మహా గందరగోళం

ABN , First Publish Date - 2023-03-26T01:38:13+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) బడ్జెట్‌ సమావేశం శనివారం గందరగోళంగా సాగింది.

మహా గందరగోళం

రూ.4,063.49 కోట్లతో బడ్జెట్‌ ముసాయిదా ప్రవేశపెట్టిన మేయర్‌

ఇంజనీరింగ్‌ విభాగానికి 23.07 శాతం కేటాయింపులు

ప్రజారోగ్యానికి 10.48 శాతం, ప్రాజెక్టులకు 9.84 శాతం

అంకెల గారడీ అంటూ విపక్ష సభ్యుల ధ్వజం

ప్రజల మెప్పు కోసం మాయ చేస్తున్నారని టీడీపీ విమర్శ

తప్పులుతడక ఉందన్న సీపీఎం

రూ. వేల కోట్ల బడ్జెట్‌లు ప్రవేశపెడుతున్నా విద్యుత్‌ దీపాలు ఎందుకు వెలగడం లేదన్న జనసేన

వైసీపీ సభ్యుల ఎదురుదాడి

అధికార, ప్రతిపక్ష సభ్యుల నడుమ వాగ్వాదం

విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) బడ్జెట్‌ సమావేశం శనివారం గందరగోళంగా సాగింది. బడ్జెట్‌ అంకెల గారడీలా వుందని విపక్ష సభ్యులు ఆక్షేపించారు. వాస్తవ ఆదాయం, వ్యయాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ తయారు చేయాలేగానీ, ప్రజల మెప్పు పొందాలనే తాపత్రయంతో అంకెలతో మాయజాలం చేయకూడదని టీడీపీ, జనసేన, సీపీఎం సభ్యులు విమర్శించారు. దీనికి వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు జోక్యం చేసుకుని ‘అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం మీ నాయకుడు రూ.ఐదు లక్షల కోట్లు కావాలని అన్నారని, అంత ఖర్చు అవుతుందా?’...అని టీడీపీ సభ్యులను ఉద్దేశించి అనడంతో సభలో గందరగోళం మొదలైంది. చివరకు బడ్జెట్‌పై సభ్యులు లేవనెత్తిన అనుమానాలను ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌తో వివరణ ఇప్పిస్తామని మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి హామీ ఇవ్వడంతో సభ సాధారణ స్థితికి వచ్చింది. అయితే ఆయన ఆ వివరాలు చెబుతుండగానే బడ్జెట్‌ ముసాయిదాను ఆమోదించినట్టు ప్రకటించి ఆమె సమావేశం నుంచి వెళ్లిపోయారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,063.49 కోట్ల అంచనాలతో తయారుచేసిన బడ్జెట్‌ ముసాయిదాను మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి సభ్యులకు చదివి వినిపించారు. గత బడ్జెట్‌తో పోల్చితే ఇది రూ.486.13 కోట్లు అధికమని, ముసాయిదాను స్టాండింగ్‌ కమిటీ రెండుసార్లు చర్చించి ఆమోదించిందని తెలిపారు. నగరంలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన కోసం ఇంజనీరింగ్‌ విభాగానికి అత్యధికంగా రూ.937.61 కోట్లు కేటాయించామన్నారు. మొత్తం బడ్జెట్‌లో ఇది 23.07 శాతమని వివరించారు. అలాగే ప్రజారోగ్య విభాగానికి రూ.425.88 కోట్లు, సాధారణ పరిపాలనకు రూ.175.15 కోట్లు, లైటింగ్‌కు రూ.151.95 కోట్లు, ప్రాజెక్టులకు రూ.399.7 కోట్లు, టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి రూ.52.42 కోట్లు, యూసీడీ విభాగానికి రూ.537.35, విద్యా విభాగానికి రూ.19.07 కోట్లు, పార్కులు, లీజులు, శ్మశానాల నిర్వహణకు రూ.114.36, కొత్త పైప్‌లైన్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టేందుకు నీటి సరఫరా విభాగానికి రూ.259.85, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ప్రాజెక్టుకు రూ.55.75 కోట్లు, రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకానికి రూ.ఐదు కోట్లు, అమృత్‌ పథకానికి రూ.164 కోట్లు, ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టులు రూ.191.2 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సులుకి రూ.292.70 కోట్లు వెచ్చించాలని ముసాయిదాలో పొందుపరిచామన్నారు. ఇక ఆదాయం విషయానికి వస్తే సాధారణ పరిపాలనా విభాగం నుంచి రూ.914.58 కోట్లు, ఇంజనీరింగ్‌ నుంచి రూ.384.66 కోట్లు, టౌన్‌ప్లానింగ్‌ నుంచి రూ.315.4 కోట్లు, యూసీడీ నుంచి రూ.520 కోట్లు, విద్యా విభాగం నుంచి రూ.15 లక్షలు, పార్కులు, లీజర్లు, శ్మశానాల నుంచి రూ.20 కోట్లు, ప్రజా రోగ్యం విభాగం నుంచి రూ.118.11 కోట్లు, నీటి సరఫరా విభాగం నుంచి రూ.431.6 కోట్లు, అమృత్‌ పథకం కోసం కేంద్రం నుంచి రూ.150 కోట్లు, విదేశీ సంస్థల సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు రూ.191.2 కోట్లు, ఆర్థిక సంఘం నిధులు రూపంలో రూ.276 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సుల రూపంలో రూ.307.32 కోట్లు...