ఇదేం శిక్ష!
ABN , First Publish Date - 2023-01-15T01:17:26+05:30 IST
సమగ్రశిక్షా అభియాన్ విభాగంలో పనిచేసే అధికారుల నుంచి కిందిస్థాయి అటెండరు వరకు, అలాగే తాత్కాలిక ఉద్యోగులు కూడా ప్రతి నెలా జీతాలకు ఇబ్బంది పడుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వారం రోజులు ఆలస్యంగా జీతాలు బట్వాడా అవుతుండగా, సమగ్రశిక్షా అభియాన్‌లో పనిచేసే ఉద్యోగులకు ఈ నెల 14 వరకు జీతాలు అందలేదు. సంక్రాంతి పండగకు పిల్లలకు వస్త్రాలు, ఇంట్లో పూజలు, ఇతర ఖర్చులకు అప్పులు చేయాల్సి వచ్చిందని ఉద్యోగులు వాపోతున్నారు. సమగ్రశిక్షా అభియాన్‌లోని ఉద్యోగులకు ప్రతి నెలా బడ్జెట్‌ను రాష్ట్రస్థాయి కార్యాలయం విడుదల చేస్తుంది.
- జీతాల కోసం సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగుల ఎదురుచూపులు
- అనకాపల్లి, అల్లూరి జిల్లాల సిబ్బంది ఆకలి కేకలు
- అల్లూరి జిల్లాలో కేజీబీవీలో నాన్ టీచింగ్‌కు అందని నవంబరు జీతం
- ప్రతి నెలా బడ్జెట్ కోసం నిరీక్షణ
విశాఖపట్నం, జనవరి 14(ఆంధ్రజ్యోతి):
సమగ్రశిక్షా అభియాన్ విభాగంలో పనిచేసే అధికారుల నుంచి కిందిస్థాయి అటెండరు వరకు, అలాగే తాత్కాలిక ఉద్యోగులు కూడా ప్రతి నెలా జీతాలకు ఇబ్బంది పడుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వారం రోజులు ఆలస్యంగా జీతాలు బట్వాడా అవుతుండగా, సమగ్రశిక్షా అభియాన్‌లో పనిచేసే ఉద్యోగులకు ఈ నెల 14 వరకు జీతాలు అందలేదు. సంక్రాంతి పండగకు పిల్లలకు వస్త్రాలు, ఇంట్లో పూజలు, ఇతర ఖర్చులకు అప్పులు చేయాల్సి వచ్చిందని ఉద్యోగులు వాపోతున్నారు. సమగ్రశిక్షా అభియాన్‌లోని ఉద్యోగులకు ప్రతి నెలా బడ్జెట్‌ను రాష్ట్రస్థాయి కార్యాలయం విడుదల చేస్తుంది. అయితే ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల ప్రభావం ఈ విభాగంపై పడింది. రాష్ట్ర కార్యాలయం నుంచి బడ్జెట్ రావడంలో జాప్యం జరగడంతో డిసెంబరు నెల జీతం ఇప్పటి వరకు సిబ్బంది ఖాతాల్లో జమకాలేదు. విశాఖలో సమగ్రశిక్షా అభియాన్ కార్యాలయంలో ఉన్న నిఽధుల నుంచి సిబ్బందికి జీతాలు బట్వాడా చేశారు. తరువాత ప్రభుత్వ బడ్జెట్ ఇస్తే కార్యాలయం నిధికి జమ చేయాలని నిర్ణయించారు. అదే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సమగ్రశిక్షా అభియాన్ విభాగం కింద పనిచేసే పలు రకాల సిబ్బంది వెరసి 1500 మందికి ఇప్పటి వరకు జీతాలు అందలేదు. ఈ రెండు జిల్లాల్లో 35 కేజీబీవీల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్, పార్టుటైమ్ టీచర్లు, జిల్లా కార్యాలయాలతో పాటు మండల స్థాయిలో పనిచేసే ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఆర్‌టీ టీచర్లు, ఇతర సిబ్బంది జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి నెలా జీతం బట్వాడా ఆలస్యమైనా భరించామని, సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెలలో అయినా సకాలంలో జీతం వస్తుందని ఆశించామని, కానీ రాలేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. కాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 కేజీబీవీల్లో పనిచేసే సుమారు 100మందికి పైగా ఉద్యోగులకు నవంబరు నెల జీతం కూడా ఇంత వరకు అందలేదు.