డిప్యూటీ డీఈవో పాఠశాలల తనిఖీ

ABN , First Publish Date - 2023-03-01T00:32:42+05:30 IST

గొలుగొండ మండలం చోద్యం, ఏఎల్‌పురం హైస్కూళ్లను అనకాపల్లి జిల్లా డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు.

డిప్యూటీ డీఈవో పాఠశాలల తనిఖీ
చోద్యం హైస్కూల్‌లో పేరెంట్‌ కమిటీ సభ్యులతో విచారణ జరుపుతున్న డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్‌

చోద్యం హైస్కూల్‌పై స్పందనలో వచ్చిన ఫిర్యాదుపై విచారణ

కృష్ణాదేవిపేట, ఫిబ్రవరి 28: గొలుగొండ మండలం చోద్యం, ఏఎల్‌పురం హైస్కూళ్లను అనకాపల్లి జిల్లా డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా చోద్యం హైస్కూల్‌లో నాడు-నేడు పనుల్లో అవినీతి జరిగిందని స్కూల్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అచ్చియ్యనాయుడు స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై హైస్కూల్‌లో పేరెంట్‌ కమిటీ సభ్యులతో విచారణ చేపట్టారు. నాడు- నేడు పనులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం భోజనం రుచిచూసి సంతృప్తి వ్యక్తం చేశారు. సైన్స్‌ డే సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం ఏఎల్‌పురం హైస్కూల్‌లో విద్యుత్‌ బకాయితో మూలన పడిన రూ.30లక్షల హెచ్‌పీ కంటైయినర్‌, మరమ్మతులకు గురైన బెంచీలను పరిశీలించి తగిన నివేదిక అందించాలని హెచ్‌ఎం భారతిని ఆదేశించారు. 6 నుంచి 10వ తరగతి గదులను సందర్శించి విద్యార్థులను ప్రశ్నలు వేసి జవాబు రాబట్టుకున్నారు. కొంతమంది విద్యార్థులు చదువులో వెనుకబడినట్టు గుర్తించారు. ఉపాధ్యాయులతో హెచ్‌ఎం సమావేశం ఏర్పాటు చేసి లోపాలను సరిచేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈవో విలేఖరులతో మాట్లాడుతూ స్పందన ఫిర్యాదుపై ఆర్‌జేడీ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చోద్యం హైస్కూల్‌లో విచారణ చేపట్టామని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. అలాగే ఏఎల్‌పురం హైస్కూల్‌లో సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ ఎంఈవో సత్యనారాయణ, మాజీ ఎంఈవో గండేపల్లి నాగేంద్ర, గొలుగొండ, నర్సీపట్నం నోడల్‌ హెచ్‌ఎంలు ఎవీఎన్‌ఎస్‌ మూర్తి, సత్యనారాయణ, రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బొందల రాజు, వైస్‌ ఎంపీపీ సుర్ల బాబ్జీ, లింగంపేట సర్పంచ్‌ సంతోశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-01T00:32:42+05:30 IST