తగ్గని చలి తీవ్రత
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:12 AM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినప్పటికీ చలి ప్రభావం మాత్రం తగ్గడం లేదు. శనివారం పాడేరులో 13.8, అరకులోయలో 14, చింతపల్లిలో 14.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినా చలి ప్రభావం మాత్రం కొనసాగుతున్నది.
పాడేరులో 13.8, అరకులోయలో 14, చింతపల్లిలో 14.3 డిగ్రీలు
పాడేరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినప్పటికీ చలి ప్రభావం మాత్రం తగ్గడం లేదు. శనివారం పాడేరులో 13.8, అరకులోయలో 14, చింతపల్లిలో 14.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినా చలి ప్రభావం మాత్రం కొనసాగుతున్నది. శీతాకాలం కావడంతో పాటు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో చలి తీవ్రత కొనసాగుతున్నది. దీంతో ఏజెన్సీలో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగ మంచు కురుస్తున్నది. దీంతో హెడ్ లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. చలి ప్రభావానికి మంటలు కాగుతూ, ఉన్ని దుస్తులు ధరిస్తూ రక్షణ పొందుతున్నారు.
చింతపల్లిలో ...
చింతపల్లి: మన్యాన్ని చలి వీడడం లేదు. ఏజెన్సీ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా స్థిరంగా నమోదవుతున్నాయి. దీంతో చలి ఉధృతి అధికంగా ఉన్నది. శనివారం చింతపల్లిలో 14.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం.సురేశ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో మంచు దట్టంగా కురుస్తున్నది. లంబసింగి, తాజంగి, జీకేవీధి, చింతపల్లి ప్రాంతాల్లో ఉదయం పదిన్నర గంటల వరకు మంచు వీడడం లేదు. చలి వల్ల ప్రాంతీయ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.