మొత్తం రూ.3,822.62 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశామన్నారు. ప్రారంభ నిల్వగా రూ.480.58 కోట్లుగా, ముగింపు నిల్వ కింద రూ.239.71 కోట్లు చూపించామన్నారు. దీనిపై సభ్యులు తమ అభిప్రాయాలను తెలపాలంటూ మేయర్‌ సభ్యులను కోరడంతో విపక్ష సభ్యులు ఒక్కసారిగా బడ్జెట్‌ ముసాయిదా కూర్పుపై ధ్వజమెత్తారు. జనసేన ఫ్లోర్‌ లీడర్‌ భీశెట్టి వసంతలక్ష్మి మాట్లాడుతూ కొత్తబడ్జెట్‌ ముసాయిదాను చూస్తే అంకెల గారడీ అనే విషయం అర్థమైపోతోందన్నారు. బడ్జెట్‌ను జీవీఎంసీ మొత్తానికి కాకుండా వైసీపీ కార్పొరేటర్లు ఉన్న వార్డులు, వైసీపీ నేతలు నివాసముంటున్న ప్రాంతాలు, ఆస్తులు కలిగి ఉన్న ప్రాంతాల అభివృద్ధికే వినియోగిస్తున్నారన్నారు. రూ.నాలుగు వేల కోట్ల బడ్జెట్‌లో వీధిదీపాలకు రూ.19 కోట్లు కేటాయించారని, అయినా తమ వార్డుల్లో కనీసం వెలగని వీధి దీపాలను కూడా మరమ్మతు చేసుకోలేని దుస్థితి ఉందన్నారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ బడ్జెట్‌లో జీవీఎంసీకి వచ్చే వాస్తవ ఆదాయం, వాస్తవం వ్యయాలను దాచిపెట్టారన్నారు. ఏదో చేసేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టాలనే లక్ష్యంతో అంచనాలను భారీగా పెంచి చూపించారని ధ్వజమెత్తారు. సీపీఎం ఫ్లోర్‌లీడర్‌ బి.గంగారావు మాట్లాడుతూ 2021-22లో జీవీఎంసీకి మొత్తంగా అన్ని మార్గాల్లోనూ రూ.1164 కోట్లు ఆదాయం సమకూరగా, రూ.932 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు స్పష్టంగా చూపించారన్నారు. అలాంటప్పుడు తాజా బడ్జెట్‌లో ఆదాయం, ఖర్చులను రూ.4వేల కోట్లకుపైగా ఎలా చూపించారని ప్రశ్నించారు. వాస్తవ ఆదాయ, వ్యయాలను మూడు రెట్లు పెంచి చూపించడం చాలా అన్యాయమని, ఇది సభ్యులను, నగర ప్రజలను మోసం చేయడమేనన్నారు. టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ బడ్జెట్‌ సమావేశం పేరుతో ముసాయిదాను ప్రవేశపెట్టిన రోజే చర్చించి, ఆమోదించడం కాకుండా చర్చకు కొంత సమయం ఇచ్చి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేయాలని కోరారు. 98వ వార్డు కార్పొరేటర్‌ పీవీ నరసింహం మట్లాడుతూ బడ్జెట్‌ పుస్తకంలో అంకెలకు నగరంలో జరుగుతున్న వాస్తవ అభివృద్ధికి పొంతన కనిపించడం లేదని విమర్శించారు. రెండో వార్డు కార్పొరేటర్‌ గాడు చిన్నికుమారిలక్ష్మి మాట్లాడుతూ బడ్జెట్‌లో అంకెలు ఘనంగా కనిపిస్తున్నాయని, కానీ వార్డుల్లో డ్రైనేజీలు పూడికతీతకు నోచుకోక కంపుకొడుతున్నాయన్నారు. వీధిదీపాలు వెలగడం లేదని, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీకి చెందిన 61వ వార్డు కార్పొరేటర్‌ కొణతాల సుధ మాట్లాడుతూ వార్డుల్లో పారిశుధ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. 27వ వార్డు కార్పొరేటర్‌ గొలగాని వీరారావు మాట్లాడుతూ ముడసర్లోవ పార్కును పీపీపీకి కట్టబెట్టేందుకు కౌన్సిల్‌లో తీర్మానం చేశారని, ఇప్పుడు బడ్జెట్‌లో పార్కు అభివృద్ధికి మళ్లీ నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి బడ్జెట్‌ తయారీ ప్రక్రియ, తాము చేసిన కసరత్తు, ఆదాయ, వ్యయాలను అంచనా వేసిన విధానాన్ని సభకు వివరిస్తుండగానే, బడ్జెట్‌ ముసాయిదాను ఆమోదిస్తున్నట్టు మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ప్రకటించి సమావేశం నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2023-03-26T01:38:13+05:30 IST