‘వందేభారత్‌’కు సామర్లకోటలో హాల్ట్‌

ABN , First Publish Date - 2023-08-02T01:22:12+05:30 IST

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య నడుస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (20833/20834) రైళ్లకు సామర్లకోట స్టేషన్‌లో హాల్ట్‌ కల్పించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.

‘వందేభారత్‌’కు సామర్లకోటలో హాల్ట్‌

విశాఖపట్నం, ఆగస్టు 1:

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య నడుస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (20833/20834) రైళ్లకు సామర్లకోట స్టేషన్‌లో హాల్ట్‌ కల్పించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే, ఈ హాల్ట్‌కు సంబంధించిన కాలపట్టిక వివరాలను స్థానిక అధికారులు ప్రకటించాల్సి ఉంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సామర్లకోట స్టేషన్‌లో హాల్ట్‌ కల్పించాలని రైల్వే బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరికొన్ని రైళ్లకు బొబ్బిలి, దువ్వాడల్లో హాల్ట్‌..

వందేభారత్‌తోపాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు పలు స్టేషన్లలో అదనపు హాల్ట్‌లు కల్పిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. హటియా-బెంగళూరు-హటియా (12835/ 12836), టాటానగర్‌-బెంగళూరు-టాటానగర్‌ (12889/12890), హటియా-ఎర్నాకులం-హటియా (22837/ 22838) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు బొబ్బిలి స్టేషన్‌లో హాల్ట్‌ కల్పించనున్నారు. విశాఖ-లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌-విశాఖ (18519/18520), విశాఖ-నిజాముద్దీన్‌-విశాఖ స్వర్ణ జయంతి (12803/ 12804) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు దువ్వాడ స్టేషన్‌లో హాల్ట్‌ కల్పించనున్నారు. ఈ రైళ్లకు సంబంధించిన హాల్ట్‌ల వివరాలను స్థానిక అధికారులు ప్రకటించాల్సి ఉంది.

Updated Date - 2023-08-02T01:22:12+05:30 IST