జేపీ వెంచర్స్‌ దందా

ABN , First Publish Date - 2023-08-22T01:35:05+05:30 IST

గనుల శాఖ నాలుగున్నరేళ్ల క్రితం ఏర్పాటుచేసిన ఇసుక డిపోల్లో ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు అనధికారికంగా, అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నాయి.

జేపీ వెంచర్స్‌ దందా

జిల్లాలో అనధికారికంగా ఇసుక వ్యాపారం

మే 31వ తేదీతో ముగిసిన గడువు

...అయినా డిపోలను వదలని ప్రైవేటు సంస్థ సిబ్బంది

సంస్థ పేరిట వేబిల్లులు జారీ

ప్రభుత్వం నుంచి గనుల శాఖ అధికారులకు సమాచారం నిల్‌

విశాఖపట్నం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి):

గనుల శాఖ నాలుగున్నరేళ్ల క్రితం ఏర్పాటుచేసిన ఇసుక డిపోల్లో ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు అనధికారికంగా, అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నాయి. జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ అనే సంస్థ ఇసుక నిర్వహణ కాంట్రాక్టు గడువు ముగిసినా ఇంకా వ్యాపారం చేయడంతోపాటు వే బిల్లులు జారీచేస్తోంది. ప్రస్తుతం నగరంలో రెండు ప్రధాన డిపోల్లో జయప్రకాష్‌ వెంచర్స్‌తోపాటు మరో సంస్థకు చెందిన ఉద్యోగులు కొనసాగుతున్నారు. అయితే గనుల శాఖ, జిల్లా యంత్రాంగానికి మాత్రం ఎటువంటి సమాచారం లేదు.

వైసీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కొన్నాళ్లకు ఇసుక విధానంలో మార్పులు చేసింది. తొలుత జిల్లాల్లో ఇసుక డిపోలు ఏర్పాటుచేసి ఏపీఎండీసీ ఆధ్వర్యంలో అమ్మకాలు నిర్వహించింది. ఆ తరువాత గనుల శాఖకు అప్పగించింది. నగరంలో ముడసర్లోవ, అగనంపూడితో పాటు ఉమ్మడి జిల్లాలో నక్కపల్లి, అచ్యుతాపురం, చోడవరం, నర్సీపట్నం, భీమిలి, అనకాపల్లిల్లో డిపోలు ఏర్పాటుచేశారు. ఉమ్మడి జిల్లాలో ఇసుక రీచ్‌లు లేనందున ఇటు శ్రీకాకుళం, అటు రాజమండ్రి నుంచి ఇసుక రప్పించేవారు. 2021లో గనుల శాఖను ప్రభుత్వం తప్పించి జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ అనే సంస్థకు ఇసుక అమ్మకాలు బాధ్యత అప్పగించింది. కొన్నాళ్లు ఈ సంస్థ వ్యాపారం చేసి తరువాత...విశాఖలో డిపోలను టర్న్‌కీ అనే సంస్థకు ఇచ్చింది. నలుగురు యువకులు కలిసి పెట్టుకున్న టర్న్‌కీ సంస్థ కొన్నాళ్లు వ్యాపారం చేసి తరువాత అధికార పార్టీ నేతల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లను భరించలేక గత ఏడాదే తప్పుకోవడంతో తిరిగి జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ డిపోల నిర్వహణ చేపట్టింది. భారీఎత్తున ఇసుక వినియోగించే విశాఖలో బిల్డర్లకు నగరంలోని డిపోల్లో కాకుండా శ్రీకాకుళం, రాజమండ్రి రీచ్‌లలోనే సరఫరా చేసేవారు. మొత్తమ్మీద వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకం గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ఈ ఏడాది మే నెల 13వ తేదీతో ముగిసింది. అంటే మే 13వ తేదీ నుంచి జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ వ్యాపారం చేయకూడదు. వెంటనే డిపోలు, రీచ్‌లను స్వాధీనం చేసుకుని వ్యాపారం నిర్వహించేలా గనుల శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. మరోవైపు జేపీ పవర్‌ వెంచర్స్‌ డిపోలను వదలకుండా ఇసుక అమ్మకాలు కొనసాగిస్తోంది. దీనికితోడు నాడు-నేడు పనులు, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు విద్య, వైద్య శాఖలతోపాటు హౌసింగ్‌ అఽధికారులు జారీచేసే టోకెన్ల ప్రకారం జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌, టర్న్‌కీ ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో వే బిల్లులు జారీచేస్తున్నాయి. వేబిల్లు రశీదుపై జీఎస్టీ నంబర్‌ ఎక్కడా ముద్రించలేదు. ప్రస్తుతం ముడసర్లోవ, లంకెలపాలెం డిపోల్లో వందల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. డిపోల్లో కిందిస్థాయి ఉద్యోగులు ఉంటున్నారు. వారెవరూ ఏమి మాట్లాడడం లేదు. పై నుంచి వస్తున్న ఆదేశాల మేరకు తాము ఇక్కడ ఉంటున్నాం తప్ప...అంతకు మించి తమకేమీ తెలియదని చెబుతున్నారు. ఈ విషయం జిల్లా గనుల శాఖ అధికారి వద్ద ప్రస్తావించగా ఇసుక కోసం తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది మే 13వ తేదీతో ఒప్పందం గడువు ముగిసిన జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ ఏ అధికారంతో ఇసుక వ్యాపారం చేస్తోంది? అనేది మిలియన్ల డాలర్ల ప్రశఽ్న. చివరకు విద్య, వైద్య శాఖ, గృహ నిర్మాణ సంస్థలు ఏ విధంగా టోకెన్లు జారీచేస్తున్నాయి అనేది కూడా సమాధానం లేని ప్రశఽ్నగా మిగిలిపోయింది.

Updated Date - 2023-08-22T01:35:05+05:30 IST