టీడీపీలో జోష్‌

ABN , First Publish Date - 2023-03-19T01:02:31+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఘన విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

టీడీపీలో జోష్‌
అనకాపల్లిలో టీడీపీ శ్రేణుల సంబరాలు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవిరావు ఘన విజయంతో నూతనోత్సాహం

వాడవాడలా సంబరాలు

రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇది శుభారంభమని ఆనందం

పట్టభద్రుల తీర్పుపై వైసీపీ షాక్‌

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఘన విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో టీడీపీ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి, కేక్‌లు కట్‌ చేసుకొని జై టీడీపీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ గద్దెనెక్కిన వైసీపీ గత మూడున్నరేళ్లలో చేపట్టిన పలు ప్రజా వ్యతిరేక విధానాలపై విసుగు చెందిన విజ్ఞులైన పట్టభద్ర ఓటర్లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రం విద్య, వైద్య, పారిశ్రామిక, ఉద్యోగాల కల్పన వంటి రంగాల్లో అగ్రపథంలో నిలవాలంటే టీడీపీకి పట్టం కడితేనే సాధ్యమని ప్రజలు గుర్తించారని అంటున్నారు. ఇదే ఒరవడి వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని టీడీపీ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు తెలిపారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అఖండ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్సీగా చిరంజీవిరావు విజయం సాధించిన సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులు పీలా గోవింద సత్యనారాయణ(అనకాపల్లి), బత్తుల తాతయ్యబాబు(చోడవరం), బండారు సత్యనారాయణమూర్తి (పెందుర్తి), వంగలపూడి అనిత(టీడీపీ), ప్రగడ నాగేశ్వరరావు(ఎలమంచిలి), పీవీజీ కుమార్‌(మాడుగుల), మాజీ ఎమ్మెల్యేలు కేఎస్‌ఎన్‌రాజు, రామానాయుడు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిఽధులు, పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో పెద్దత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, కేక్‌లు కట్‌ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు.

వైసీపీకి పట్టభద్ర ఓటర్ల షాక్‌

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పట్టభద్రులు టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్సీగా పట్టం కట్టారు. గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు షాక్‌ ఇచ్చారు. అయితే చిరంజీవిరావు ఘన విజయం సాధించడంతో వైసీపీలో అంతర్మథనం మొదలైంది. జిల్లాలోని ఇద్దరు మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డినా వైసీపీ అభ్యర్థి గెలవకపోవడంతో కంగుతిన్నారు. ప్రతికూల ఫలితాలపై సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఏం సమాధానం చెప్పాలి? అనేదానిపై వీరంతా మధనపడుతున్నట్టు తెలిసింది.

Updated Date - 2023-03-19T01:02:31+05:30 IST