Share News

ఫెయిల్యూర్‌ సీఎం జగన్‌

ABN , First Publish Date - 2023-12-03T00:38:11+05:30 IST

జగన్‌మోహన్‌రెడ్డి నియంత పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్నీ కష్టాలేనని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. నాతవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించి మాట్లాడారు.

ఫెయిల్యూర్‌ సీఎం జగన్‌
కార్యాలయం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు

ప్రత్యేక హోదా తేవడం.., సీపీఎస్‌ రద్దు.., రాజధాని నిర్మాణం... అన్నింటా విఫలం

ప్రజలు మళ్లీ వైసీపీకి ఓట్లేసి ఎందుకు గెలిపించాలి?

నాతవరంలో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి అయ్యన్న

నాతవరం, డిసెంబరు 2 : జగన్‌మోహన్‌రెడ్డి నియంత పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్నీ కష్టాలేనని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. నాతవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు గుప్పిన జగన్‌ సీఎం అయ్యాక విస్మరించారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేదని.., సీపీఎస్‌ రద్దు చేయలేదని.., అమరావతి రాజధానిని నిర్మించలేదని.. ఇలా ఎన్నో అంశాల్లో విఫలమైన జగన్‌కు మళ్లీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, బీసీలను అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు సరుగుడు, సుందరకోట పంచాయతీలలో రోడ్లు వేయించానని, కొండపూన గల గ్రామాలలో సోలార్‌ సిస్టమ్‌తో ట్యాంక్‌లను ఏర్పాటు చేసి గిరిజనులు తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశానన్నారు. నేడు నాతవరం మండలంలో అభివృద్ధి పనులు కానరావడం లేద న్నారు. తాండవ రిజర్వాయర్‌ మెయిన్‌గేట్ల లికేజీలను అరికట్టలేని దుస్థితిలో ఎమ్మెల్యే గణేశ్‌ ఉన్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ మాట్లాడుతూ టీడీపీ కార్యాలయం దేవాలయం వంటిదన్నారు. ఇందులో నాయకులు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. టీడీపీ, జనసేన నాయకులు కలిసికట్టుగా పనిచేసి వైసీపీ పాలనకు చమరగీతం పాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కరక సత్యనారాయణ, మండల శాఖ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, నర్సీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ లాలం అచ్చిరాజు, తాండవ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్‌ పారుపల్లి కొండబాబుతో పాటు నాయకులు అప్పిరెడ్డి మాణిక్యం, మాజీ ఎంపీపీలు సింగంపల్లి సన్యాసిదేముడు, ఎన్‌.విజయ్‌కుమార్‌, నర్సీపట్నం జడ్పీటీసీ సుకల రమణమ్మ, ఇటంశెట్టి సీతారామ్మూర్తి జీరెడ్డి రాజుబాబు, శెట్టి లోవ, శెట్టి నానాజీ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వెలగల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-03T00:38:13+05:30 IST