ఇసుక దోపిడీ
ABN , First Publish Date - 2023-05-27T00:54:36+05:30 IST
జిల్లాలో నదులు, గెడ్డలు, వాగుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇసుక తవ్వకాలకు అధికారికంగా ఎక్కడా అనుమతులు లేకపోయినప్పటికీ వైసీపీ నాయకులు తెర వెనుక ఉండి ఇసుక తవ్వకాలు, విక్రయాలు సాగిస్తున్నారు. వేసవిలో ఇళ్ల నిర్మాణలు జోరందుకోవడం, మరోవైపు ప్రైవేటు కంపెనీ ఇసుక సరఫరా కాంట్రాక్టు ముగియడంతో ఇసుకకు గిరాకీ పెరిగింది.

జిల్లాలోని నదుల్లో యథేచ్ఛగా తవ్వకాలు
తెరవెనుక అధికార పార్టీ నాయకులు
స్థానిక అవసరాల మాటున రెవెన్యూ, గనుల శాఖల నుంచి అనుమతులు
ఒక బండి ఇసుకకు రశీదు.. పది బండ్ల ఇసుక తరలింపు
ముడుపులు ముడుతుండడంతో పట్టించుకోని అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో నదులు, గెడ్డలు, వాగుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇసుక తవ్వకాలకు అధికారికంగా ఎక్కడా అనుమతులు లేకపోయినప్పటికీ వైసీపీ నాయకులు తెర వెనుక ఉండి ఇసుక తవ్వకాలు, విక్రయాలు సాగిస్తున్నారు. వేసవిలో ఇళ్ల నిర్మాణలు జోరందుకోవడం, మరోవైపు ప్రైవేటు కంపెనీ ఇసుక సరఫరా కాంట్రాక్టు ముగియడంతో ఇసుకకు గిరాకీ పెరిగింది. స్థానిక అవసరాలకు టైరు బళ్లతో నదుల్లో నుంచి ఇసుక తెచ్చుకోవచ్చనే వెసులుబాటును అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇసుక అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో కొంతమొత్తాన్ని రెవెన్యూ, పోలీసు, గనుల శాఖల అధికారులకు ముడుపులుగా చెల్లిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో అనకాపల్లి, చోడవరం, దేవరాపల్లి, వి.మాడుగుల, ఎస్.రాయవరం, పాయకరావుపేట, తదితర మండలాల్లోని నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. అనకాపల్లి, చోడవరం, దేవరాపల్లి మండలాల్లో వివిధ ప్రాంతాల్లో శారదా నది నుంచి రోజూ రూ.10 లక్షలు నుంచి రూ.20 లక్షల విలువ చేసే ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతున్నారు. మాడుగుల, బుచ్చెయ్యపేట మండలాల్లో బొడ్డేరు, పెద్దేరు నదుల్లో, ఎస్.రాయవరం మండలంలో వరహా నదిలో, పాయకరావుపేట మండలంలో తాండవ నదితోపాటు పక్కనే వున్న జిరాయితీ భూముల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అనకాపల్లి మండలం తగరంపూడి వద్ద అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడి కనుసన్నల్లోనే ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. పదుల సంఖ్యలో టైర్ బళ్లను ఏర్పాటు చేసుకుని, నదిలో నుంచి ఇసుక తవ్వి సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో కుప్పలుగా పోస్తున్నారు. చీకటి పడిన తరువాత చుట్టుపక్కల గ్రామాలకు అయితే ట్రాక్టర్లలో, దూర ప్రాంతాలకు అయితే లారీల్లో రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చోడవరం మండలం గజపతినగరం, జుత్తాడ, గౌరీపట్నం, గవరవరం; దేవరాపల్లి మండలం తిమిరాం, కలిగొట్ల; వి.మాడుగుల మండలం వాడపాడు, సాగరం, బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట; ఎలమంచిలి, ఎస్.రాయవరం మండలాల పరిధిలో వరహా నదిలో దార్లపూడి వద్ద స్థానిక అవసరాల మాటున ఇసుక తవ్వుకుపోతున్నారు. వాస్తవానికి స్థానిక అవసరాలకు నదుల్లో నుంచి ఇసుక తీసుకెళ్లాలంటే తహసీల్దారు, జలవనరుల శాఖల అనుమతితో స్థానిక గ్రామ సచివాలయంలో వీఆర్‌ఓ ద్వారా పరిమితి మేరకు అనుమతి ఇవ్వాలి. ఎంతమేరకు అవసరమైతే అంతే తవ్వకాలు జరిపి, టైర్ బళ్లతో తీసుకెళ్లాలి. కానీ ఇసుకాసురులు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. వీఆర్‌ఓల ద్వారా ఒక బండి ఇసుకకు అనుమతి తీసుకొని పది బండ్ల ఇసుకను రవాణా చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే... స్థానిక అవసరాల కోసం ఇసుక తరలిస్తున్నామంటూ వీఆర్‌ఓ జారీ చేసిన రశీదులను (పాతవి) చూపుతున్నారు. జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఇటీవల ఇసుక రవాణా చేస్తున్న తొమ్మిది టైర్ బళ్లను ఎస్.రాయవరం పోలీసులు స్వాధీనం చేసుకొని అపరాధ రుసుము విధించారు. పాయకరావుపేట మండలం మాసాహేబ్‌పేట రెవెన్యూ పరిధిలో తాండవ నది పక్కన జిరాయితీ భూముల్లో కొంతమంది ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. జిరాయితీ భూముల్లో ఇసుక తవ్వకాలు జరపాలన్నా, రెవెన్యూ, గనుల శాఖల అనుమతి తప్పనిసరి. కానీ ఇక్కడ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన అధికారులు చెబుతున్నారు... కానీ పట్టించుకోవడంలేదు.
ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు
సుబ్బారాయుడు, ఏడీ, గనుల శాఖ, అనకాపల్లి
జిల్లాలో నదులు, జిరాయితీ భూముల్లో ఇసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు... ఇచ్చే అవకాశం కూడా లేదు. పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం జిల్లాలో నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదు. జిరాయితీ భూముల్లో ఇసుక తవ్వకాలు జరపాలన్నా తప్పనిసరిగా అనుమతి పొందాలి. లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.