గ్రేటర్ పెద్దలకు హైకోర్టు షాక్
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:16 AM
జీవీఎంసీ పెద్దలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది.
దసపల్లా హిల్స్‌లో రోడ్డు విస్తరణ ప్రతిపాదనపై హైకోర్టు స్టే
తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకూ పనులు చేపట్టవద్దని ఆదేశం
అవసరం లేకపోయినా 40 అడుగులు రోడ్డు...వంద అడుగులకు విస్తరణ ప్రతిపాదన
వైసీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు హడావుడిగా నిర్ణయం
అభ్యంతరాల స్వీకరణకు గడువు ముగియకుండానే కౌన్సిల్‌లో తీర్మానం
ఆర్‌డీపీ పూర్తికాకుండానే టెండర్ నోటిఫికేషన్
కోర్టును ఆశ్రయించిన బాధితులు
న్యాయస్థానం ఆదేశాలతో కంగుతిన్న జీవీఎంసీ అధికారులు
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పెద్దలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. దసపల్లా హిల్స్ ప్రాంతంలో రహదారి విస్తరణ పనులపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ భూసేకరణ, రోడ్డు పనులను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. దసపల్లా హిల్స్‌లో గల 40 అడుగుల రహదారిని ఆగమేఘాల మీద వంద అడుగులకు విస్తరించాలని అత్యుత్యాహం ప్రదర్శించిన జీవీఎంసీ పాలకవర్గానికి తాజా పరిణామం చెంపపెట్టులాంటిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సర్క్యూట్‌హౌస్ జంక్షన్ నుంచి దసపల్లా హిల్స్ మీదుగా నౌరోజీ రోడ్డు జంక్షన్ వరకూ ప్రస్తుతం 40 అడుగులు రహదారి ఉంది. ఆ రోడ్డులో పెద్దగా వాహనాల రాకపోకలు ఉండవు. అయితే ఆ ప్రాంతంలో కొంతకాలం కిందటి వరకూ ప్రభుత్వ భూముల జాబితాలో ఉన్న వాటిని ఇటీవల 22ఏ జాబితా నుంచి తొలగించారు. ఆయా భూముల యజమానులుగా పేర్కొంటున్న వారితో కొంతమంది డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ వ్యవహారంలో తెర వెనుక వైసీపీ పెద్దలు ఉన్నార ప్రచారం ఉంది. ఇదిలావుండగా ప్రస్తుతం 40 అడుగులు రోడ్డు మాత్రమే ఉండడంతో అపార్టుమెంట్‌ల నిర్మాణానికి మాత్రమే జీవీఎంసీ అనుమతి ఇవ్వడానికి వీలుంది. బహుళ అంతస్థులు కలిగిన భారీ భవనాలను నిర్మించాలంటే వంద అడుగులు వెడల్పు గల రహదారి ఉండాలి. ఈ నేపథ్యంలో ఆ రోడ్డును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంటూ...ఒకేసారి వంద అడుగులకు విస్తరించాలని జీవీఎంసీ అధికారులు ప్రదిపాదించారు. ఒక మాస్టర్‌ప్లాన్ రోడ్డుని నిర్మించాలన్నా, విస్తరించాలన్నా సరే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ముందుగా రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ (ఆర్‌డీపీ) తయారుచేయాలి. అంటే రోడ్డు విస్తరణకు ఎంత భూమి సేకరించాలి, అందులో ప్రభుత్వ భూమి ఎంత?, ప్రైవేటు భూమి ఎంత?, ప్రభుత్వ భవనాలు ఎన్ని ఉన్నాయి?, ప్రైవేటు భవనాలు ఎన్ని ఉన్నాయి?, వాటికి పరిహారంగా ఎంతమొత్తం టీడీఆర్ ఇవ్వాల్సి ఉంటుంది?...వంటి వివరాలను ఆర్‌డీపీలో పొందుపరచాలి. ఆ మేరకు ఆర్‌డీపీని జీవీఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆయా ఆస్తుల యజమానులకు నోటీసులు జారీచేయాలి. వారికి పరిహారం అందజేసిన తర్వాతే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి. తర్వాత రోడ్డు విస్తరణకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత రోడ్డు విస్తరణకు అవసరమయ్యే ఖర్చుపై ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు తయారుచేసి, దానికి సంబంఽధించిన ప్రతిపాదనను తిరిగి కౌన్సిల్‌లో చర్చకు పెట్టి ఆమోదం పొందాలి. ఆ తర్వాత టెండర్ నోటిఫికేషన్ జారీచేసి పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. కానీ జీవీఎంసీ అధికారులు ఇవేమీ పాటించకుండానే వంద అడుగులు రోడ్డు విస్తరణకు ఆగమేఘాల మీద రంగం సిద్ధం చేశారు. ఆర్‌డీపీ చేయకుండానే రోడ్డు విస్తరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువు ఇస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. కానీ గడువు ముగియకుండానే రోడ్డు విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనను కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి మరీ ప్రతిపక్షాల అభ్యంతరం మధ్యనే ఆమోదించేశారు. ఇంకా అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 19 వరకూ గడువు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోకుండానే ఈనెల 16న రోడ్డు విస్తరణ పనులకు టెండర్ పిలిచేశారు. రోడ్డు విస్తరణపై ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి, అందిన అభ్యంతరాలపై ఫిర్యాదుదారులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా జీవీఎంసీ అధికారులు విస్మరించారు.
హైకోర్టును ఆశ్రయించిన పలువురు
దసపల్లా హిల్స్ ప్రాంతంలో అవసరం లేనప్పటికీ జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వంద అడుగులకు రహదారిని విస్తరిస్తుండడంపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఆర్‌డీపీ చేయకుండానే రోడ్డు విస్తరణకు కౌన్సిల్‌లో ఆమోదం తీసుకోవడం, అభ్యంతరాలకు గడువు ముగియకుండానే పనులకు టెండర్లు పిలవడం వంటి అంశాలను తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటిని పరిశీలనకు తీసుకున్న హైకోర్టు దసపల్లాహిల్స్‌లో రోడ్డు విస్తరణ పనులను నిలిపివేయాలని స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ముందుకు వెళ్లొద్దంటూ రాష్ట్ర మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని, జీవీఎంసీ కమిషనర్‌ను, సంబంధిత జోన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించింది. తాజా పరిణామం జీవీఎంసీ అధికారులకు మింగుడుపడడం లేదు. అధికార పార్టీ పెద్దల ప్రాపకం కోసం అత్యుత్సాహం ప్రదర్శించి అభాసుపాలయ్యారు.