ఎట్టకేలకు ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ

ABN , First Publish Date - 2023-06-23T01:13:15+05:30 IST

మండలంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ భూమిపూజ చేశారు.

ఎట్టకేలకు ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ
రోడ్డు పనులకు భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌

టీడీపీ హయాంలో 20 కి.మీ వరకు పూర్తి

అప్పట్లో అటవీ శాఖ అనుమతులు లేక 3.4 కి.మీ మాత్రమే పెండింగ్‌

గొలుగొండ, జూన్‌ 22 : మండలంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు విస్తరణ జరగకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన విస్తరణకు అనుమతులు మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 12 అడుగుల రోడ్డును 24 అడుగులకు విస్తరించనున్నామన్నారు.

టీడీపీ హయాంలో అయ్యన్న ప్రత్యేక దృష్టితో 20కి.మీ వరకు పనులు పూర్తి

ఇదిలావుంటే, టీడీపీ హయాంలో అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో 2018లో ఇక్కడ 20కి.మీ వరకు రోడ్డు విస్తరణ పనులను పూర్తిచేశారు. నర్సీపట్నం నుంచి కృష్ణాదేవిపేట వరకు ఈ పనులకు సంబంధించి ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ.24 కోట్ల నిధులు మంజూరుచేశారు. అయితే ఆరిలోవ అటవీ ప్రాంతంలో 3.4కి.మీ. మినహా మిగిలిన రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. ఎర్రవరం రాజులబాబుగుడి నుంచి పప్పుశెట్టిపాలెం జంక్షన్‌ వరకూ విస్తరణ పనులకు అప్పట్లో అటవీ శాఖ నుంచి అనుమతులు లేకపోవడంతో ఆ మేరకు పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే గణేశ్‌ నాలుగే ళ్లలో అటవీ శాఖ నుంచి రోడ్డు విస్తరణకు అనుమతులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్డీవో జయరాం, డీఎఫ్‌వో రాజారావు, ఆర్‌అండ్‌బీ డీఈ నాగమోహన్‌, జేఈ ప్రసాద్‌ ఎంపీపీ గజ్జలపు మణికుమారి, జడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిటికెల భాస్కరనాయుడు, వైసీపీ మండల అధ్య క్షుడు లెక్కల సత్యనారాయణతో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-23T01:14:04+05:30 IST