ఘాట్ రోడ్డంటే దడ
ABN , First Publish Date - 2023-07-14T01:04:16+05:30 IST
ఏజెన్సీలోని ఘాట్ మార్గాల్లో ప్రయాణమంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ మార్గాల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకర మలుపుల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు, రక్షణ గోడలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని వాహనచోదకులు చెబుతున్నారు.
- తరచూ ప్రమాదాలు
- మలుపుల్లో కానరాని హెచ్చరిక బోర్డులు
- పాడేరు, అరకులోయ, అనంతగిరి ఘాట్‌ల్లోనే ప్రమాదాలు అధికం
- ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు అనివార్యం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీలోని ఘాట్ మార్గాల్లో ప్రయాణమంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ మార్గాల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకర మలుపుల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు, రక్షణ గోడలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని వాహనచోదకులు చెబుతున్నారు.
ఏజెన్సీలోని ఘాట్ మార్గాల్లో ఇటీవల వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ఘాట్‌లో ప్రమాదకరమైన మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. సాధారణ రోడ్లు కంటే ఘాట్ రోడ్డు పూర్తి భిన్నంగా ఉండడంతో పాటు ఈ మార్గంలో కొత్తగా వచ్చే వాహన చోదకుల్లో అవగాహన లేకపోవడం, అతివేగం సైతం ప్రమాదాలకు కారణమవుతోంది. పాడేరు ఘాట్ మార్గంలో గురువారం ఎదురెదురుగా వస్తున్న జీపు, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బుధవారం ఇటుకల లోడుతో ఉన్న ట్రాక్టర్, మరో వ్యాన్ బోల్తా పడ్డాయి. మంగళవారం ఓ ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన సీహెచ్.సతీశ్(23) మృతి చెందాడు. సోమవారం సాయంత్రం చోడవరం నుంచి ద్విచక్ర వాహనంపై పాడేరు వస్తున్న బోర్‌వెల్ నిర్వాహకుడు వెంకటరావును ఘాట్‌లోని కోమాలమ్మ పనుకు సమీపంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడడంతో మృతి చెందారు. మంగళవారం అనంతగిరి ఘాట్‌లో ఒకే సమయంలో రెండు మినీ వ్యాన్‌లు బోల్తా పడ్డాయి. ఇవి ఉదాహరణలు మాత్రమే. ప్రధానంగా పాడేరు, అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లోని ఘాట్ మార్గాల్లోనే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
రోడ్డున పడుతున్నబాధిత కుటుంబాలు
ఘాట్ మార్గంలో పెద్ద వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ప్రమాదాల వల్ల ఇంటి పెద్దను కోల్పోయి, ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఉదాహరణకు స్థానిక బోర్‌వెల్ నిర్వాహకుడు వెంకటరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతితో ఆ కుటుంబం రోడ్డునపడింది. అలాగే ఆర్నెళ్ల కిత్రం పాడేరుకు చెందిన ఓ హోటల్ యజమాని నాగరాజు బైక్‌పై విశాఖపట్నం నుంచి వస్తుండగా ఘాట్‌లో ఓ లారీ ఢీకొట్టడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటి పెద్దగా ఉన్న నాగరాజు మృతితో ఆయన కుటుంబం రోడ్డున పడింది. ఇలాంటి విషాదకర సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.
ఘాట్ మార్గాల్లో హెచ్చరిక బోర్డులు శూన్యం
పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే ఘాట్ మార్గంలో ఎటువంటి హెచ్చరికల బోర్డులు లేవు. దీంతో ప్రమాదకరమైన మలుపుల వద్ద పరిస్థితిని, ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించలేని దుస్థితి ఏర్పడుతోంది. దీంతో వాహనాలు ఢీకొట్టుకుని ప్రమాదాలకు గురవుతున్నాయి. స్థానిక ఘాట్‌లో కొన్ని చోట్ల పోలీసులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాగా, అనేక మలుపుల ఎటువంటి బోర్డులు లేవు. దీంతో ప్రధానంగా కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే పాడేరు నుంచి పెదబయలు, ముంచంగిపుట్టు మీదుగా జోలాపుట్టు వెళ్లే మార్గంలోనూ అక్కడక్కడ ఉన్న ఘాట్ మలుపుల వద్ద హెచ్చరికల బోర్డులు గాని, ఆయా ప్రాంతాల పరిస్థితులను తెలిపే సమాచార బోర్డులు గాని పెట్టలేదు. పాడేరు నుంచి జి.మాడుగుల మీదుగా చింతపల్లి, జీకేవీధి ప్రాంతాలకు వెళ్లే మార్గంలో, చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే ఘాట్ మార్గంలో ఉన్న మలుపుల వద్ద సైతం ఎటువంటి హెచ్చరికల బోర్డులు లేవు. దీంతో జీపులు, వ్యాన్‌ల వంటి వాహనాలు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టమవుతున్నది. అరకులోయ మండలం సుంకరమెట్టకు సమీపంలో ఉన్న ఘాట్ మార్గం, అనంతగిరి మండలం పరిధిలోకి వచ్చే బీసుపురం, గాలికొండ, కాశీపట్నం, కొత్తూరు, టైడాకు సమీపంలో ఉన్న ఘాట్ మార్గాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మలుపులు ఇరుకుగా ఉండటంతో పాటు ఈ ప్రాంతంలో ఎక్కువగా కొత్త వ్యక్తులు వాహనాలను నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తున్నది.
ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు
- పాడేరు, అరకులోయ, చింతపల్లి ఘాట్‌లలో ప్రతి మలుపు వద్ద పెద్దపెద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
- ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించేలా ప్రత్యేక బోర్డులు పెట్టాలి.
- వాహనాల వేగాన్ని నిరోధించేందుకు అవసరమైన ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి.
- అన్ని ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలి.
- ఘాట్ మార్గంలో ప్రతి మలుపు వద్ద వాహనాలు లోయల్లోకి పోకుండా పటిష్టమైన రక్షణ గోడలు నిర్మించాలి.