సంక్షేమ హాస్టళ్లకు జీసీసీ సరకులు

ABN , First Publish Date - 2023-05-26T00:43:57+05:30 IST

గిరిజన సహకార సంస్థ (జీసీసీ) రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు చింతపండు, పసుపు సరఫరా చేయనుంది. దీనికి సంబంధించిన ఆదేశాలు కొద్దిరోజుల్లో రానున్నాయి.

సంక్షేమ హాస్టళ్లకు జీసీసీ సరకులు
జీసీసీ చింతపండు

చింతపండు, పసుపు సరఫరాకు ఏర్పాట్లు

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

గిరిజన సహకార సంస్థ (జీసీసీ) రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు చింతపండు, పసుపు సరఫరా చేయనుంది. దీనికి సంబంధించిన ఆదేశాలు కొద్దిరోజుల్లో రానున్నాయి. కొన్ని హాస్టళ్లలో విద్యార్థులకు ఆరోగ్యం బాగాలేనప్పుడు విచారణ చేయగా, ఆహార పదార్థాల్లో కల్తీయే కారణమని తేలుతోంది. దీంతో ఎవరికి వారు బయట సరకులు కొనకుండా పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హాస్టళ్లకు అవసరమైన చింతపండు, పసుపు అందించడానికి జీసీసీ ముందుకురాగా...పౌర సరఫరాల శాఖ ఎండీ అంగీకరించారు. ఈ మేరకు ఉత్తర్వులు రావలసి ఉంది.

జీసీసీ వద్ద ప్రస్తుతం రెండు వేల టన్నుల చింతపండు నిల్వ ఉంది. అలాగే పసుపు కూడా 100 టన్నుల వరకు ఉంది. హాస్టళ్లకు సరఫరా చేసే ఆర్డర్‌ వస్తే..డిమాండ్‌ మేరకు ఇంకా ఆయా ఉత్పత్తులను గిరిజనుల నుంచి సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. పిక్కతో కూడిన చింతపండుకు జీసీసీ కిలోకు రూ.32.40 చొప్పున చెల్లిస్తోంది. మార్కెట్‌లో పిక్కతీసిన చింతపండు కిలో రూ.90-100 మధ్య ఉంది. అయితే ఏటా జీసీసీ అమ్మకాలకు మించి చింతపండును సేకరించడంతో కొంత గోదాములకు తరలించి నిల్వ చేస్తోంది. ఆ తరువాత వేలం ద్వారా విక్రయిస్తోంది. అక్కడ రేటు పెద్దగా రాకపోవడంతో నష్టం వస్తోంది. హాస్టళ్ల ఆర్డర్‌ లభిస్తే చింతపండు వల్ల లాభాలు వచ్చే అవకాశం వుందని చెబుతున్నారు.

పసుపునకు డిమాండ్‌ పెరుగుతుంది

విశాఖ ఏజెన్సీలో పసుపును విరివిగా సాగుచేస్తున్నారు. అయితే జీసీసీకి దానిని ఎలా విక్రయించాలో, ఎక్కడ విక్రయించాలో తెలియక పెద్దగా కొనుగోలు చేయడం లేదు. పసుపునకు విలువ జోడించేలా ఏదైనా చేస్తే బాగుంటుందని, ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టాలని, అక్కడి ఎమ్మెల్యేలు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై నిపుణుల సూచనలు స్వీకరించాలని ఇటీవల సూచించారు. పౌర సరఫరాల శాఖ ఆర్డర్‌తో పాటు టీటీడీ ఆర్డర్‌ కూడా లభిస్తే..పసుపును కూడా విరివిగా సేకరిస్తామని అధికారులు అంటున్నారు.

Updated Date - 2023-05-26T00:43:57+05:30 IST