మహా అత్యుత్సాహం!
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:58 AM
దసపల్లా హిల్స్ మీదుగా వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి జీవీఎంసీ అధికారులు తహతహలాడుతున్నారు.
దసపల్లా హిల్స్‌లో రోడ్డు విస్తరణకు జీవీఎంసీ తహతహ
ఎవరూ అడగకుండానే వంద అడుగుల రోడ్డు విస్తరణకు నిర్ణయం
అభిప్రాయ సేకరణకు ఆగమేఘాలపై నోటిఫికేషన్ జారీ
అభ్యంతరాల స్వీకరణకు గడువు ముగియకుండానే నిధుల కేటాయింపు
వైసీపీ పెద్దల కోసమే...
పాలకులు, యంత్రాంగం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
దసపల్లా హిల్స్ మీదుగా వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి జీవీఎంసీ అధికారులు తహతహలాడుతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి వినతులు లేకున్నా ప్రస్తుతం ఉన్న 40 అడుగుల రోడ్డును ఏకంగా వంద అడుగులకు విస్తరించేందుకు నోటిఫికేషన్ జారీచేసేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి ఇంకా గడువు ఉండగానే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కౌన్సిల్ సమావేశంలో పెట్టి, ఏకపక్షంగా ఆమోదింపజేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూముల జాబితాలో ఉన్న వాటిని అధికారులు ఇటీవల ప్రైవేటు భూములుగా నిర్ధారించారు. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, నగరంలో వారికి బినామీలుగా వ్యవహరిస్తున్నవారు, కొంతమంది వ్యాపారులు ఉన్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ భూమిలో భారీ భవనాల నిర్మాణానికి ఎస్యూర్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ పేరుతో జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కొన్ని అభ్యంతరాలు ఉండడంతో భవన నిర్మాణానికి ప్లాన్ జారీ కాలేదు. ఇదిలావుండగా సర్క్యూట్‌హౌస్ జంక్షన్ నుంచి దసపల్లా హిల్స్ మీదుగా నౌరోజీ రోడ్డు జంక్షన్ వరకూ ప్రస్తుతం 40 అడుగుల వెడల్పున రోడ్డు ఉంది. దాంతో రోడ్డులో భారీ భవన నిర్మాణాలకు అనుమతిచ్చేందుకు అవకాశం లేదు. దీనిని వంద అడుగులకు విస్తరిస్తే అనుమతులు జారీ చేసే వీలుంటుంది. ఆయా భూముల యజమానులుగానీ, నిర్మాణ సంస్థ గానీ రోడ్డును విస్తరిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ అవసరం లేకపోయినా జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం చూపించి మరీ రోడ్డు విస్తరణ బాధ్యతను తమ భుజాన వేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో పాటు ఎవరి నుంచీ వినతులు లేకున్నా జీవీఎంసీ అధికారులే దసపల్లా హిల్స్‌లో ఉన్న 40 అడుగులు రోడ్డుని వంద అడుగులకు విస్తరించాలని నిర్ణయిస్తూ నోటిఫికేషన్ జారీచేశారు.
గడువు ముగియకుండానే...
రోడ్డు విస్తరణపై నగర వాసుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 19 వరకూ గడువు ఇచ్చారు. ఈ ప్రక్రియ ఇంకా ముగియకుండానే రోడ్డు విస్తరణ, సెంటర్ మీడియన్, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, మీడియన్ మీద వీధిదీపాల ఏర్పాటుకు సుమారు రూ.4.8 కోట్లు వెచ్చించేందుకు కౌన్సిల్ సమావేశం ఎజెండాలో పెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఏకపక్షంగా ఆమోదిస్తున్నట్టు మేయర్ ప్రకటించడం అనేక అనుమానాలకు దారితీసింది.
వైసీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకే...
దసపల్లా హిల్స్ మీదుగా ప్రస్తుతం ఉన్న 40 అడుగుల రోడ్డుపైనే పెద్దగా ట్రాఫిక్ లేనప్పుడు, ఏకంగా వంద అడుగులకు విస్తరించాల్సిన అవసరం ఏమిటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. కేవలం దసపల్లా హిల్స్ భూములను దక్కించుకున్న వైసీపీ నేతలకు లబ్ధి కలిగించేందుకు మాత్రమే జీవీఎంసీ అధికారులు ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి, ఆగమేఘాలపై ఆమోదింపజేశారని ఆరోపిస్తున్నారు. పైగా రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చుని జీవీఎంసీ భరించడంతోపాటు విస్తరణలో అవసరమైన భూమిని తీసుకున్నందుకు గాను నాలుగు రెట్లు విలువైన టీడీఆర్ జారీచేసేందుకు కూడా శరవేగంగా పావులు కదుపుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ప్రక్రియలో రూ.రెండు వేల కోట్ల వరకూ టీడీఆర్ రూపేణా జీవీఎంసీ ఇవ్వాల్సి వస్తుందని, ఆ మొత్తం భవన నిర్మాణానికి అనుమతులు, ఇతర ఫీజుల చెల్లింపు, భవన నిర్మాణాలకు అయ్యే వ్యయం కూడా సరిపోతుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఒక్కరూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండానే వైసీపీ నేతలు రూ.వేల కోట్ల విలువైన భవనాలను సంపాదించుకునేందుకు జీవీఎంసీ అధికారులే దగ్గరుండి మరీ అవకాశం కల్పిస్తున్నారని నగరవాసులు విమర్శిస్తున్నారు.