ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోలా గురువులు ఓటమి

ABN , First Publish Date - 2023-03-24T01:40:46+05:30 IST

ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశించిన రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులును దురదృష్టం వెంటాడింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోలా గురువులు ఓటమి

వైసీపీ కొంపముంచిన క్రాస్‌ ఓటింగ్‌

విశాఖపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):

ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశించిన రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులును దురదృష్టం వెంటాడింది. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీగా గెలుపొందాలంటే 22 ఓట్లు అవసరం కాగా కోలా గురువులుతోపాటు కృష్ణా జిల్లాకు చెందిన జయమంగళం వెంకటరమణకు 21 చొప్పున సమానంగా ఓట్లు లభించాయి. దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించగా జయమంగళం గెలుపొందారు.

మత్స్యకార వర్గానికి చెందిన గురువులు 2008లో రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేయగా మళ్లీ పరాజయం పొందారు. 2019లో మళ్లీ దక్షిణం టికెట్‌ కోసం యత్నించినా దక్కలేదు. రెండేళ్ల కిందట కోలా గురువులుకు ప్రభుత్వం మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చింది. అయితే ఎలాంటి నిధులు, విధులు లేకపోవడంతో ఆ పదవి నామమాత్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోలా గురువులును అధిష్ఠానం ఎంపిక చేసింది. ఆయన గెలుపు ఖాయమని పార్టీ నేతలు, ఆయన అనుచరులు భావించారు. అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని పోటీకి నిలపడం, వైసీపీ నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరగడంతో గురువులు ఓటమి పాలయ్యారు.

Updated Date - 2023-03-24T01:40:46+05:30 IST