జగనన్న లేఅవుట్‌లో అక్రమాలు

ABN , First Publish Date - 2023-03-02T00:59:47+05:30 IST

ఎవరెవరికో రోడ్డు పక్కన స్థలాలు ఇచ్చి...భూములు ఇచ్చిన వారికి చివరన, లోతట్టు ప్రాంతాల్లో ఇస్తామంటే అంగీకరించేది లేదని మండలంలోని నరసాపురానికి చెందిన రైతులు బుధవారం రెవెన్యూ అధికారులకు తేల్చిచెప్పారు. గ్రామసభను బహిష్కరించారు.

జగనన్న లేఅవుట్‌లో అక్రమాలు

పద్మనాభం, మార్చి 1: ఎవరెవరికో రోడ్డు పక్కన స్థలాలు ఇచ్చి...భూములు ఇచ్చిన వారికి చివరన, లోతట్టు ప్రాంతాల్లో ఇస్తామంటే అంగీకరించేది లేదని మండలంలోని నరసాపురానికి చెందిన రైతులు బుధవారం రెవెన్యూ అధికారులకు తేల్చిచెప్పారు. గ్రామసభను బహిష్కరించారు. జగనన్న ఇళ్ల కాలనీల కోసం తునివలస పంచాయతీ పరిధిలోని నరసాపురం గ్రామంలో సుమారు 22 మంది రైతుల వద్ద అధికారులు భూములు సమీకరించారు. నేరేళ్లవలసలో వేసిన జగనన్న కాలనీ లేఅవుట్‌లో మూడు ఎకరాలను వీరికి పరిహారంగా ఇవ్వడానికి కేటాయించారు. ఈ లేఅవుట్‌లో లాటరీ ప్రకారం స్థలాలు కేటాయించడానికి పద్మనాభం తహసీల్దార్‌ కె.వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో బుధవారం నేరేళ్లవలసలో గ్రామసభను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇవ్వని అధికార పార్టీ నాయకులైన జెడ్పీటీసీ సభ్యుడు ఎస్‌.గిరిబాబు, ఆయన భార్య, ఆయన డ్రైవర్‌, తదితరులకు రోడ్డు పక్కన స్థలాలు ఎలా ఇచ్చారని అధికారులను నిలదీశారు. వారికి రోడ్డుకు దగ్గరలో వున్న స్థలాలు ఇచ్చి తమకు చివరన లోతట్టు ప్రాంతంలో కేటాయించడమేమిటని ప్రశ్నించారు. మూడేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు ప్లాట్లు కేటాయించకుండా, అసలు భూములు ఇవ్వని వారికి ఎలా ఇచ్చారని అడిగారు. తమ భూములను అమ్మేస్తేనే ప్లాట్లు వస్తాయని లేకపోతే రావని బెదిరించారని రైతులు ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందని కొంతకాలంగా తహసీల్దార్‌, ఆర్డీఓ, జిల్లా కలక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని, ఎవరూ పట్టించుకోలేదన్నారు. లేఅవుట్‌లో నిర్మాణాలను అడ్డుకోవడంతోనే ఇప్పుడైనా రెవెన్యూ అధికారులు గ్రామసభను ఏర్పాటుచేశారని రైతులు ఆరోపించారు. తమకు కూడా రోడ్డు పక్కన స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ...అప్పటివరకూ లాటరీ తీసేందుకు అంగీకరించబోమని గ్రామసభ నుంచి రైతులు నిష్క్రమించారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.

Updated Date - 2023-03-02T00:59:47+05:30 IST