Share News

టీటీడీ కల్యాణ మండపంలో కమీషన్ల కక్కుర్తి

ABN , Publish Date - Dec 17 , 2023 | 01:24 AM

ఎంవీపీ కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం అక్కడి ఉద్యోగులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

టీటీడీ కల్యాణ మండపంలో కమీషన్ల కక్కుర్తి

లైటింగ్‌, డెకరేషన్‌, సప్లయర్స్‌ కాంట్రాక్టు... అక్కడ సిబ్బంది చెప్పిన వారికి ఇవ్వాల్సిందే

లేదంటే కుదరదంటూ రుబాబు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎంవీపీ కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం అక్కడి ఉద్యోగులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎవరు పెళ్లి చేసుకున్నా వారు సూచించిన సంస్థకే లైటింగ్‌, డెకరేషన్‌, సప్లయర్స్‌ కాంట్రాక్టు ఇవ్వాలి. వేరే వారికి ఇచ్చుకుంటామంటే అంగీకరించరు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నా, నేరుగా వెళ్లి తీసుకున్నా ఇదే పరిస్థితి. ఎందుకిలా చేస్తున్నారని ఆరా తీస్తే...సదరు పనులు చేసే సంస్థ నుంచి 20 శాతం కమీషన్‌ అక్కడి ఉద్యోగులకు అందుతున్నట్టు సమాచారం. ఉదయం ఆరు గంటలకు కల్యాణ మండపం ఇస్తే మరుసటిరోజు ఉదయం 6 గంటలకు ఖాళీ చేసి ఇచ్చేయాలి. వెళ్లిపోవాలి. లేదంటే...అదనపు మొత్తాలు వసూలు చేస్తారు.

మండపం వరకే బాధ్యత

టీటీడీ కేవలం కల్యాణ మండపం మాత్రమే ఇస్తుంది. అక్కడ కార్యక్రమం నిర్వహించుకునే వారు ఆ భవనానికి అవసరమైన పూల డెకరేషన్‌, విద్యుద్దీపాల అలంకరణ, మండపం డెకరేషన్‌, కుర్చీలు, కేటరింగ్‌ వంటివి సమకూర్చుకోవాలి. ఈ విషయంలో టీటీడీ సిబ్బందికి ఎటువంటి సంబంధం ఉండదు. వారు ఒత్తిడి చేయకూడదు. కానీ ఇక్కడి అధికారులు కేవలం కేటరింగ్‌ (భోజనాలు)కు మాత్రమే ఆ రకంగా అంగీకరించి, మిగిలిన డెకరేషన్‌ అంతా తమ మనుషులే చేస్తారని, బయట వారితో చేయడం కుదరదని స్పష్టంగా చెబుతున్నారు. ఇందులో వచ్చే 20 శాతం కమీషన్‌ టీటీడీ అధికారులు అడ్డగోలు పనులు చేస్తున్నారు.

ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలైనా ఇచ్చుకోవలసిందే

కొంతమంది పెళ్లి వ్యవహారం అంతా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకు అప్పగిస్తుంటారు. అటువంటి సందర్భంలో ఆ సంస్థే కల్యాణ మండపం కూడా బుక్‌ చేస్తుంది. వారు కూడా అధికారులు సూచించిన వారితోనే లైటింగ్‌, డెకరేషన్‌ చేసుకోవాలనే నిబంధన పెడుతున్నారు. అలాగైతే తమకు గిట్టుబాటు కాదని వారు చెప్పినా మండపం అధికారులు ఒప్పుకోవడం లేదు. ముందు రోజు జరిగిన కార్యక్రమానికి పెట్టినవన్నీ తీయడానికి సమయం పడుతుందని, అవి తీసి కొత్తవి వేయాలంటే...కష్టమని, వారితోనే మాట్లాడుకోవాలని చెప్పి తప్పించుకుంటున్నారు.

ఇప్పటికే ఒకసారి చర్యలు..అయినా మారని తీరు

కల్యాణ మండపం సిబ్బందిపై ఈ తరహా ఆరోపణలు అధికం కావడంతో కొద్దికాలం క్రితం ఇక్కడి నుంచి తప్పించి పొరుగు జిల్లాకు పంపించేశారు. అయితే మళ్లీ పైరవీలు చేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మరింత విజృంభిస్తున్నారు. టీటీడీ కల్యాణ మండపం కూడా జీవీఎంసీ కల్యాణ మండపాల తీరుగా మారడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, ఎవరికి నచ్చినట్టు వారు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 01:24 AM