నలుగురు వైద్యులు విధులకు డుమ్మా

ABN , First Publish Date - 2023-02-12T01:06:43+05:30 IST

మండలంలోని మూడు పీహెచ్‌సీల పరిధిలో నలుగురు వైద్యులు విధులకు గైర్హాజరు కావడంపై జిల్లా లెప్రసీ వైద్యాధికారిణి(డీఎల్‌వో) కస్తూరిబాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె తురకలపూడి, బుచ్చెయ్యపేట, వడ్డాది పీహెచ్‌సీలను ఆకస్మిక తనిఖీ చేశారు. మూడు పీహెచ్‌సీల్లో ఆరుగురు వైద్యులు విధులకు హాజరుకావలసి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉండడంపై మండిపడ్డారు. తొలుత తురకలపూడి పీహెచ్‌సీకి ఆమె వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు వైద్యులూ పీహెచ్‌సీలో లేరు.

నలుగురు వైద్యులు విధులకు డుమ్మా
తురకలపూడి పీహెచ్‌సీలో రికార్డు పరిశీలిస్తున్న డీఎల్‌వో కస్తూరిబాయి

- మూడు పీహెచ్‌సీల్లో డీఎల్‌వో ఆకస్మిక తనిఖీ

- డాక్టర్ల గైర్హాజరుపై ఆగ్రహం

బుచ్చెయ్యపేట, ఫిబ్రవరి 11: మండలంలోని మూడు పీహెచ్‌సీల పరిధిలో నలుగురు వైద్యులు విధులకు గైర్హాజరు కావడంపై జిల్లా లెప్రసీ వైద్యాధికారిణి(డీఎల్‌వో) కస్తూరిబాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె తురకలపూడి, బుచ్చెయ్యపేట, వడ్డాది పీహెచ్‌సీలను ఆకస్మిక తనిఖీ చేశారు. మూడు పీహెచ్‌సీల్లో ఆరుగురు వైద్యులు విధులకు హాజరుకావలసి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉండడంపై మండిపడ్డారు. తొలుత తురకలపూడి పీహెచ్‌సీకి ఆమె వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు వైద్యులూ పీహెచ్‌సీలో లేరు. కొంతసేపటికి డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. తాను నిన్నటి వరకు క్యాజువల్‌ లీవ్‌లో ఉన్నానని డీఎల్‌వోకి తెలిపారు. మరో డాక్టర్‌ సంధ్యారాణి విధులకు హాజరుకాలేదు. బుచ్చెయ్యపేటలో ఇద్దరు వైద్యులకు గాను డాక్టర్‌ కె.రమేశ్‌ ఒక్కరే విధులు నిర్వహించడాన్ని గుర్తించారు. మరో డాక్టర్‌ వెంకటకృష్ణ లేకపోవడంపై డీఎల్‌వో ప్రశ్నించారు. క్యాజువల్‌ లీవ్‌ పెట్టారని సిబ్బంది లెటర్‌ చూపారు. దీనిపై ఆమె జిల్లా వైద్యాధికారి హేమంత్‌కి ఫోన్‌ చేసి డాక్టర్‌ వెంకటకృష్ణ లీవ్‌పై ముందస్తు అనుమతి తీసుకున్నారా? అని అడిగారు. అనుమతి తీసుకోలేదని డీఎంహెచ్‌వో తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చిన సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దిబ్బిడిలో శనివారం జరిగే వైఎస్సార్‌ క్లినిక్‌కు హాజరుకావలసి ఉండగా, డాక్టరు విధులకు గైర్హాజరు కావడంపై ఆమె ఆక్షేపించారు. వడ్డాది పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లూ లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. మూడు పీహెచ్‌సీల్లో నలుగురు వైద్యాధికారులు విధులకు గైర్హాజరైన విషయంపై డీఎంహెచ్‌వోకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌ ఫ్యామిలీ క్లినిక్‌, టీబీ పేషెంట్‌ కార్డులు, కుష్ఠు వ్యాది కేసుల వివరాల రికార్డులను ఆమె పరిశీలించారు. డాక్టర్ల గైర్హాజరుపైౖ డీఎంహెచ్‌వో హేమంత్‌ను వివరణ కోరగా, సంజాయిషీ కోరుతూ డాక్టర్లకు మెమోలు జారీ చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-02-12T01:06:44+05:30 IST