ఎంతమంది ఉన్నారు?, ఏం చేస్తున్నారు??

ABN , First Publish Date - 2023-05-26T01:37:19+05:30 IST

‘మీ గ్రూపులో సభ్యుల కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు?, ప్రతి సభ్యురాలి భర్త ఆధార్‌, ఫోన్‌ నంబర్లు, ఉద్యోగం చేస్తుంటే...ప్రభుత్వ ఉద్యోగమా?

ఎంతమంది ఉన్నారు?, ఏం చేస్తున్నారు??

డ్వాక్రా సభ్యుల కుటుంబీకుల వివరాలు సేకరణ

సభ్యురాలి భర్త ఉద్యోగ వివరాలు, ఫోన్‌, ఆధార్‌ నంబర్లు...

పిల్లలు చదువులు, ఉద్యోగాలు, వారి ఫోన్‌, ఆధార్‌ నంబర్లు కూడా...

రెండు రోజుల్లో సమాచారం అందజేయాల్సిందిగా

డ్వాక్రా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులకు ఆర్పీల ఆదేశం

సంక్షేమ పథకాల్లో వడబోత కోసమని అనుమానాలు

వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకంటున్న మరికొందరు

అర్హులైన వారికి ఉపాధి కల్పనకు అంటున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘మీ గ్రూపులో సభ్యుల కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు?, ప్రతి సభ్యురాలి భర్త ఆధార్‌, ఫోన్‌ నంబర్లు, ఉద్యోగం చేస్తుంటే...ప్రభుత్వ ఉద్యోగమా?, ప్రైవేటు ఉద్యోగమా?...పిల్లలు ఏం చదువుతున్నారు?, ఉద్యోగం చేస్తున్నారా?, వారి ఫోన్‌, ఆధార్‌ నంబర్లు...ఇత్యాది వివరాలన్నీ ఒక కాగితంపై రాసి గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులు అర్జంట్‌గా పంపించండి. రెండు రోజుల్లో వివరాలన్నీ ఆన్‌లైన్‌ చేయాలి. మెసేజ్‌ చూడలేదు...పంపించలేదంటే కుదరదు. సైట్‌ క్లోజ్‌ అయిపోతే మాకు సంబంధం లేదు’

...ఇదీ జోన్‌-2 పరిధిలోని యూసీడీ విభాగంలో పనిచేస్తున్న రీసోర్స్‌ పర్సన్‌ ఒకరు తన పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు పంపించిన వాట్సాప్‌ మెసేజ్‌.

జీవీఎంసీ పరిధిలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబ వివరాలను సేకరిస్తుండడంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంఘ సభ్యురాలి భర్త, పిల్లలు, ఇంకా ఇంట్లో ఎవరుంటే వారందరి ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ నంబర్లతోపాటు ఎవరెవరు ఏం చేస్తున్నారు?...వంటి వివరాలన్నీ సేకరించి రెండు రోజుల్లో తమకు అందజేయాలంటూ ఆర్పీలు తమ పరిధిలోని డ్వాక్రా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులను ఆదేశించడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

జీవీఎంసీ పరిధిలో 33 వేల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో సగటున 12 మంది అనుకున్నా 3.96 లక్షల మంది సభ్యులు ఉంటారు. ఒక్కో ఇంట్లో సగటున నలుగురు కుటుంబసభ్యులు ఉంటారనుకున్నా...15.84 లక్షల మంది వివరాలను గ్రూపు అధ్యక్ష, కార్యదర్శుల నుంచి ఆర్పీల ద్వారా సేకరించే పనిలో జీవీఎంసీ యూసీడీ అధికారులు నిమగ్రమై ఉన్నారు. అంతమంది ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ నంబర్లు, వారెక్కడ పనిచేస్తున్నారు, వారి వయస్సు వంటి వివరాలు అధికారులు ఎందుకు సేకరిస్తున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. దీనిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులను వీలైనంత వరకూ వడకట్టే ప్రక్రియలో భాగంగానే డ్వాక్రా సంఘాల సభ్యుల కుటుంబ సభ్యుల వివరాలు, ఆర్థిక స్థితిగతులను సేకరిస్తున్నారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు నెలన్నర కిందట ‘ఆసరా’ కింద నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా ఇంతవరకూ ఆ మొత్తం ఎవరికీ అందలేదు. అందులో కొంతమందికి కోత విధించేందుకే ఈ వివరాలు సేకరిస్తున్నారనే సందేహాలను మరికొందరు వ్యక్తపరుస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో డ్వాక్రా సంఘాల సభ్యులు, వారి కుటుంబసభ్యుల ఓట్లకు గాలం వేసేందుకు అధికార పార్టీ ఏదో వ్యూహం రచించిందని ఇంకొందరు అనుమానిస్తున్నారు. ఈ విషయం జీవీఎంసీ అధికారుల వద్ద ప్రస్తావించగా డ్వాక్రా సంఘాల్లో స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారిన వారికి కుట్టుమిషన్లు, ఇతర స్వయం ఉపాధి పనిముట్లు అందజేసే ప్రతిపాదన ఉందని, అందుకోసమే వివరాలను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-26T01:37:19+05:30 IST