వాన కురిసె..
ABN , First Publish Date - 2023-03-19T01:34:51+05:30 IST
వాతావరణంలో మార్పుల కారణంగా మండలంలో శనివారం మధ్యాహ్న భారీ వర్షం కురిసింది. ఏఎల్‌పురం, కొంగశింగి, సీహెచ్.నాగాపురం, లింగంపేట, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కుండపోత వాన పడింది.

కృష్ణాదేవిపేటలో ఎటుచూసినా నీరే.. గాలికి విరిగిపడిన చెట్టు
గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో సేదదీరిన జనం
కృష్ణాదేవిపేట, మార్చి 18 : వాతావరణంలో మార్పుల కారణంగా మండలంలో శనివారం మధ్యాహ్న భారీ వర్షం కురిసింది. ఏఎల్‌పురం, కొంగశింగి, సీహెచ్.నాగాపురం, లింగంపేట, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కుండపోత వాన పడింది. గత కొంతకాలంగా ఎండతో అల్లాడిపోతున్న ప్రజానీకం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో సేదదీరారు. ప్రధానంగా మేజర్ పంచాయతీ ఏఎల్‌పురంలో వర్షపునీరు ఎటూపారే పరిస్థితి లేకపోవడంతో మురుగునీటితో కలిసి సీసీ రోడ్డుపై, లోతట్టు ప్రాం తాల్లో చేరింది. దీంతో అక్కడివారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణాదేవిపేటలోని ఆర్టీసీ బస్‌స్టేషన్ ఆవరణ వర్షం నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అలాగే కృష్ణాదేవిపేట పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడను అనుకొని ఉన్న రోడ్డుపై భారీ చెట్టు నేలకూలింది. దీంతో విద్యుత్‌వైర్లు తెగి పడి స్తంభాలు నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈదురుగాలులు దక్షిణం వైపు రావడంతో చెట్టు రోడ్డుపై పడింది. అదే ఉత్తరం వైపు గాలులు వీచి ఉంటే పోలీస్ స్టేషన్‌పై పడిపెనుప్రమాదం జరిగి ఉండేదని పలువురు పేర్కొన్నారు. ఈ కారణంగా గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
నర్సీపట్నం : పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో శనివారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత కొనసాగినప్పటికీ మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో మోస్తరుగా వానపడడంతో చల్లడింది. దీంతో జనం సేదదీరారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రశాంతినగర్, బ్యాంక్ కాలనీ, వెంకునాయుడుపేట ఎంపీపీ స్కూల్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్, తహసీల్దార్ కార్యాలయం ఎదురురోడ్లపై వర్షపు నీటితో పాటు మురుగు చేరడంతో వాహనదారులు అవస్థలకు గురయ్యారు.
మాకవరపాలెం : మండలంలో శనివారం మధ్యాహ్నం నుంచి చిరు జల్లులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మాకవరపాలెం, తామరం, కొండలఅగ్రహారం, గిడుతూరు, రాచపల్లి గ్రామాలు తడిసిముద్దయ్యాయి. ఈ వర్షంతో జీడి,మామిడి తోటలకు నష్టమని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నాతవరం : మండలంలో శనివారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ మండినప్పటికీ ఆ తరువాత ఒక్కసారిగా వాతావణం మారి వర్షం పడింది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో పిడుగులు పడడంతో రాత్రి ఏడున్నర గంటల వరకు విద్యుత్ సరాఫరా నిలిచిపొయింది.
చోడవరం : వాతావరణం ప్రభావంతో శనివారం సాయంత్రం పట్టణంలో చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత కొనసాగినప్పటికీ సాయంత్రం నుంచి మబ్బులుకమ్మి ఆకాశం మేఘావృతమైంది. ఆ తరువాత చల్లని గాలులతో పాటు, చిరుజల్లులు కురవడంతో పూర్తిగా చల్లబడింది.
బుచ్చెయ్యపేట : ఉరుములు, మెరుపులతో శనివారం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడ తీవ్రత కొనసాగినప్పటికీ నాలుగు గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షానికి అం తటా చల్లబడింది.
రావికమతం : మండలంలో శనివారం మధ్నాహ్నం వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై గాలులతో వానపడింది. దీంతో అంతటా చల్లబడగా, రైతులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు.
మాడుగుల రూరల్ : వాతావరణంలో మార్పుల కారణంగా మాడుగుల మండలంలో శనివారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత కొనసాగినప్పటికీ సాయంత్రం నాలుగు గంటలకు ఆకాశం మేఘావృతమై సాయంత్రం ఆరు గంటల వరకు మోస్తరు వర్షం కురిసింది. ఆ తరువాత తెరిపిచ్చినప్పటికీ రాత్రి ఎనిమిది గంటల నుంచి చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. గాలులతో కూడిన వర్షం పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
చీడికాడ : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం అకాల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ మండినప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వేరుశనగ, కార్సి చెరకుతోటలు ఉన్న రైతులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు. మెట్టు పంటలకు కూడా ఉపయోగకరమని అంటున్నారు.
దేవరాపల్లి : మండలంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ఈ వర్షం కూరగాయలు, నువ్వు పంటకు, చెరకు, సరుగుడు తోటలకు మేలు చేయనుండగా, మామిడి, జీడిమామిడికి నష్టం చేకూర్చనుందని పలువురు రైతులు చెపుతున్నారు. ఇదిలావుంటే, వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో రాత్రి ఏడు గంటలకు సిబ్బంది పునరుద్ధరించారు.