రేపటి నుంచి పెట్టుబడుల సదస్సు
ABN , First Publish Date - 2023-03-02T03:16:02+05:30 IST
విశాఖపట్నంలో ఈ నెల 3, 4 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
వేదికగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో ఈ నెల 3, 4 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కనీసం రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 25 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ప్రకటించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలోని 50 ఎకరాల్లో కేవలం వాహనాల పార్కింగ్‌కే 25 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 25 ఎకరాల్లో ఐదు జర్మన్ హ్యాంగర్లు వేశారు. 4వేల మంది కూర్చునేందుకు వీలుగా ఓ పెద్ద హాలు, 50మంది ఆశీనులు కావడానికి వేదికను సిద్ధం చేశారు. నాలుగు వేల మందికి భోజనాల కోసం మరో హాలు, సీఎం కోసం ప్రత్యేకంగా ఒక లాంజ్, చర్చలు, సమావేశాలకు మరో రెండు హాళ్లు కేటాయించారు. అతిథుల కోసం నగరంలోని స్టార్ హోటళ్లలో 750కు పైగా సూట్‌లు, రూమ్‌లు బుక్ చేశారు. ఇవికాకుండా మరో వెయ్యి గదులు తీసుకున్నారు. విదేశీ అతిథుల వ్యక్తిగత అవసరాల కోసం కార్వాన్లు కూడా రప్పించారు. అన్ని దేశాల వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు అందించేందుకు పేరొందిన హోటళ్ల చెఫ్‌లతో వంటకాలు చేయిస్తున్నారు. వీరందరికీ మూడో తేదీ సాయంత్రం ఆర్‌కే బీచ్‌లోని ఎంజీఎం పార్కులో డిన్నర్ ఏర్పాటు చేశారు. కాగా, ఇన్వెస్టర్ల సదస్సుతో పాటు నెలాఖరులో జి-20 సదస్సు కూడా నగరంలో నిర్వహించనున్న నేపథ్యంలో అతిథులను ఆకట్టుకునే లా రూ.100కోట్లతో సుందరీకరణ పనులు చేస్తున్నారు.
భద్రతకు ప్రాధాన్యం
అంబానీ, అదానీ, టాటా, బిర్లా తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు వస్తుండటంతో భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చారు. సదస్సుకు వచ్చే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా క్యూఆర్ కోడ్‌లు పంపించారు. వాటిని స్కాన్ చేశాకే లోపలకు అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సు కోసం సీఎం జగన్ గురువారం రాత్రి విశాఖ చేరుకొని పోర్టు అతిథిగృహంలో బస చేస్తారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బుధవారమే ఇక్కడకు చేరుకున్నారు.