యువ న్యాయవాదులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , First Publish Date - 2023-03-19T00:14:50+05:30 IST
యువ న్యాయవాదులు ట్రయల్ కోర్టులో ప్రాక్టీస్ ద్వారానే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేష సాయి అన్నారు.

18ఎస్‌బీఎం10
సబ్బవరం, మార్చి 18 : యువ న్యాయవాదులు ట్రయల్ కోర్టులో ప్రాక్టీస్ ద్వారానే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేష సాయి అన్నారు. స్థానిక దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం ‘దేశంలో వ్యాపార ర్యాంకింగ్‌ను మెరుగుపరచడంలో వాణిజ్య న్యాయస్థానాల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా భారత ప్రభుత్వ న్యాయ శాఖ జాయింట్ కార్యదర్శి నీరజ్‌కుమార్ గయాగీ, న్యాయ శాఖ మాజీ జాయింట్ కార్యదర్శి రాఘవేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ.. సీనియర్లను గౌరవించడం ద్వారానే న్యాయవాద వృత్తిలో రాణించగలరన్నారు. అపార అనుభవం ఉన్న సీనియర్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. వ్యాపారాలు, పర్యావరణ వ్యవస్థలకు సంబంధించిన కాంట్రాక్టులు, వాటి అమలు, వివాద పరిష్కార ప్రక్రియలను అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా వివాదాలు, అప్పీళ్లు విచారణ వేగవంతం అవుతుందన్నారు. గరిష్ఠంగా ఒక ఏడాదిలోపు పరిష్కరించబడే అవకాశముంటుందన్నారు. వీసీ ప్రొఫెసర్ ఎస్.సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. కమర్షియల్ కోర్టుల చట్టం-2015, 2018, నిర్దిష్ట సవరణ చట్టం-2018 అమలులోకి రావడంతో భారతదేశం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందన్నారు. ఇటువంటి చర్యలతో దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది అంతర్జాతీయ పెట్టుబడుదారులు ముందుకు వస్తారన్నారు. జాతీయ, అంతర్జాతీయ కాంట్రాక్టు అమలు, సవాళ్లు, వాణిజ్య వివాదాలు, వ్యాజ్యాలు, ఈ-ఫైలింగ్, దక్షిణ ప్రాంతంలో ఉన్న వాణిజ్య న్యాయస్థానాలు, తీర్పులు, తదితర అంశాలపై న్యాయ నిపుణులు చర్చించారు. అనంతరం జస్టిస్ శేషసాయిని వీసీ, రిజిస్ట్రార్, ఇతర న్యాయ నిపుణులు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్జి, ప్రిన్సిపాల్ స్పెషల్ కమర్షియల్ కోర్టు (హైదరాబాద్) డాక్టర్ కె.పట్టాభి, చీఫ్ జడ్జి (పుదుచ్చేరి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు) జె. సెల్వనాథన్, బెంగళూరు అడిషినల్ సిటీ సివిల్ జడ్జి రాధ, అడిషనల్ సిటీ సివిల్, సెషన్స్ జడ్జి ఎం.రామ్‌దాస్, విశాఖ సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్, ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ కృష్ణకుమార్, రామబ్రహ్మం అండ్ సన్స్ డైరెక్టర్ వెంకట్ కంచర్ల, తదితరులు పాల్గొన్నారు.