డస్ట్‌బిన్ల పంపిణీలో గోల్‌మాల్‌!

ABN , First Publish Date - 2023-01-25T01:16:17+05:30 IST

ఇంటింటా చెత్త సేకరణకు పంపిణీ చేసిన డస్ట్‌బిన్ల లెక్కలు తేల్చాలని మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో అధికార పార్టీకి చెందిన వైస్‌చైర్మన్‌, పలువురు కౌన్సిలర్లు పట్టుబట్టారు. ప్రతి ఇంటికి మూడు చొప్పున డస్ట్‌బిన్లు ఇవ్వాల్సి వుండగా రెండేసి మాత్రమే పంపిణీ చేశారని, అవి కూడా కొన్ని ఇళ్లకు అందజేయలేదని వారు ఆరోపించారు. డస్ట్‌ బిన్ల లెక్కలు తేల్చాల్సిందేనని పట్టుబట్టారు.

డస్ట్‌బిన్ల పంపిణీలో గోల్‌మాల్‌!
డస్ట్‌బిన్ల లెక్కలపై అధికారులను ప్రశ్నిస్తున్న వైస్‌చైర్మన్‌ గుప్తా, కౌన్సిలర్‌ మరిణేశ్వరావు

ప్రతి ఇంటికి మూడు ఇవ్వాల్సి ఉండగా... రెండే ఇచ్చారు

పలు వార్డుల్లో కొందరికి పంపిణీ చేయలేదు

మునిసిపల్‌ సమావేశంలో వైస్‌చైర్మన్‌, సభ్యులు ఆరోపణ

లెక్కలు తేల్చాల్సిందేనని డిమాండ్‌

సమావేశం ముగిసినా.. అక్కడే ఉండిపోయిన వైస్‌చైర్మన్‌

సాయంత్రం 6 గంటలకు గోదాములో డస్ట్‌బిన్లు తనిఖీ

15 వేలకుగాను 10 వేలే ఉన్నట్టు నిర్ధారణ

మునిసిపల్‌ కార్యాలయంలో ఆడారి తులసీరావు విగ్రహం ఏర్పాటుకు కౌన్సిల్‌ ఆమోదం

ఎలమంచిలి, జనవరి 24: ఇంటింటా చెత్త సేకరణకు పంపిణీ చేసిన డస్ట్‌బిన్ల లెక్కలు తేల్చాలని మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో అధికార పార్టీకి చెందిన వైస్‌చైర్మన్‌, పలువురు కౌన్సిలర్లు పట్టుబట్టారు. ప్రతి ఇంటికి మూడు చొప్పున డస్ట్‌బిన్లు ఇవ్వాల్సి వుండగా రెండేసి మాత్రమే పంపిణీ చేశారని, అవి కూడా కొన్ని ఇళ్లకు అందజేయలేదని వారు ఆరోపించారు. డస్ట్‌ బిన్ల లెక్కలు తేల్చాల్సిందేనని పట్టుబట్టారు.

ఎలమంచిలి మునిసిపల్‌ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం ఎప్పుడూ సాఫీగా, ప్రశాంతంగా జరుగుతుంటుంది. అయితే మంగళవారం పాలక పక్షం సభ్యుల ప్రశ్నల వర్షంతో వాడీవేడిగా సాగింది. చైర్‌పర్సన్‌ పి.రమాకుమారి అధ్యక్షతన మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. తొలుత దివంగత విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావుకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తూ మృతిచెందిన కార్మికుడు మూర్తికి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం అజెండాలోని అంశాలను అధికారులు చదివి వినిపించారు. ఈ సమయంలో వైస్‌చైర్మన్‌ అర్రెపు నాగ త్రినాథ ఈశ్వరగుప్తా లేచి మునిసిపాలిటీలో తడి, పొడి, ప్రమాదకర చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటికి మూడు డస్ట్‌బిన్‌లు పంపిణీ చేయాల్సి ఉండగా రెండు మాత్రమే పంపిణీ చేశారని, కొన్ని వార్డుల్లో అసంపూర్తిగా పంపిణీ చేశారని అన్నారు. ప్రజలకు ఎన్ని డస్ట్‌బిన్‌లు పంపిణీ చేశారు, ఇంకా ఎన్ని మిగిలి వున్నాయో లెక్కలు తేల్చాలని, అంతేకాక మిగిలిన వాటిని తమకు చూపించాలని పట్టుబట్టారు. కౌన్సిలర్‌ సుంకర మరిణేశ్వరావు మాట్లాడుతూ, జగనన్న ఇళ్ల కాలనీలకు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఆయనతోపాటు వైస్‌చైర్మన్‌ గుప్తా మాట్లాడుతూ, మునిసిపల్‌ అధికారులు కొన్ని నెలల నుంచి బయట వ్యక్తుల పేర్లమీద మస్తర్లు వేసుకుని ఆ మేరకు కూలి డబ్బులను స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్‌ సమావేశాల్లో సభ్యులకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, కనీసం కుర్చీలు కూడా వేయకుండా అగౌరపరుస్తున్నారని, ఇలాగైతే సమావేశాలకు తమను పిలవొద్దని కౌన్సిలర్లు సంతోష్‌, మరిణేశ్వరావు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చైర్‌పర్సన్‌ రమాకుమారి మాట్లాడుతూ, దివంగత విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు ఎలమంచిలి పంచాయతీగా ఉన్నప్పటి నుంచి అనేక సేవలందించారని గుర్తుచేశారు. ఆ మహనీయునికి సముచిత గౌరవ ఇవ్వాలన్న ఉద్దేశంతో మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. దీంతో కౌన్సిల్‌ ఏకగీవ్రంగా ఆమోదం తెలిపింది. సమావేశంలో కమిషనర్‌ తోట కృష్ణవేణి, డీఈ వీరయ్య, మునిసిపల్‌ వైస్‌చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఆర్రెపు ఈశ్వరగుప్తా, తదితరులు పాల్గొన్నారు.

డస్ట్‌బిన్ల లెక్కల కోసం వైస్‌చైర్మన్‌ పట్టు

మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది. అంతకు ముందు సభలో ప్రస్తావించిన డస్ట్‌బిన్ల లెక్కలు వెల్లడించాలని, మిగిలిన డస్ట్‌బిన్లు తనకు చూపాలని, అంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వైస్‌చైర్మన్‌ ఆర్రెపు నాగ త్రినాథ ఈశ్వరగుప్తా స్పష్టం చేశారు. భోజనం చేసి వచ్చిన తరువాత డస్ట్‌బిన్లు చూపుతామని అధికారులు చెప్పగా, అప్పటి వరకు తాను ఇక్కడే వుంటానని ఆయన అన్నారు. సాయంత్రం ఆరు గంటలకు మునిసిపల్‌ అధికారులు ఒక ప్రైవేటు గోదాములో వుంచిన డస్ట్‌బిన్‌లను వైస్‌ చైర్మన్‌లు బెజవాడ నాగేశ్వరరావు, ఈశ్వరగుప్తా, కౌన్సిలర్‌లు మరిణేశ్వరావు, సంతోశ్‌, నరసింహమూర్తిలకు చూపించగా వాటిని లెక్కించారు. మొత్తం 15 వేల డస్ట్‌బిన్లుకుగాను 10 వేలు మాత్రమే వున్నట్టు లెక్క తేలింది.

Updated Date - 2023-01-25T01:16:17+05:30 IST