మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవికి ‘గొలుసు’ రాజీనామా

ABN , First Publish Date - 2023-04-04T01:17:48+05:30 IST

మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. సదరు పత్రాన్ని కమిషనర్‌ కనకారావుకు అందజేశారు.

మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవికి ‘గొలుసు’ రాజీనామా
రాజీనామా పత్రాన్ని కమిషనర్‌కు అందజేస్తున్న గొలుసు నర్సింహమూర్తి

నర్సీపట్నం, ఏప్రిల్‌ 3 : మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. సదరు పత్రాన్ని కమిషనర్‌ కనకారావుకు అందజేశారు. మునిసిపాలిటీలోని 28 వార్డులకు 2021 మార్చి 10న జరిగిన ఎన్నికలలో 14మంది వైసీపీ నుంచి, 12 మంది టీడీపీ నుంచి, జనసేన, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కొక్కరు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. గొలుసు నర్సింహమూర్తి ఐదో వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అదే నెల 18న జరిగిన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో చైర్‌పర్సన్‌గా గుడబండి ఆదిలక్ష్మిని, వైస్‌ చైర్మన్‌గా గొలుసు నర్సింహమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మునిసిపల్‌ ఎన్నికల తర్వాత విశాఖలోని ఓ హోటల్‌లో పార్టీ పెద్దలతో చేసుకున్న ఒప్పందం మేరకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లు రెండేళ్లు తర్వాత పదవికి రాజీమానా చేయలి. ఆ తర్వాత రెండేళ్లు చైర్‌పర్సన్‌గా 12వ వార్డు కౌన్సిలర్‌ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌ చైర్మన్‌గా 8వ వార్డు కౌన్సిలర్‌ కోనేటి రామకృష్ణకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వైస్‌ చైర్మన్‌ పదవికి నర్సింహమూర్తి రాజీనామా చేశారు.

చైర్‌పర్సన్‌ రాజీనామాపై కొనసాగుతున్న ఉత్కంఠ!

అనుకున్న మాట ప్రకారం మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవికి గొలుసు నర్సింహమూర్తి రాజీనామా చేయడంతో మరో సారి చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి రాజీనామా వ్యవహారం తెర మీదకు వచ్చింది. వాస్తవానికి ఇద్దరూ ఒకేసారి రాజీనామా చేయాల్సి ఉంది. పార్టీ పెద్దల సమక్షంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం మార్చి 18 రాజీనామా చేయాల్సి ఉండగా 15 రోజులు గడిచి పోయినా ఆమె పట్టించుకోక పోవడంపై పెద్ద చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే, సహచర కౌన్సిలర్లు, నాయకులు ఎవరెన్ని చెప్పినా ఆమె వినడం లేదని పార్టీ నాయకులు అంటున్నారు.

Updated Date - 2023-04-04T01:17:48+05:30 IST