ్వకాలు, అమ్మకాల బాధ్యతలు అప్పగించింది. కాంట్రాక్టు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా ఈ ఏడాది మే 31వ తేదీతో ముగిసింది.
ఆరు నెలలుగా ఇసుక డిపోలు ఖాళీ
జిల్లాలోని ఇసుక డిపోలు ఆరు నెలల నుంచి ఖాళీగా వున్నాయి. దీంతో ఇసుక కొరత ఏర్పడిన భవన నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారు. చోడవరం మండలం నరసాపురం వద్ద ఏర్పాటు చేసిన ఇసుక డిపో ఏడాది కిందటే మూత పడింది. తూనిక యంత్రాన్ని ఇక్కడి నుంచి తరలించారు. గతంలో విశాఖపట్నం జిల్లా అగనంపూడి డిపో నుంచి అనకాపల్లి జిల్లాలోని డిపోలకు ఇసుక రవాణా చేసేవారు. ప్రస్తుతం ఆ డిపో కూడా ఖాళీగానే వుంది.
నదుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు
జేపీ వెంచర్స్ సంస్థ కాంట్రాక్టు ముగియడంతో జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో నదులు, గెడ్డల్లో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. వాస్తవంగా జిల్లాలోని నదుల్లో తగిన ఇసుక నిల్వలు లేవని, అందువల్ల ఇసుక తవ్వకాలు జరపరాదని పర్యావరణ శాఖ గతంలోనే స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ డిపోల్లో ఇసుక అందుబాటులో లేకపోవడంతో జగనన్న ఇళ్ల కాలనీలకు, ప్రభుత్వ భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుకను స్థానికంగా వున్న నదుల్లో నుంచి తవ్వుకుని తీసుకెళ్లవచ్చని వెసులుబాటు కల్పించింది. దీనిని అడ్డంపెట్టుకుని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టరు లోడు ఇసుక దూరాన్నిబట్టి రూ.5 వేల నుంచి రూ.7 వేలకు అమ్ముకుంటున్నారు. టైరు బండి అయితే రూ.2 వేలు వసూలు చేస్తున్నారు.
త్వరలో సమస్యకు పరిష్కారం
జేపీ వెంచర్స్ సంస్థ గడువు ముగయడంతో ఇసుక తవ్వకాలు, రవాణా, అమ్మకాల బాధ్యతలను ప్రభుత్వం మరొక సంస్థకు అప్పగించిందని జిల్లా గనుల శాఖాఽధికారి సుబ్బారాయుడు తెలిపారు. జిల్లాలోని నదుల్లో ఇసుక తవ్వకాలకు అనుమలు లేవని, ఇసుక కొరత సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.