దీక్షలు, ప్రదర్శనలు

ABN , First Publish Date - 2023-09-27T01:18:20+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

దీక్షలు, ప్రదర్శనలు

చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలు

అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు, పలుచోట్ల కాగడాల ప్రదర్శన

ఉండవల్లి, ఒవైసీల వ్యాఖ్యలపై తెలుగు మహిళల నిరసన

గాజువాకలో చేతులకు సంకెళ్లతో మోకాళ్లపై కూర్చున్న పల్లా, ఇతర నేతలు

విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబునాయుడు కేసును సీబీఐకి అప్పగించాలన్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌, జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుందని కితాబిచ్చిన అసదుద్దీన్‌ ఒవైసీల తీరును ఎండగడుతూ మంగళవారం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఉండవల్లి, ఒవైసీలకు జగన్మోహన్‌రెడ్డి వాయినాల రూపంలో బ్యాగ్‌లు/బహుమతులు ఇచ్చారనే అర్థం వచ్చేలా ముఖాలకు వారి మాస్క్‌లు తగిలించుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ గతంలో రాజశేఖర్‌రెడ్డి వద్ద ప్యాకేజీ తీసుకుని రామోజీరావుపై ఉండవల్లి కేసు వేశారని, ఇప్పుడు జగన్‌రెడ్డి దగ్గర ప్యాకేజీ తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు దమ్ముంటే 32 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్మోహన్‌రెడ్డిపై విచారణను వేగవంతం చేయాలని కోరాలన్నారు. అలాగే ఏనాడూ రాష్ట్రంలో ముస్లింల బాగోగులు గురించి పట్టించుకోని ఒవైసీ...జగన్‌రెడ్డి పాలన బాగుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో గణగళ్ల సత్య రామలక్ష్మి, రాంబాబు, రాణి, పుష్ప, జ్యోతి, మంగ పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గంలోని 34వ వార్డులో గల మనోరమ థియేటర్‌ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి జగన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఇన్‌చార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో నేతలు ప్రజలకు విడమరిచి చెప్పారు. 31, 32, 33 వార్డుల్లో నిర్వహించిన నిరసన దీక్షల్లో గండి బాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అరెస్టును అన్నివర్గాల ప్రజలు ఖండిస్తున్నారన్నారు. జగన్‌రెడ్డి ఆస్తులు ఐదేళ్లలో రూ.లక్షల కోట్లు మేర పెరిగాయని, అంటే ఎంత అవినీతి చేశారో అర్థం చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు దాసరి దుర్గారెడ్డి, మహేష్‌ బంటుపల్లి, సూర్యనారాయణ వాసుపల్లి, రామ్‌కుమార్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ పుక్కల రాజేశ్వరి పాల్గొన్నారు. అలాగే, గాజువాక నియోజకర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలియజేశారు. జైలులో ఉన్నట్టు చేతులకు బేడీలు వేసుకుని, మోకాళ్లపై నిల్చొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ చంద్రబాబునాయుడును కుట్రపూరితంగా అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతుందన్నారు. నిరసన దీక్షకు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మద్దతు తెలిపి చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. జగన్‌రెడ్డి దుర్మార్గ పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. కార్యక్రమంలో సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, కార్పొరేటర్‌లు బొండా జగన్‌, పల్లా శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు. భీమిలిలో మండల పార్టీ అధ్యక్షులు దంతులూరి అప్పలనరసింహరాజు ఆధ్వర్యంలో నాయకులు అర్థనగ్న ప్రదర్శనలతో నిరసన తెలిపారు.

Updated Date - 2023-09-27T01:18:20+05:30 IST