జీతాల కోసం గగ్గోలు

ABN , First Publish Date - 2023-02-07T01:36:23+05:30 IST

ఆరో తేదీ దాటినా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఉద్యోగులకు జనవరి నెలకు సంబంధించిన జీతాలు అందలేదు.

జీతాల కోసం గగ్గోలు

ఏడో తేదీ వచ్చినా అందలేదంటున్న జీవీఎంసీ ఉద్యోగులు

రుణ వాయిదాలు చెల్లించాల్సిన వారిలో ఆందోళన

010 పద్దుకు మారకముందు ఒకటో తేదీనే ఖాతాలకు జమ

జీవీఎంసీ నిధుల నుంచి చెల్లించేలా తిరిగి మార్పులు చేయాలంటూ డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆరో తేదీ దాటినా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఉద్యోగులకు జనవరి నెలకు సంబంధించిన జీతాలు అందలేదు. గతంలో ఠంచనుగా ఒకటో తేదీ వచ్చేసరికి బ్యాంకు ఖాతాలకు జీతాలు జమ అయ్యేవి. ఇప్పుడు ఏడో తేదీ వస్తున్నా జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇళ్లు, వాహనాల కొనుగోలు, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు రుణాలు తీసుకున్నవారంతా నెల నెలా వాయిదాల చెల్లించాలి. ఒకవేళ జాప్యం జరిగితే అపరాధ రుసుము చెల్లించాల్సి వుంటుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

జీవీఎంసీ పరిధిలో 3,500 మంది వరకూ శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా జీతాల కోసం రూ.17 కోట్లు వరకూ అవసరం అవుతాయి. వీరితోపాటు వార్డు సచివాలయాల ఉద్యోగులు మరో ఐదు వేల మంది వరకూ ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వమే 010 పద్దు కింద ట్రెజరీ ద్వారా ప్రతి నెలా జీతాలు చెల్లిస్తుంది. ప్రతి నెలా 25వ తేదీ నాటికి జీతాల బిల్లులను విభాగాల వారీగా డీడీఓలు తయారుచేసి ట్రెజరీకి పంపిస్తే ఒకటో తేదీన జీతాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి. కానీ ఈనెల ఆరో తేదీ దాటినా సరే జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి, ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి జీతాలు వచ్చేస్తాయనే ధీమాతో ఎక్కువమంది ఉద్యోగులు ఇళ్లు, వాహనాలు కొనుగోలు కోసం, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. రుణాలు తీసుకున్న తర్వాత ప్రతి నెలా నిర్ణీత తేదీ పెట్టుకుని బ్యాంకుకు వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తుంటారు. ఒకవేళ ఏదైనా కారణం చేత నిర్ణీత తేదీ నాటికి వాయిదా చెల్లించలేకపోతే అదనపు మొత్తం కట్టాల్సి ఉంటుంది. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ జీతం పడిన తర్వాత నిర్ణీత తేదీ నాటికి చెల్లించాల్సిన వాయిదాలకు కావాల్సిన మొత్తాన్ని మినహాయించి, మిగిలిన డబ్బును మాత్రమే ఇతర అవసరాలకు వినియోగించుకుంటారు. అయితే ఈసారి ఒకటిన పడాల్సిన జీతాలు ఏడో తేదీ వచ్చినా ఖాతాల్లో పడకపోవడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్యాంకు ఈఎంఐ కట్టాల్సిన గడువు దాటిపోతుండడంతో అదనపు భారం తప్పదని అంటున్నారు. అద్దె, పిల్లల ఫీజులు ఈనెల జీతం అందిన తర్వాత కట్టాలనుకున్నవారి పరిస్థితి కూడా అలాగే తయారైంది. జీవీఎంసీలో ఏ విభాగంలోకి వెళ్లినా ‘మీకు జీతం పడిందా’ అంటూ ఆరా తీస్తున్నవారే కనిపిస్తుండడం విశేషం.

జీవీఎంసీ నిధుల నుంచే జీతాలు చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతుండడంతో జీవీఎంసీ ఉద్యోగుల ఆలోచన ధోరణిలో మార్పు కనిపిస్తోంది. మూడేళ్ల కిందట వరకూ జీవీఎంసీ ఉద్యోగులందరికీ జీతాలను జీవీఎంసీ సాధారణ నిధుల నుంచే చెల్లించేవారు. ఆస్తి పన్ను రూపంలో వచ్చిన ఆదాయం నుంచి ప్రతీనెలా ఒకటో తేదీ నాటికి జీతాలను చెల్లించడంతో ఇబ్బంది లేకపోయేది. అయితే రాష్ట్రంలో జీవీఎంసీ, విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్లు మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉద్యోగుల జీతాలు 010 పద్దు కింద ట్రెజరీ నుంచే చెల్లిస్తుండడంతో తమకు కూడా అలాగే చెల్లించాలని జీవీఎంసీ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ ఉద్యోగులకు కూడా 010ను అమలుచేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకూ మునిసిపల్‌ ఉద్యోగుల జీతాలకు ఆటంకం కలగకపోవడంతో జీవీఎంసీ ఉద్యోగులు తాము సేఫ్‌ జోన్‌లో ఉన్నామనే భావనలో ఉండేవారు. ఫిబ్రవరి వచ్చేసరికి జీతాలు ఆలస్యం కావడంతో ఇకపై ప్రతి నెలా జీతాల కోసం ఎదురుచూడాల్సిందేననే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. దీంతో జీవీఎంసీ ఉద్యోగుల జీతాలను 010 నుంచి కాకుండా జీవీఎంసీ సాధారణ నిధుల నుంచే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏయూలో రెండు నెలలు పెండింగ్‌

ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళన

విశాఖపట్నం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసే బోధన సిబ్బందికి, బోధన సిబ్బందిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి రెండు నెలలుగా జీతాలు, పింఛన్లు అందడం లేదు. కొన్నాళ్లుగా జీతాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ప్రతి నెలా పది, పదిహేను తేదీల మధ్య జీతాలు అందుతున్నాయి. అయితే డిసెంబరు నెలకు సంబంధించిన జీతం/పెన్షన్‌ ఫిబ్రవరి ఆరో తేదీ వచ్చినా అందకపోవడంతో అధ్యాపకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండు నెలల జీతం చెల్లించాల్సి ఉందంటున్నారు. వర్శిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు సుమారు రెండు వేల మంది ఉంటారు. వీరికి జీతాల కోసం రూ.15 కోట్లు వరకూ ప్రతి నెలా అవసరం. అలాగే పెన్షనర్స్‌ మరో నాలుగు వేల మంది వరకు ఉంటారు. వీరికి మరో రూ.15 కోట్లు అవసరం. ఇందుకోసం ప్రతినెలా ప్రభుత్వం గ్రాంటు విడుదల చేస్తుంది. అయితే, రెండు నెలల నుంచి గ్రాంటు విడుదల చేయకపోవడంతో జీతాలు, పెన్షన్లు చెల్లించడం లేదు. జీతాల్లేకపోవడంతో ఇంటి అద్దెలు, ఈఎంఐల చెల్లింపు, ఇతర అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు.

ఉపాధ్యాయులకు అందని జీతాలు

ఇకపోతే, జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా ఇంకా జీతాలు అందలేదు. జిల్లావ్యాప్తంగా సుమారు పది వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి జీతాలను ప్రభుత్వం చెల్లించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెలా జీతాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించిందని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.

Updated Date - 2023-02-07T01:36:24+05:30 IST