భారీ వర్షం
ABN , First Publish Date - 2023-04-23T01:15:59+05:30 IST
జిల్లాలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ ఠారెత్తించింది. అరకులోయలో అత్యధికంగా 42.5 డిగ్రీలు, అత్యల్పంగా చింతపల్లిలో 38.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. అనంతగిరిలో 39.3 డిగ్రీలు, డుంబ్రిగుడలో 39.1, జీకేవీధిలో 39.1, జి.మాడుగులలో 39.2, హుకుంపేటలో 39.2, ముంచంగిపుట్టులో 39.0, పాడేరులో 39.2, పెదబయలులో 39.2, కొయ్యూరులో 39.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ ప్రకటించింది. కాగా సాయంత్రం నాలుగు గంటల నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది.
- ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఠారెత్తించిన ఎండ
- సాయంత్రం దట్టంగా కమ్ముకున్న మేఘాలు
- ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
పాడేరు, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ ఠారెత్తించింది. అరకులోయలో అత్యధికంగా 42.5 డిగ్రీలు, అత్యల్పంగా చింతపల్లిలో 38.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. అనంతగిరిలో 39.3 డిగ్రీలు, డుంబ్రిగుడలో 39.1, జీకేవీధిలో 39.1, జి.మాడుగులలో 39.2, హుకుంపేటలో 39.2, ముంచంగిపుట్టులో 39.0, పాడేరులో 39.2, పెదబయలులో 39.2, కొయ్యూరులో 39.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ ప్రకటించింది. కాగా సాయంత్రం నాలుగు గంటల నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. సమారుగా గంటన్నర కుండపోతగా వర్షం కురిసింది. దీంతో పాడేరులోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. తాజా వర్షానికి జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాడేరు, పరిసర ప్రాంతాలతో పాటు జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట ప్రాంతాల్లో సైతం వర్షం కురిసింది.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల తరువాత వర్షం మొదలైంది. వర్షం గంట సేపు కురవడంతో రహదారులు జలమయమయ్యాయి.
హుకుంపేటలో..
హుకుంపేట: మండలంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి శనివారం ఇక్కడ జరిగే వారపు సంతకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో రైతులు, వర్తకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారుగా రెండు గంటలు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో జన జీవనానికి అంతరాయం ఏర్పడింది.
ధారకొండలో..
సీలేరు: జీకేవీది మండలం ధారకొండలో శనివారం మధ్యాహ్నం వడగళ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి రెండు గంటల సమయంలో వడగళ్లతో కూడిన భారీ వర్షం గంటకు పైగా కురిసింది.
చింతపల్లి, జీకేవీధి మండలాల్లో అంధకారం
చింతపల్లి: గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో కురిసిన మోస్తరు వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు ఏడు గంటల పాటు రెండు మండలాల ప్రజలు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం ఈదురు గాలులు, ఉరుములతో కూడి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ కారణంగా కోరుప్రోలు నుంచి విద్యుత్ సరఫరా జరుగుతున్న 33కేవీ ప్రధాన విద్యుత్‌లైన్ విద్యుత్ తీగలు చింతపల్లి-లోతుగెడ్డ జంక్షన్ మధ్యలో రెండు చోట్ల తెగిపోయాయి. దీంతో సాయంత్రం నాలుగు గంటలకు రెండు మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈపీడీసీఎల్ ఏఈఈ ఎం.వెంకట రమణ పర్యవేక్షణలో సిబ్బంది నాలుగు గంటలు శ్రమించి విద్యుత్ తీగలు తెగిపోయిన ప్రాంతాన్ని గుర్తించారు. ఈపీడీసీఎల్ సిబ్బంది ఈసమస్యను పరిష్కరించడం వల్ల రాత్రి సుమారు 11 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
పిడుగుపాటుకు పశువుల కాపరి మృతి
చింతపల్లి, ఏప్రిల్ 22: మండలంలోని బెన్నవరం పంచాయతీ పోతురాజు గున్నలు గ్రామంలో పిడుగుపాటుకు ఓ గిరిజన పశువుల కాపరి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పోతురాజుగున్నలు గ్రామానికి చెందిన వంతల చెంబునాయుడు(54) రోజూ మాదిరిగానే శనివారం పశువులను మేత కోసం గ్రామ శివారుకు తీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గొడుగు వేసుకుని పశువుల మందకు సమీపంలోనున్న పంట పొలం వద్ద ఉండగా అతనిపై పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.