కష్టాల్లో గోవాడ షుగర్స్‌

ABN , First Publish Date - 2023-09-18T00:56:05+05:30 IST

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి గత క్రషింగ్‌ సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటికీ బకాయిలు పూర్తిస్థాయిలో అందలేదు. ఈ ఏడాది క్రషింగ్‌ సీజన్‌ మరో రెండు నెలల్లో ప్రారంభం అవుతుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.321 చొప్పున సుమారు ఏడు కోట్ల రూపాయలు చెల్లించాల్సి వుంది. గోదాములో వున్న పది వేల క్వింటాళ్ల పంచదార ఆప్కాబ్‌ తనఖాలో వుంది.

కష్టాల్లో గోవాడ షుగర్స్‌
గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో కేన్‌ క్యారియర్‌ ప్రాంతం (ఫైల్‌ ఫొటో)

చెరకు రైతులకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించలేని దుస్థితి

గత సీజన్‌కు సంబంధించి ఇంకా రూ.7.1 కోట్లు బకాయిలు

గోదాములో 10 వేల టన్నులు మాత్రమే పంచదార నిల్వలు

ఆప్కాబ్‌ తనఖాలో ఉండడంతో రుణ బకాయి కింద జమ

ఫ్యాక్టరీలో చిల్లి గవ్వ కూడా లేని వైనం

మరో రెండు నెలల్లో క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభం

ఫ్యాక్టరీని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ప్రకటనలకే పరిమితమైన మంత్రులు, ప్రభుత్వ విప్‌ హామీలు

చోడవరం, సెప్టెంబరు 17: గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి గత క్రషింగ్‌ సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటికీ బకాయిలు పూర్తిస్థాయిలో అందలేదు. ఈ ఏడాది క్రషింగ్‌ సీజన్‌ మరో రెండు నెలల్లో ప్రారంభం అవుతుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.321 చొప్పున సుమారు ఏడు కోట్ల రూపాయలు చెల్లించాల్సి వుంది. గోదాములో వున్న పది వేల క్వింటాళ్ల పంచదార ఆప్కాబ్‌ తనఖాలో వుంది. దీనిని విక్రయించగా వచ్చే సొమ్మును ఆప్కాబ్‌ రుణ బకాయి కింద జమ చేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప రైతులకు చెరకు బకాయిలు చెల్లించలేమంటూ ఫ్యాక్టరీ అధికారులు చేతులెత్తేశారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే సీజన్‌లో చెరకు చెల్లింపులు ఇంకెంత జాప్యం అవుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

గోవాడ సహకార చక్కెర ఫ్యాక్టరీలో 2022-23 క్రషింగ్‌ సీజన్‌ గత ఏడాది డిసెంబరు 9వ తేదీన ప్రారంభమైంది. సీజన్‌లో 3.5 లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అప్పట్లో అధికారులు ప్రకటించారు. రోజువారీ క్రషింగ్‌ సామర్థ్యం నాలుగు వేల టన్నులు. కానీ సాంకేతిక సమస్యలు, ఇతర కారణాల వల్ల అప్పుడప్పుడు క్రషింగ్‌ నిలిచిపోయింది. మరోవైపు అధికారులు అనుకున్నంతగా ఫ్యాక్టరీకి చెరకు సరఫరా కాలేదు. దీంతో మార్చి 24వ తేదీన క్రషింగ్‌ ముగించారు. మొత్తం2,21,246 టన్నుల చెరకు గానుగాడించి లక్షా 95 వేల క్వింటాళ్ల (8.8 శాతం రికవరీ) పంచదారను ఉత్పత్తి చేశారు. టన్ను చెరకుకు రూ.2821.25 చొప్పున రైతులకు రూ.62.42 కోట్లు చెల్లించాలి. క్రషింగ్‌ ప్రారంభించిన రోజు నుంచి జనవరి 3వ తేదీ వరకు సుమారు 34 వేల టన్నుల చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు రూ.2,500 చొప్పున రూ.8.5 కోట్లు చెల్లించారు. క్రషింగ్‌ ముగిసేనాటికి రూ.54 కోట్ల మేర చెల్లించాల్సి వుంది. తరువాత దఫదఫాలుగా టన్నుకు రూ.2,500 చొప్పున చెల్లించగా, మిగిలిన (టన్నుకు రూ.321 చొప్పున) రూ.7.1 కోట్లు ఇప్పటికీ రైతులకు అందలేదు. ఫ్యాక్టరీ గోదాములో ప్రస్తుతం సుమారు 10 వేల క్వింటాళ్ల పంచదార నిల్వ వుంది. మార్కెట్‌ ధర ప్రకారం (క్వింటా రూ.3,400) దీని విలువ రూ.3.4 కోట్లు. దీనిని విక్రయించినప్పటికీ.. ఆ సొమ్మును రుణ బకాయి కింద ఆప్కాబ్‌ జమ చేసుకుంటుంది. ఆప్కాబ్‌ రుణ బకాయిలు రూ.37 కోట్లు వుండడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ ఏడాది చెరకు క్రషింగ్‌ సీజన్‌ మరో రెండు నెలల్లో ప్రారంభం అవుతుంది. గత సీజన్‌ చెరకు బకాయిలను ఫ్యాక్టరీ అధికారులు ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదు. ప్రభుత్వం నుంచి సాయం అందితే తప్ప రైతులకు బకాయిలు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు.

పట్టించుకోని మంత్రులు, ప్రభుత్వ విప్‌

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు వున్నాయి. మంత్రి బూడి ముత్యాలనాయుడు మాడుగుల నుంచి, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ చోడవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కూడా అనకాపల్లి జిల్లాకు చెందినవారే. అధికారంలోకి రాకముందు గోవాడ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆధునికీకరణ మాట అటుంచి కనీసం చెరకు బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వ పరంగా సాయం అందించేందుకు కనీస చర్యలు చేపట్టడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ సాయానికి ఎదురుచూపులు

చెరకు రైతులకు బకాయిలు, కార్మికుల వేతనాలు, ఓవర్‌హాలింగ్‌ పనుల కోసం ప్రభుత్వపరంగా రూ.25 కోట్లు సాయంగా అందించాలని ఫ్యాక్టరీ చైర్మన్‌ అయిన జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఈ ఏడాది జూన్‌ 29న గోవాడలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఫ్యాక్టరీ అధికారులు కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌, ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ.. గోవాడ పరిస్థితిని సీఎంకు నివేదించామని, సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వ పరంగా రూ.25 కోట్లు సాయంగా అందిస్తామని ప్రకటించారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నది. మంత్రులు, ప్రభుత్వ విప్‌ ఇంతవరకు ప్రభుత్వ సాయంపై నోరు విప్పలేదు. చెరకు రైతులకు బకాయిలు చెల్లించాలంటే ప్రభుత్వం నిధులు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని ఫ్యాక్టరీ అధికారులు అంటున్నారు. ఈ నెల 29వ తేదీన షుగర్‌ ఫ్యాక్టరీ మహాజన సభ జరగనున్నది. ఈలోగా ప్రభుత్వం నుంచి సాయం అందే అవకాశం వుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-18T00:56:05+05:30 IST