విస్సన్నపేట భూ కుంభకోణంపై విచారణకు సిద్ధం
ABN , First Publish Date - 2023-05-26T01:04:00+05:30 IST
కశింకోట మండలం విస్సన్నపేట భూ కుంభకోణంపై ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి అమర్‌నాథ్, ఆయన బినామీలకు జనసేన పార్టీ నేతలు దూలం గోపీ, తాడి రామకృష్ణ, మళ్ల శ్రీను సవాల్ విసిరారు.

కొత్తూరు, మే 25: కశింకోట మండలం విస్సన్నపేట భూ కుంభకోణంపై ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి అమర్‌నాథ్, ఆయన బినామీలకు జనసేన పార్టీ నేతలు దూలం గోపీ, తాడి రామకృష్ణ, మళ్ల శ్రీను సవాల్ విసిరారు. గురువారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. బయ్యవరం రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబరు 195/2 విస్సన్నపేటలో జరిగిన భూ కుంభకోణంపై సీబీఐ విచారణకైనా, జ్యూడిషియల్ విచారణకైనా జనసేన పార్టీ నేతలంతా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్, అతని బినామీలు సిద్దమా అని ప్రశ్నించారు. మంత్రి బినామీ అయిన బొడ్డేడ ప్రసాద్ న్యాయ విచారణకు సిద్ధమని చెబుతూ అడ్వకేట్‌ను పెట్టుకొని కోర్టుకు వెళ్దామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉండి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం వైసీపీ నేతలు అడిగిన అఫిడవిట్‌తో జనసేన పార్టీ సిద్ధంగా ఉందన్నారు. విస్సన్నపేట భూ కుంభకోణంపై శుక్రవారం నాలుగురోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణకు మంత్రి, ఆయన బినామీలు రావాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులకు దమ్ముంటే జనసేన పార్టీ నేతలు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ శ్రేణులు భరణికాన రాము, ప్రసాద్ పాల్గొన్నారు.