న్యాయం జరిగే వరకూ పోరాటం

ABN , First Publish Date - 2023-03-31T01:17:16+05:30 IST

హెటెరో ఔషధ పరిశ్రమ కొత్తగా ఏర్పాటు చేసే పైపులైన్లకు ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదనే ప్రధాన డిమాండ్‌తో రాజయ్యపేట గ్రామంలోమత్స్యకారులు చేస్తున్న మహాశాంతియుత ధర్నా గురువారం నాటికి 482వ రోజుకు చేరుకుంది.

న్యాయం జరిగే వరకూ పోరాటం
హెటెరోకు వ్యతిరేకంగా బాణాలు ఎక్కిపెట్టిన మత్స్యకారులు

హెటెరోకు వ్యతిరేకంగా మత్స్యకారుల వినూత్న నిరసన

నక్కపల్లి, మార్చి 30: హెటెరో ఔషధ పరిశ్రమ కొత్తగా ఏర్పాటు చేసే పైపులైన్లకు ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదనే ప్రధాన డిమాండ్‌తో రాజయ్యపేట గ్రామంలోమత్స్యకారులు చేస్తున్న మహాశాంతియుత ధర్నా గురువారం నాటికి 482వ రోజుకు చేరుకుంది. శ్రీరామ నవమి పండగను పురస్కరించుకుని మత్స్యకారులు తమకు న్యాయం జరిగే వరకూ హెటెరోపై ధర్మ పోరాటం సాగిస్తామని హెచ్చరిస్తూ బాణాలు సంధిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు వారికి సంఘీభావం ప్రకటించారు. హెటెరో ఔషధ పరిశ్రమకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మత్స్యకారులు తగిన గుణపాఠం చెబుతారన్నారు. పర్యావరణ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న హెటెరో యాజమాన్యంపై చర్యలు తీసుకోవడానికి సంబంధితశాఖలు భయపడుతున్నాయని ఆరోపించారు. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా కొత్త పైపులైన్‌ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులు రద్దుచేసే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని మత్స్యకార నాయకులు పునరుద్ఘాటించారు. ఇందులో మత్స్యకార సంఘాల నాయకులు గోసల సోమేశ్వరరావు, చేపల సోమేశ్‌, పిక్కి రమణ, బొంది నూకరాజు, మైలపల్లి శివాజీ, మైలపల్లి బాపూజీ, పిక్కిరాజు, మైలపల్లి వెంకటేశ్‌, పిక్కి కాశీరావు, చోడిపల్లి రాజు, మైలపల్లి నల్ల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T01:17:16+05:30 IST