సెల్‌ఫోన్ పోయిందా.. ‘డోంట్ వర్రీ!
ABN , First Publish Date - 2023-01-18T00:22:28+05:30 IST
సెల్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగంగా మారింది. మొబైల్‌ఫోన్ లేకుండా ఒక్క గంట కూడా వుండలేని పరిస్థితికి చేరారంటే దీని ప్రాముఖ్యత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దినచర్యలో అత్యంత ముఖ్యంగా భావించే సెల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఎవరైనా అపహరించినా తీవ్ర ఆందోళన చెందుతుంటారు.
అందుబాటులోకి వాట్సాప్ నంబర్ 95052-00100
వేరే సెల్‌ఫోన్ నుంచి ‘హెచ్‌ఏఐ’ అని టైప్ చేసి మెసేజ్ పెట్టాలి
అనంతరం మొబైల్‌ట్రాక్ లింకు ప్రత్యక్షం
పూర్తి వివరాలు నమోదు
ప్రత్యేక మొబైల్ ట్రాక్‌తో ఫోన్ ఎక్కడుందో గుర్తింపు
స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగింత
చోరీకి గురైనట్టు నిర్ధారణ అయితే అపహరించిన వ్యక్తులపై కేసు నమోదు
జిల్లాలో ఇంతవరకు 520 వాట్సాప్ ఫిర్యాదులు
131 ఫోన్లు స్వాధీనం, విలువ రూ.25 లక్షలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
సెల్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగంగా మారింది. మొబైల్‌ఫోన్ లేకుండా ఒక్క గంట కూడా వుండలేని పరిస్థితికి చేరారంటే దీని ప్రాముఖ్యత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దినచర్యలో అత్యంత ముఖ్యంగా భావించే సెల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఎవరైనా అపహరించినా తీవ్ర ఆందోళన చెందుతుంటారు. వ్యక్తిగత వివరాలతోపాటు విద్య, వ్యాపార, ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి వారికి ఉపశమనం కలిగించి, పోయిన ఫోన్ తిరిగి చేతికి అందించే సదుపాయాన్ని అనకాపల్లి జిల్లా పోలీసులు కల్పించారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించి ప్రత్యేక సాంకేతిక విధానం ద్వారా సెల్‌ఫోన్‌లను గుర్తిస్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేస్తున్నారు.
సాధారణంగా సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సమీపంలోని స్టేషన్‌కు వెళుతుంటారు. ఫోన్ విలువ తక్కువగా ఉంటే ఫిర్యాదులను స్వీకరించడానికి కొన్ని స్టేషన్లలో పోలీసులు అంత ఆసక్తి చూపడంలేదు. బాగా ఖరీదైన ఫోన్ అయితే కేసు నమోదు చేసేందుకు అంగీకరించినా... ఫోన్ కొనుగోలుకు సంబంధించి బిల్లు వుందా? ఫోన్ ఎక్కడ పోయింది? ఇన్సూరెన్స్ ఉందా? అంటూ ప్రశ్నిస్తుంటారు. తగిన ఆధారాలను పోలీసులకు సమర్పించలేక బాధితులు తమ ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నారు. ఒకవేళ తగిన ఆధారాలు సమర్పించినా... ఫోన్ తిరిగి చేతికి వస్తుందన్న నమ్మకం ఉండేది కాదు. ఇటువంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని జిల్లా పోలీసు అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర పోలీసు శాఖ అనుమతి పొందిన ఒక వెబ్‌సైట్‌ను జిల్లా ఎస్పీ గౌతమిశాలి నేతృత్వంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
వాట్సాప్ నంబరుకు ఫిర్యాదు
సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. జిల్లా పోలీసు కార్యాలయం వాట్సాప్ నంబర్ 95052-00100కు వేరొక నంబరుతో వున్న సెల్‌ఫోన్ నుంచి ‘హెచ్‌ఏఐ’ (హాయ్) అని టైప్ చేసి మెసేజ్ పెట్టాలి. అనంతరం హెచ్‌టీటీ//ఏకేపీమొబైల్‌ట్రాక్.ఇన్ లింకు మీరు మెసేజ్ చేసిన ఫోన్‌కు వస్తుంది. ఆ లింకుపై నొక్కగానే గూగుల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. పోగొట్టుకున్న/ చోరీకి గురైన మొబైల్ ఫోన్ వివరాలు అడుగుతుంది. ఫోన్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబరు, ఇతర వివరాలను పొందుపర్చాలి. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఐటీ కోర్ టీమ్ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అప్లికేషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేస్తారు. ఫోన్ ఎక్కడ ఉంది? ఏ ప్రాంతంలో సిగ్నల్స్ తీసుకుంటున్నది? ఎవరు వాడుతున్నారు? వంటి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. ఫోన్ వినియోగిస్తున్న వ్యక్తితో పోలీసులు సంప్రదిస్తారు. ఫోన్ ఎలా వచ్చిందో అడుగుతారు. చోరీ చేసినట్టు నిర్ధారణ అయితే కేసు నమోదు చేసి, ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయానికి అందజేస్తారు. బాధితులను పిలిపించి పూర్తి వివరాలు, ఫోన్‌కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్‌లను పరిశీలించిన తరువాత వారికి అప్పగిస్తున్నారు.
రూ.25 లక్షల విలువ చేసే 131 సెల్‌ఫోన్‌లు అప్పగింత
జిల్లా పోలీస్ అధికారులు గత ఏడాది నవంబరులో ‘హెచ్‌ఏఐ’ (హాయ్)ని ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 520 వాట్సాప్ ఫిర్యాదులు అందాయి. రూ.25 లక్షలు విలువ చేసే 131 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. మిగిలిన ఫిర్యాదుల్లో 70 వరకు ఫోన్లు పోలీసుల ఆధీనంలో ఉండగా, 318 ఫిర్యాదులకు సంబంధించి సెల్‌ఫోన్లను ట్రాకింగ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో చోరీకి గురైన ఫోన్లలో కొన్నింటిని రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఏపీలోని గుంటూరు, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో స్వాధీనం చేసుకున్నారు.