Share News

జీడితోటలో హైడ్రామా

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:21 AM

సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా సుబ్బారెడ్డిపాలెం సమీపంలోని జీడితోటలో హైడ్రామా నడిచింది. శనివారం సామాజిక బస్సు యాత్ర సందర్భంగా పోలీసులు సీఐటీయూ నాయకుడు అడిగర్ల రాజుని అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నర్సీపట్నం బస్సు యాత్రతో వస్తున్న వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి మత్యాలనాయుడుకి వినతి పత్రం అందజేయడానికి సుబ్బారెడ్డిపాలెం సమీపంలోని జీడితోటలో సమావేశమయ్యారు.

జీడితోటలో హైడ్రామా
జీడితోటలో సమావేశమైన అంగన్‌వాడీలు కదలకుండా

- సమావేశమైన అంగన్‌వాడీలను చుట్టుముట్టిన పోలీసులు

- వైసీపీ బస్సు యాత్రను అడ్డుకుంటారని ముందస్తు చర్యలు

నర్సీపట్నం, డిసెంబరు 30 : సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా సుబ్బారెడ్డిపాలెం సమీపంలోని జీడితోటలో హైడ్రామా నడిచింది. శనివారం సామాజిక బస్సు యాత్ర సందర్భంగా పోలీసులు సీఐటీయూ నాయకుడు అడిగర్ల రాజుని అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నర్సీపట్నం బస్సు యాత్రతో వస్తున్న వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి మత్యాలనాయుడుకి వినతి పత్రం అందజేయడానికి సుబ్బారెడ్డిపాలెం సమీపంలోని జీడితోటలో సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అంగన్‌వాడీలు బస్సు యాత్రను అడ్డుకుంటారన్న అనుమానంతో ముందస్తు జాగ్రత్తగా జీడితోట వద్ద భారీగా పోలీస్‌ బలగాలను మోహరించారు. అదనపు డీఎస్పీ శ్రీనివాసరావు, నక్కపల్లి సీఐ అప్పన్న, పట్టణ ఎస్‌ఐ సుధాకరరావు, పది మంది రోప్‌ పార్టీ సిబ్బంది, మహిళా పోలీసులును మోహరించారు. ఈ సందర్భంగా ధగధగ మండే సూర్యుడ్ని చూడు.. అంగన్‌వాడీ సత్తా చూడు.. అంటూ అంగన్‌వాడీలు నినదించారు. డిమాండ్లు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తరువాత పోలీసులు అంగన్‌వాడీ సంఘం నాయకులతో చర్చలు జరిపారు. పది మంది అంగన్‌వాడీ సంఘం నాయకులు వస్తే ఎమ్మెల్యే ఇంటికి తీసుకు వెళ్లి వినతి పత్రం ఇప్పిస్తామని పోలీసులు చెప్పారు. అరెస్తు చేస్తారని అనుమానంతో తొలుత పోలీసులతో వెళ్లడానికి అంగన్‌వాడీలు అంగీకరించలేదు. ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చిన తరువాత పది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు పోలీసులతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘ నాయకులు(సీఐటీయూ, ఏఐటీయూసీ).. ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డికి వినతిపత్రం అందజేసి సమస్యలు తెలిపారు. అనంతరం జీడితోటలో మోహరించిన పోలీసులు వెనుదిరిగారు.

Updated Date - Dec 31 , 2023 | 12:21 AM