జీపీఎస్‌పై గరంగరం
ABN , First Publish Date - 2023-09-22T01:16:54+05:30 IST
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు బదులు గ్యారంటీ పింఛన్ స్కీమ్ (జీపీఎస్) అమలు చేయాలన్న మంత్రి వర్గం నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు.
ససేమిరా అంగీకరించబోమంటున్న సీపీఎస్ ఉద్యోగులు
సీపీఎస్‌ను రద్దు చేస్తామని పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని జగన్మోహన్‌రెడ్డి నిలబెట్టుకోలేకపోయారంటూ ఆగ్రహం
ఓపీఎస్ అమలు చేయాల్సిందేనని డిమాండ్
ఉమ్మడి జిల్లాలో నాలుగు వేల మందిపై ప్రభావం
పోరాటం కొనసాగుతుందని సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రకటన
నేడు నల్ల బ్యాడ్జీలతో విధులకు...
తాలూకా కేంద్రాల్లో నిరసన రేపు
25న ఛలో కలెక్టరేట్‌కు ఫ్యాప్టో పిలుపు
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు బదులు గ్యారంటీ పింఛన్ స్కీమ్ (జీపీఎస్) అమలు చేయాలన్న మంత్రి వర్గం నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు. జీపీఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించ బోమని స్పష్టంచేస్తున్నారు. జీపీఎస్‌ను ఉద్యోగులంతా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో నిరంకుశంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే నని ఆరోపిస్తున్నారు. విపక్ష నేత హోదాలో సీపీఎస్ రద్దు చేస్తానని ఇచ్చిన హామీని జగన్మోహన్‌రెడ్డి విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులకు ‘మాటతప్పి... మడమ తిప్పిన’ వ్యక్తిగా ఆయన పేరు చరిత్రలో ఉండి పోతుందని సీపీఎస్ పోరాట సమితి నాయకులు వ్యాఖ్యా నిస్తున్నారు.
సీపీఎస్ విధానంలో ఒక ఉద్యోగి తన సర్వీస్‌లో దాచుకున్న మొత్తం నుంచి 60 శాతం రిటైరైన సమయంలో ఇచ్చి, మిగిలిన 40 శాతంపై వచ్చే వడ్డీని పింఛన్‌గా అంద జేస్తుంటారు. అయితే మంత్రివర్గం ఆమోదించిన గ్యారంటీ పింఛన్ స్కీమ్‌లో రిటైరైన సమయంలో డబ్బులేమీ ఇవ్వకుండా...బేసిక్‌లో సగం మొత్తం పింఛన్‌గా ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని, దీనివల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే పాత పింఛన్ విధానం అమలు చేస్తున్నా యని గుర్తుచేస్తున్నారు. అలాంటప్పుడు ఏపీలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఓపీఎస్ అమలు చేయాలి
2004 సెప్టెంబరు ఒకటో తేదీకి ముందు ప్రభుత్వ శాఖలలో చేరిన ఉద్యోగికి పింఛన్ భద్రత ఉండేది. పింఛన్ కోసం ప్రత్యేకించి ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం మినహాయించుకునే విధానం ఉండేది కాదు. సర్వీస్ కాలంలో పలు పద్దుల కింద దాచుకునే సొమ్ము రిటైరైన సమయంలో ఇచ్చేవారు. అయితే 2004 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ అమలుచేశారు. అందువల్లనే 2004 సెప్టెంబరుకు ముందు ఉండే పింఛన్ విధానాన్ని పాత పింఛన్ స్కీమ్ (ఓపీఎస్) అని పిలుస్తారు. ఇప్పుడు సీపీఎస్ ఉద్యోగులంతా ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరుతున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 2004 సెప్టెంబరు ఒకటో తేదీ తరువాత నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు సుమారు నాలుగు వేల మంది ఉంటారు. వీరిలో సగం వరకు ఉపాధ్యాయులు ఉంటారు. కాగా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నాలుగేళ్లు దాటినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. జీపీఎస్‌ను ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా వ్యతిరేకిస్తున్నా మొండిపట్టుదలతో ప్రభుత్వం ముందుకువెళ్లి మంత్రివర్గంలో ఆమోదించడం దారుణమని ఫ్యాప్టో అభిప్రాయపడింది. దీనిని వ్యతిరేకించకపోతే 2003 డీఎస్సీలో ఎంపికై పాత పింఛన్ విధానంలో ఉన్న ఉపాధ్యాయులకు కూడా జీపీఎస్ అమలు చేయడానికి ప్రభుత్వం వెనుకాడబోదని ఫ్యాప్టో జిల్లా నేత ఒకరు ఆందోళన వ్యక్తంచేశారు. జీపీఎస్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శుక్రవారం సీపీఎస్ ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతారని, 23న అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన వ్యక్తంచేస్తారని ప్రక టించారు. ఈనెల 25వ తేదీన ఛలో కలెక్టరేట్‌కు పిలుపు నిచ్చినట్టు తెలిపారు.
జీపీఎస్ రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం
గూనూరు శ్రీను, అధ్యక్షుడు, విశాఖ జిల్లా సీపీఎస్ ఉద్యోగుల సంఘం
సీపీఎస్ రద్దు చేస్తానంటూ విపక్ష నేతగా పాదయాత్ర సమయంలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాటతప్పి...మడమతిప్పిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. దేశంలో అనేక రాష్ట్రాలు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తుంటే మన ఎందుకు తాత్సారం చేస్తున్నారు. తక్షణం జీపీఎస్‌ను ఉపసంహరించి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలి. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం.
హామీ అమలుచేయకపోడం మోసగించడమే
పైలా దేముడుబాబు, జిల్లా అధ్యక్షుడు, విశాఖ జిల్లా ఎస్టీయూ
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి...ఇప్పుడు దానిని పట్టించుకోకపోవడం అంటే ఉద్యోగులకు మోసగించడమే. 30 సంవత్సరాలకుపైగా ప్రభుత్వ సర్వీసులో పనిచేసిన వ్యక్తికి పదవీ విరమణ తరువాత భద్రత కలిగించేలా పింఛన్ ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత. అప్పట్లో ఇచ్చిన హామీపై అవగాహన లేదని తప్పించుకోవడం అన్యాయం. ఉద్యోగులకు పింఛన్ ఇవ్వడం ప్రభుత్వాల కనీస బాధ్యత అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విషయం ప్రభుత్వం గుర్తుతెచ్చుకోవాలి.