Share News

గ్రావెల్‌ దోపిడీ!

ABN , First Publish Date - 2023-11-29T00:53:15+05:30 IST

జిల్లాలో గ్రావెల్‌, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతున్నది. గ్రావెల్‌కు గిరాకీ అధికంగా వుండడంతో కొండవాలు ప్రాంతాలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో గ్రావెల్‌ అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. అడ్డుకుని చర్యలు తీసుకోవాల్సిన గనులు, రెవెన్యూ శాఖలతోపాటు పోలీలసులు కూడా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గ్రావెల్‌ దోపిడీ!
అనకాపల్లి మండలం అచ్చెయ్యపేటలో ప్రభుత్వ భూమిలో గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన దృశ్యం

అక్రమార్కులకు వైసీపీ నేతల అండ

కొండవాలు ప్రదేశాల్లో అనధికార క్వారీలు

రాత్రిపూట తవ్వకాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు రవాణా

చర్యలకు వెనుకంజ వేస్తున్న మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గ్రావెల్‌, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతున్నది. గ్రావెల్‌కు గిరాకీ అధికంగా వుండడంతో కొండవాలు ప్రాంతాలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో గ్రావెల్‌ అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. అడ్డుకుని చర్యలు తీసుకోవాల్సిన గనులు, రెవెన్యూ శాఖలతోపాటు పోలీలసులు కూడా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల పరిఽధిలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఆయా లేఅవుట్‌లలో రోడ్లు వేయడానికి, స్థలాలను మెరక చేయడానికి గ్రావెల్‌ అవసరం. సమీపంలోని క్వారీలు, కొండవాలు ప్రదేశాల్లో గ్రావెల్‌ తవ్వకాలు జరపాలంటే మైనింగ్‌, రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఘనపు మీటరుకు నిర్ణీత మొత్తంలో రాయల్టీగా ప్రభుత్వానికి చెల్లించాలి. ఇది పెద్ద తతంగం కావడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్‌కు అవసరమైన గ్రావెల్‌ను సరఫరా చేసే కాంట్రాక్టును కమీషన్‌ ప్రాతిపదికన స్థానికంగా వుండే అధికార పార్టీ నేతలకు అప్పగిస్తున్నారు. వీరు ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లను పురమాయించుకుని గ్రావెల్‌ తవ్వి, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలకు ఇదో ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అధికార పార్టీ నాయకులు కావడంతో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవడానికి మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు వెనుకంజ వేస్తున్నారు.

అనకాపల్లి మండలం కుంచంగి, సత్యనారాయణపురం, అచ్చెయ్యపేట, రొంగలివానిపాలెం, తగరంపూడి పరిసరాల్లో కొండవాలు ప్రదేశాల్లో రాత్రిపూట గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నారు. గొలగాం, శంకరం, రేబాక, హెచ్‌ఎన్‌ అగ్రహారం, వేటజంగాలపాలెం పరిసరాల్లోని జగనన్న కాలనీల్లో రోడ్ల నిర్మాణం, పునాదుల ఫిల్లింగ్‌, ఇతర అవసరాల పేరుతో గ్రావెల్‌ తవ్వకాలకు అధికారుల నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. కాలనీలకు రెండు ట్రాక్టర్ల గ్రావెల్‌ సరఫరా చేస్తే.. ప్రైవేటు లేఅవుట్లకు పది ట్రాక్టర్ల గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలో అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి మండలాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలిలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే భూములను ఎత్తు చేయడానికి, పునాదుల ఫిల్లింగ్‌, ఇతర పనులకు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు భారీ మొత్తంలో గ్రావెల్‌ అవసరం. ముఖ్య నేతల అనుచరులు రియల్‌ వ్యాపారులు కావడంతో గ్రావెల్‌ తవ్వకాలు, రవాణాకు అడ్డు చెప్పే పరిస్థితి లేదు.

జగనన్న కాలనీల పేరుతో....

అధికార పార్టీకి చెందిన కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు జగనన్న లేఅవుట్‌ల చదును పేరుతో కొద్దిపాటి మట్టి/ గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు తీసుకుంటున్నారు. అదే ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి మట్టి/ గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నారు. వంద ట్రాక్టర్‌ లోడ్‌ల మట్టి/ గ్రావెల్‌ తవ్వకాలు జరిపితే.. అందులో పది ట్రాక్టర్‌ లోడ్‌లు మాత్రమే జగనన్న కాలనీలకు వినియోగించి, మిగిలిన మట్టి/ గ్రావెల్‌ను ప్రైవేటు నిర్మాణాలకు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలిస్తున్నారు. గ్రావెల్‌ దందాపై స్థానికులు ఫిర్యాదు చేస్తే.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు భయపడుతున్నారు. ఒకవేళ ఏ అధికారి అయినా చర్యలకు సన్నద్ధం అయితే వెంటనే పెద్ద నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అనకాపల్లి మండలానికి చెందిన వైసీపీ నాయకులు... జాతీయ రహదారికి సమీపంలో ఒక ప్రముఖ సంస్థ వేస్తున్న భారీ లేఅవుట్‌కు గ్రావెల్‌ తరలించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. కుంచంగి, కూండ్రం, రొంగలివానిపాలెం, అచ్చెయ్యపేట పరిసర గ్రామాల పరిధిలో గ్రావెల్‌ తవ్వి, ఈ లేఅవుట్‌కు తరలిస్తున్నారు. తగరంపూడి, కొత్తూరు, గొలగాం, రేబాక, శంకరం పరిసరాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై రెవెన్యూ, గనుల శాఖాధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవు.

ప్రభుత్వ ఖజానాకు గండి....

నిబంధనల ప్రకారం అనుమతి పొందిన గ్రావెల్‌ క్వారీల నిర్వాహకులు క్యూబిక్‌ మీటర్‌ గ్రావెల్‌ తవ్వితే రూ.100లకు గనుల శాఖకు చలానా తీయాలి. గ్రావెల్‌ అమ్మకాలకు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖకు జీఎస్‌టీ చెల్లించాలి. కానీ గ్రావెల్‌ అక్రమార్కులు గనులు, వాణిజ్య పనుల శాఖలకు ఒక్క రూపాయి కూడా చెల్లించడంలేదు. తద్వారా ప్రభుత్వ ఖజానా ఆదాయానికి గండి పడుతున్నది.

Updated Date - 2023-11-29T00:53:16+05:30 IST