అర్జీదారుల ఇళ్లకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-05-27T01:06:10+05:30 IST
స్పందనలో కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పరిష్కరించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. స్పందన కార్యక్రమంపై నమ్మకంతో ప్రజలు అర్జీలు సమర్పిస్తున్నారని, అధికారులు బాధ్యతగా వ్యవహరించిఆయా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. స్పందనలో స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపిస్తున్నామని, అవి చేరిన 24 గంటల్లో విచారణాధికారిని నియమించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అధికారులకు కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశం
ఉద్యోగులు సమయపాలన పాటించాలి
ఫేషియల్ హాజరు ఉంటనే జీతాలు
స్పందనలో 85 వినతులు స్వీకరణ
పాడేరు, మే 26 (ఆంధ్రజ్యోతి): స్పందనలో కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పరిష్కరించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. స్పందన కార్యక్రమంపై నమ్మకంతో ప్రజలు అర్జీలు సమర్పిస్తున్నారని, అధికారులు బాధ్యతగా వ్యవహరించిఆయా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. స్పందనలో స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపిస్తున్నామని, అవి చేరిన 24 గంటల్లో విచారణాధికారిని నియమించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే విచారణాధికారి అర్జీదారుల ఇళ్లకు వెళ్లి వాటికి పరిష్కారం చూపించాలన్నారు. నెలలో 22 రోజులు ముఖ హాజరు వేస్తేనే సిబ్బందికి జీతాలు చెల్లించాలని అధికారులకు సూచించారు. ముఖ హాజరు లేకుండా జీతాలు చెల్లిస్తే, అందుకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగులు సమయపాలన పాటించడంలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
స్పందనలో 85 వినతుల స్వీకరణ
ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో గిరిజనుల నుంచి వివిధ సమస్యలపై 85 వినతులను స్వీకరించారు. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ శరభాపుట్టు గ్రామస్థుడు జాగరపు భీమరాజు.. తనకు ఇల్లు మంజూరైందని, పునాదులు నిర్మించినా బిల్లు మంజూరు కాలేదని తెలిపారు. జీకేవీధి మండలం జెర్రెల పంచాయతీ జె.కొత్తూరు గ్రామానికి రోడ్డు, వంతెన మంజూరు చేయాలని జర్తా రాజారావు వినతిపత్రం సమర్పించారు. పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ మెరకచింత గ్రామానికి అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయాలని జి.రమణమ్మ, ఎం.రాంబాబు కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని జీసీసీ హమాలీల సంఘం అధ్యక్షుడు వి.పండుబాబు, తదితరులు వినతిపత్రం సమర్పించారు. పెదబయలు మండలం గోమంగి పంచాయతీ వంకరాయి, సంపంగిబంద, పంగళం గ్రామాలకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు మంజూరు చేశారని, ఇందులో రెండు కిలోమీటర్లు మట్టి పనులు చేస్తుండగా అటవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిపేశారని గ్రామస్థులు జి.మాణిక్యం, కె.జ్యోతి, జి.రూపాలమ్మలతో మరో 41 మంది కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జె.శివశ్రీనివాసు, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్, పంచాయతీరాజ్ ఈఈ టి.కొండయ్యపడాల్, రహదారులు భవనాల శాఖ ఈఈ బాల సుందరబాబు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నంద్, జిల్లా ఉద్యానవన అధికారి రమేశ్‌కుమార్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.