కేంద్రీయ విద్యాలయానికి ఆర్థిక ఆమోదం
ABN , First Publish Date - 2023-09-26T00:45:04+05:30 IST
అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరంగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి చెప్పారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అనకాపల్లి మండలం సుందరయ్యపేట పంచాయతీ పరిధిలో పది ఎకరాల్లో నిర్మించే కేంద్రీయ విద్యాలయం కోసం రూ.28,73,96,00 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని, సోమవారం సాయంత్రం అధికారికంగా సమాచారం అందిందన్నారు.

రూ.28.74 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సుందరయ్యపేటలో పది ఎకరాలు కేటాయింపు
భవన నిర్మాణాలకు వచ్చే నెలలో శంకుస్థాపన
అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి వెల్లడి
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 25: అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరంగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి చెప్పారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అనకాపల్లి మండలం సుందరయ్యపేట పంచాయతీ పరిధిలో పది ఎకరాల్లో నిర్మించే కేంద్రీయ విద్యాలయం కోసం రూ.28,73,96,00 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని, సోమవారం సాయంత్రం అధికారికంగా సమాచారం అందిందన్నారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణ పనులకు వచ్చే నెలలో శంకుస్థాపన జరుగుతుందని ఆమె తెలిపారు. వాస్తవంగా 2017లోనే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారని, అనివార్య కారణాల వల్ల జాప్యమైందన్నారు. జీ ప్లస్-2 విధానంలో భవనాలు నిర్మాణమవుతాయని, తరగతి గదులతోపాటు ఆట స్థలాలు, క్యాంటీన్, సిబ్బందికి నివాస గృహాలు, ఇతర మౌలిక సదుపాయాలు వుంటాయన్నారు. టెండర్ల ప్రక్రియను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ (సీపీడబ్ల్యూ) విభాగం చేపడుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త క్యాంపస్‌లోకి కేంద్రీయ విద్యాలయం వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సొంత భవనాలు అందుబాటులోకి వచ్చే వరకు జీవీఎంసీ ఉడ్‌పేట పాఠశాలలో కేంద్రీయ విద్యాలయం తరగతులు జరుగుతాయని, దీనిపై ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సత్యనారాయణపురం వద్ద అండర్‌పాస్ ఏర్పాటుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎంపీ సత్యవతి చెప్పారు. అనకాపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.