రైతు బజార్ కలేనా?
ABN , First Publish Date - 2023-07-21T01:10:06+05:30 IST
జిల్లా కేంద్రమైన అనకాపల్లికి రైతు బజార్ మంజూరై మూడేళ్లు దాటినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రైతు బజార్ నిర్మించే ఉద్దేశం మార్కెటింగ్ శాఖ అధికారులకు వుందా? లేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రైతు బజార్ ఏర్పాటు చేయాలని రెండు దశాబ్దాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని అటు రైతులు, ఇటు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు దశాబ్దాలుగా రైతులు, అనకాపల్లివాసులు ఎదురుచూపులు
టీడీపీ హయాంలో మార్కెట్ యార్డు, డీసీఎంఎస్ స్థలాలు పరిశీలన
నిర్ణయం తీసుకునేలోగా మారిన ప్రభుత్వం
రైతు బజార్ మంజూరు చేస్తూ మూడున్నరేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు
గత ఏడాది ఏప్రిల్ వరకు బయటపెట్టని అధికారులు
జిల్లా పునర్విభజన తరువాత వెల్లడి
డీసీఎంఎస్, జీవీఎంసీ స్థలాలు పరిశీలన
స్థలం ఇవ్వడానికి డీసీఎంఎస్ ససేమిరా
జీవీఎంసీ స్థలం కోసం కమిషనర్‌కు ప్రతిపాదనలు
అనకాపల్లి టౌన్, జూలై 20:
జిల్లా కేంద్రమైన అనకాపల్లికి రైతు బజార్ మంజూరై మూడేళ్లు దాటినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రైతు బజార్ నిర్మించే ఉద్దేశం మార్కెటింగ్ శాఖ అధికారులకు వుందా? లేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రైతు బజార్ ఏర్పాటు చేయాలని రెండు దశాబ్దాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని అటు రైతులు, ఇటు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లిలోని గాంధీ మార్కెట్‌కు నిత్యం అనకాపల్లి, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి, చోడవరం తదితర మండలాల నుంచి రైతులు కూరగాయలను తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు. స్థానిక వ్యాపారులు నిర్ధారించిన ధరలకే అమ్ముకోవాల్సి వస్తున్నది. మరోవైపు వినియోగదారులు అధిక ధరలకు వ్యాపారుల నుంచి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. రైతు బజార్ ఏర్పాటు అయితే రైతులు నేరుగా వినియోగదారులకు కూరగాయలను అమ్ముకోవచ్చు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంతోపాటు వినియోగదారులకు మార్కెట్‌లోకన్నా తక్కువ రేటుకు కూరగాయలు అందుబాటులో వుంటాయి. దీంతో అనకాపల్లిలో రైతు బజారు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతంలో కూరగాయ పంటలు సాగు చేసే రైతులతోపాటు పట్టణానికి చెందిన వినియోగదారులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం హయాంలో రైతు బజార్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. డీసీఎంఎస్ స్థలం, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించారు. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేలోగా ప్రభుత్వం మారిపోవడంతో రైతుబజారు ఏర్పాటు అంశం మరుగున పడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనకాపల్లికి రైతు బజారు మంజూరు చేస్తూ 2020 మార్చి 5వ తేదీన మార్కెటింగ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఈ విషయాన్ని జిల్లాల పునర్విభజన జరిగే వరకు మార్కెటింగ్‌శాఖ అధికారులు బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో గత ఏడాది జూన్‌లో మార్కెటింగ్ శాఖ ఏడీగా వచ్చిన రవికిరణ్.. అనకాపల్లిలో రైతు బజార్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీనిని పరిశీలించిన కలెక్టర్... పట్టణంలో ఖాళీగా వున్న స్థలాలను పరిశీలించి నివేదిక అందజేయాలని ఆర్డీవోను ఆదేశించారు. ఆర్డీవో, మార్కెటింగ్ శాఖ అధికారులు కలిసి గాంధీ మార్కెట్ వద్ద నిరుపయోగంగా ఉన్న డీసీఎంఎస్ స్థలాన్ని, ప్రస్తుత డీసీఎంఎస్ కార్యాలయం వద్ద ఖాళీగా ఉన్న స్థలాన్ని, జీవీఎంసీ కార్యాలయం పక్కన వాహనాలను పార్కింగ్ చేసే స్థలాన్ని పరిశీలించారు. వీటిల్లో గాంధీ మార్కెట్ వద్ద డీసీఎంఎస్ స్థలం అన్నివిధాలా అనుకూలంగా వుంటుందని నిర్ణయించారు. ఈ స్థలాన్ని రైతు బజార్‌కు కేటాయించాలని డీసీఎంఎస్ పాలకవర్గాన్ని, అధికారులను కోరారు. అయితే ఇక్కడ వాణిజ్య దుకాణ సముదాయాన్ని నిర్మించే ఆలోచన వున్నట్టు వారు తెలిపారు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఒకవేళ ఇక్కడ వీలుకాకపోతే ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో రైతు బజార్ ఏర్పాటుకు వున్న అవకాశాలను పరిశీలిస్తామని అధికారులు చెప్పారు. స్థలం ఎంపిక కొద్ది రోజుల్లోనే ఒక కొలిక్కి వస్తుందని అప్పట్లో పేర్కొన్నారు. కానీ ఇంతవరకు రాలేదు.
కొబ్బరికాయల మార్కెట్ స్థలం పరిశీలన
ఇదిలావుండగా సాధువుల గుడి వద్ద గల కొబ్బరికాయల మార్కెట్ స్థలంలో రైతు బజార్ ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నట్టు తెలిసింది. ఈ స్థలం జీవీఎంసీది కావడంతో ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. దీనిపై మార్కెటింగ్ శాఖ ఏడీ రవికిరణ్‌ను వివరణ కోరగా, రైతు బజార్ ఏర్పాటు కోసం కొబ్బరికాయల మార్కెట్ స్థలాన్ని పరిశీలించినమాట వాస్తవమేనని చెప్పారు. జీవీఎంసీ కమిషనర్‌గా రాజాబాబు ఉన్నప్పుడు స్థలం కేటాయించాలని ప్రతిపాదనలు తయారు చేసి పంపినట్టు వెల్లడించారు. త్వరలో జిల్లా కలెక్టర్ దృష్టికి మరోసారి తీసుకువెళ్లి జీవీఎంసీ నుంచి స్థలం మంజూరయ్యేలా కృషి చేస్తానని చెప్పారు.
రాయితీపై టమాటాలు విక్రయించాలి
ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్నంటున్నాయి. ప్రభుత్వం రైతు బజార్లలో కిలో రూ.50 చొప్పున రాయితీపై విక్రయిస్తున్నది. అనకాపల్లిలో రైతుబజార్ లేకపోవడంతో స్థానికులు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.130 నుంచి రూ.150కి కొనుగోలు చేయాల్సి వస్తున్నది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉల్లిపాయలు కిలో రూ.100లకు చేరింది. అనకాపల్లిలో రైతు బజార్ లేకపోయినప్పటికీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సబ్సిడీపై అమ్మకాలు జరిపించారు. వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో టమాటాలను మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రాయితీపై విక్రయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.