మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత
ABN , First Publish Date - 2023-10-03T01:18:33+05:30 IST
రాష్ట్ర మాజీ మంత్రి, మాడుగుల మాజీ ఎమ్మెల్యే రెడ్డి సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
చీడికాడ, అక్టోబర్ 2: రాష్ట్ర మాజీ మంత్రి, మాడుగుల మాజీ ఎమ్మెల్యే రెడ్డి సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో ఐసీయూలో వుంచి చికిత్స అందిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చీడికాం మండలం పెదగోగాడలో నివాసం వుంటున్న రెడ్డి సత్యనారాయణ ఆదివారం సాయంత్రం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కుమారుడు రాము గ్రామంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యం చేయించిన తరువాత తిరిగి ఇంటికి వెళ్లారు. కానీ సోమవారం ఉదయం ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో చోడవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం వరకు అక్కడ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో చోడవరం వైద్యుల సలహా మేరకు విశాఖలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పలురకాల పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో చేర్చారు. 24 గంటలు గడిస్తేగాని పరిస్థితి ఏమిటన్నది చెప్పలేమని వైద్యులు తెలిపినట్టు ఆయన కుమారుడు రాము చెప్పారు.