గుర్రంపాలెం కొండపై గురి!

ABN , First Publish Date - 2023-09-04T00:46:02+05:30 IST

గుర్రంపాలెం కొండపై గురి!

గుర్రంపాలెం కొండపై గురి!
ఏపీఐఐసీకి చెందిన కొండ నుంచి గ్రావెల్‌ తవ్వి తరలించిన దృశ్యం

రైటప్‌:

గుర్రంపాలెం కొండపై గురి!

యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు

పరిశ్రమలకు కేటాయించిన ప్లాట్లలో గోతులు పూడ్చేందుకు ఏపీఐఐసీ అనుమతులు

ప్రైవేటు లే అవుట్లకు విక్రయిస్తున్న అధికార పార్టీ నేతలు

విశాఖపట్నం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):

ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా కొండలు కరిగిపోతున్నాయి. జగనన్న లే అవుట్లను చదును చేసే ముసుగులో ఇప్పటికే ఇలాంటి దందాలు సాగుతుండగా, తాజాగా పెందుర్తి మండలం గుర్రంపాలెం ఏపీఐసీసీ కొండ నుంచి గ్రావెల్‌ను తవ్వి విక్రయిస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలకు కేటాయించిన ప్లాట్లను చదునుచేసేందుకు వీలుగా గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి ఉండగా, వైసీపీ నేతలు దీనిని తమ అక్రమార్జనకు అనువుగా మార్చుకుంటున్నారు.

పెందుర్తి మండలం గుర్రంపాలెం ఏపీఐఐసీ లేఅవుట్‌లో కొండపై అక్రమంగా గ్రావెల్‌/మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. లేఅవుట్‌లో పరిశ్రమలకు కేటాయించిన ప్లాట్లలో గోతులు పూడ్చడానికి కొందరు ఈ కొండ నుంచి గ్రావెల్‌ తవ్వి తరలిస్తున్నారు. ఇదే సమయంలో అఽధికార పార్టీకి చెందిన కొందరు తెల్లవారుజామున గ్రావెల్‌ తవ్వి సమీప ప్రైవేటు లేఅవుట్‌లకు విక్రయిస్తున్నారు. కొండ నుంచి గ్రావెల్‌/మట్టి తవ్వి తరలించాలంటే గనులశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. పర్మిట్లు తీసుకుని తవ్వకాలు చేపట్టి, అక్కడి నుంచి రవాణా, చివరకు ఏపీఐఐసీ లేఅవుట్‌లో పరిశ్రమలకు కేటాయించాలనుకున్నా గనులశాఖ అనుమతి పొందాలి. అయితే ఏపీఐఐసీలో కొందరు అఽధికారులు, సిబ్బంది ప్రమేయంతో సంస్థ అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన ప్లాట్లకు గ్రావెల్‌ తరలిస్తున్నారు. దీనిపై గనులశాఖకు ఎటువంటి సమాచారం ఇవ్వడ లేదనే ఆరోపణలున్నాయి. చిన్నపాటి పరిశ్రమల యూనిట్లకు ప్రతిపాదించిన ప్లాట్లలో గోతులు పూడ్చడం/ ఎత్తు పెంచేందుకు అవసరమైన గ్రావెల్‌ తరలించే విషయంలో ఏపీఐఐసీకి చెందిన కొందరు వ్యక్తులు ముడుపులు తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ కొండ ఆనందపురం మండలం సరిహద్దులో మారుమూలన ఉండడంతో అక్కడ ఏమి జరిగినా బయటకు తెలియదు. అందువల్లే కొండను దొలిచేసి గ్రావెల్‌ తరలిస్తున్నారని చెబుతున్నారు. ఏపీఐఐసీలో పనిచేసే కొందరు సిబ్బంది ప్రమేయంతోనే అధికారపార్టీ నేతలు ఇదే కొండనుంచి గ్రావెల్‌ తరలిస్తున్నారని గుర్రంపాలెం గ్రామవాసులు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు నెలల క్రితం ఇదే కొండ నుంచి గాజువాకకు చెందిన అధికారపార్టీ నేత ఒకరు ఏపీఐఐసీ లేఅవుట్‌లో తనకు కేటాయించిన ప్లాట్లు పూడ్చడానికి గ్రావెల్‌ తరలించుకుపోయారు. దీనిపై గ్రామస్థులు గనులశాఖకు సమాచారం ఇవ్వడంతో రాత్రికి రాత్రి లారీలు, ఎక్సకవేటర్‌ను కొండ ప్రాంతం నుంచి తరలించారు. ఆ తరువాత కొన్నాళ్లు కొండపై తవ్వకాలు నిలిపివేశారు. అయితే గత వారం పదిరోజులుగా మళ్లీ తవ్వకాలను ప్రారంభించి, యథేచ్ఛగా గ్రావెల్‌ తరలింపు కొనసాగుతోంది.

Updated Date - 2023-09-04T00:46:10+05:30 IST