ప్రభుత్వ భూమికి ఎసరు

ABN , First Publish Date - 2023-01-26T01:24:57+05:30 IST

గాజువాకలో రూ.15 కోట్ల విలువైన భూమిపై వైసీపీ నాయకులుకన్నేశారు.

ప్రభుత్వ భూమికి ఎసరు

సంక్రాంతి సెలవుల్లో కంచె ఏర్పాటు

వెబ్‌సైట్‌లో గయాలుగా నమోదు

మొత్తం ఎకరా...విలువ రూ.15 కోట్లపైనే...

పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

విశాఖపట్నం, గాజువాక, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):

గాజువాకలో రూ.15 కోట్ల విలువైన భూమిపై వైసీపీ నాయకులుకన్నేశారు. పక్కా ప్రణాళికతో సంక్రాంతి సెలవుల్లో దానిని హస్తగతం చేసుకున్నారు. రాత్రికి రాత్రి చుట్టూ స్తంభాలు పాతి, కంచె వేశారు. అక్కడితో ఆగకుండా ఆ భూమిపై కోర్టు ఆర్డర్‌ ఇచ్చిందంటూ ఓ హెచ్చరిక బోర్డు కూడా పెట్టేశారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తూ సహకారం అందిస్తున్నారు. జాతీయ రహదారికి అత్యంత సమీపానున్న ప్రభుత్వ భూమినే రక్షించలేని అధికారులు ఇక మిగిలిన గ్రామాల్లో భూములు ఎలా కాపాడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ కబ్జా కథ

గాజువాక మండలం చినగంట్యాడ గ్రామం జీవీఎంసీ 70వ వార్డు డ్రైవర్స్‌ కాలనీలోని సర్వే నంబర్‌ 101/2లో సుమారు ఎకరా ప్రభుత్వ స్థలం ఉంది. అది చాలాకాలంగా ఖాళీగా ఉంది. దాంతో తుప్పలు బాగా పెరిగిపోయాయి. జాతీయ రహదారికి చేరువగా వున్న ఆ భూమిని చేజిక్కించుకోవాలని కొందరు వైసీపీ నేతలు పథకం రచించారు. ఆ స్థలం తమదేనంటూ, అందులో చాలాకాలంగా ఉంటున్నామని కొన్ని పత్రాలు తయారు చేసి కోర్టుకు వెళ్లారు. స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నారు. దానిని అడ్డం పెట్టుకొని సంక్రాంతి సెలవుల్లో ఆ భూమి చుట్టూ కంచె వేసేశారు. ఆ స్థలంపై తమకే హక్కులు ఉన్నాయంటూ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఆ సర్వే నంబరు కొడితే...అది ప్రభుత్వ భూమి గయాలుగా చూపిస్తోంది. స్థానికులంతా అది ప్రభుత్వ భూమేనని, చాలాకాలంగా ఖాళీగా ఉందనే చెబుతున్నారు. రాత్రికి రాత్రి ఇలా కబ్జా చేయడం ఎక్కడా చూడలేదని ఆశ్చర్యపోతుతున్నారు. కోర్టు ఆర్డర్‌ పెట్టుకొని నిర్మాణం ప్రారంభించినా ఆశ్చర్యపోవలసిందేమీ లేదని అంటున్నారు.

ఫిర్యాదు అందింది పరిశీలిస్తాం: సుజాత, తహసీల్దార్‌

డ్రైవర్స్‌ కాలనీలో ప్రభుత్వ భూమి ఆక్రమణ విషయమై తహసీల్దార్‌ సుజాత దృష్టికి తీసుకువెళ్లి వివరణ కోరగా..దానిపై ఫిర్యాదులు అందాయని, సమగ్ర దర్యాప్తు జరిపి, ప్రభుత్వ భూమిగా నిర్ధారణ అయితే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదులు..

విలువైన ప్రభుత్వ స్థలాన్ని నకిలీ పత్రాలతో చేజిక్కించుకుంటున్నందున దానిని కాపాడాలని కోరుతూజిల్లా కలెక్టర్‌కు కూడా పలువురు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ అందులోకి ప్రవేశించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక భవనాలను నిర్మించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-01-26T01:24:59+05:30 IST