రుషికొండలో ఇన్ఫోసిస్
ABN , First Publish Date - 2023-02-05T01:27:36+05:30 IST
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ఎట్టకేలకు విశాఖపట్నంలో భవనం సమకూరింది.
ఐటీ పార్కులో ‘సిగ్నిటీ సొల్యూషన్’ సంస్థకు చెందిన భవనం ఎంపిక
ఒకటి, రెండు నెలల్లో ప్రారంభించే అవకాశం
సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) వద్ద కూడా సంస్థ పేరు నమోదు
విశాఖపట్నం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ఎట్టకేలకు విశాఖపట్నంలో భవనం సమకూరింది. రుషికొండ ఐటీ పార్కులో సిగ్నిటీ సొల్యూషన్ సంస్థ భవనాన్ని ఆ కంపెనీ ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. పూర్తి కావడానికి ఒకటి, రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. విశాఖపట్నంలో శాటిలైట్ సెంటర్ ప్రారంభించాలని యోచిస్తున్నట్టు గత ఏడాది జూన్‌లో ఇన్ఫోసిస్ ప్రకటించింది. అక్టోబరు నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ పనిచేస్తుందని ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రకటించారు. వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తున్నదని, వారు కోరినవి ఇవ్వడానికి ఒప్పుకున్నామని చెప్పారు. అయితే ఇన్ఫోసిస్ వంటి సంస్థలు భవనం విషయంలో సాంకేతికంగా అన్ని సక్రమంగా వుంటేనే ముందడుగు వేస్తాయి. వారు ఆశించిన ప్రమాణాలతో భవనాలు లభించకపోవడంతో ఇన్నాళ్లూ జాప్యం జరిగింది. ఐటీ సెజ్‌లో వద్దని ముందు నిరాకరించినా...ఇప్పుడు రుషికొండ ఐటీ పార్కులోని భవనాన్నే ఎంపిక చేసుకున్నారు. మరోవైపు విశాఖలోని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) వద్ద కూడా సంస్థ పేరును నమోదు చేయించారు. ఉద్యోగులు, భవనం, ఉత్పత్తులు, ఎగుమతులు వంటి అంశాలపై త్వరలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విశాఖ కార్యాలయాన్ని శిక్షణ కేంద్రంగా ఉపయోగించుకొని దశల వారీగా ఇక్కడ రిక్రూట్‌మెంట్ చేయాలనే యోచన వున్నట్టు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటికే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానంలో పనిచేసే వారితోనే ఈ కార్యాలయాన్ని నడుపుతారని చెబుతున్నారు. ఆ తరువాత కొత్తవారికి అవకాశాలు కల్పిస్తారంటున్నారు.