టీడీఆర్ ముసుగులో దోపిడీ
ABN , First Publish Date - 2023-10-30T01:14:37+05:30 IST
విశాఖలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది.
నగరంలో వైసీపీ నేతల హల్‌చల్
పదేళ్ల కిందట వేసిన రోడ్డుకి తాజాగా రూ.120 కోట్ల టీడీఆర్ జారీ
అదే భూమికి అదనంగా రూ.86 కోట్ల కోసం మళ్లీ దరఖాస్తు
ఇప్పటికే సీబీసీఎన్‌సీ భూమికి రూ.63 కోట్లు టీడీఆర్
వెంకటపతిరాజునగర్‌కు రూ.100 కోట్లు
పెదజాలారిపేటపై రూ.2,800 కోట్లు, బిలాల్‌కాలనీపై రూ.వెయ్యి కోట్లు టీడీఆర్ పొందేందుకు యత్నాలు
మరికొన్ని మురికివాడలను నోటిఫై చేసేందుకు కసరత్తు
చక్రం తిప్పుతున్న రాయలసీమకు చెందిన వైసీపీ నేత
విశాఖపట్నం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):
విశాఖలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది. ఇప్పటికే ప్రభుత్వ భూములపై కన్నేసిన అధికార పార్టీకి చెందిన రాయలసీమ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్రమంగా వాటిని చేజిక్కించుకుంటున్నారు. అది చాలదన్నట్టుగా ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్‌మెంట్ రైట్ (టీడీఆర్) పేరుతో భారీ దోపిడీకి శ్రీకారం చుట్టారు. దశాబ్దాల కిందట నిర్మించిన రోడ్లకు ప్రైవేటు స్థలాలు పోగొట్టుకున్న యజమానులను, మురికివాడలు ఉన్న భూముల యజమానులను రెవెన్యూ రికార్డులను పరిశీలించి గుర్తిస్తున్నారు. వారితో ముందుగా ఒప్పందం చేసుకుని, అధికారులపై ఒత్తిడితెచ్చి టీడీఆర్‌లను జారీ చేయించుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధమని ఫైళ్లను కదిలించేందకు విముఖత చూపితే అధికారబలాన్ని ప్రయోగించి వారిపై బదిలీవేటు వేస్తున్నారు.
నగర పరిధిలో టీడీఆర్ కుంభకోణాలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. సిరిపురం కూడలిలో జీవీఎంసీ కమిషనర్ బంగ్లాకు ఆనుకుని ఉన్న సీబీసీఎన్‌సీ స్థలంపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఆ భూమిపై కన్నేసిన వైసీపీ నేతలు స్థానికంగా ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధిని ముందుపెట్టి ఆ భూమిని చేజిక్కించుకున్నారు. తర్వాత ఈ స్థలాన్ని అనుకుని ఉన్న రోడ్డుని భవిష్యత్తులో విస్తరించాల్సి ఉంటుందంటూ ఆగమేఘాలపై రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఆర్‌డీపీ) చేయించి జీవీఎంసీ నుంచి రూ.63 కోట్ల విలువైన టీడీఆర్‌ను సొంతం చేసుకున్నారు.
పదేళ్ల కిందటి రోడ్డుకూ...
తాజాగా మధురవాడ జాతీయ రహదారి నుంచి రేవళ్లపాలెం మీదుగా నవోదయ పాఠశాలకు వెళ్లే రోడ్డు నిర్మాణంలో తమ భూమి పోయిందంటూ పూసపాటి లక్ష్మీనర్సింహరాజు కుమారుడు జోగి జగన్నాథ దేవవర్మ ఈ ఏడాది సెప్టెంబరు 16న జీవీఎంసీకి ఫిర్యాదు చేసి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. దీని ఆధారంగా జీవీఎంసీ అధికారులు రెండు రోజుల్లోనే రూ.120 కోట్ల విలువైన టీడీఆర్‌ను అతనిపేరుతో జారీ చేసేశారు. అదే రోజు రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధికి దళారీగా వ్యవహరించే సాయికృష్ణారెడ్డి టీడీఆర్ హక్కులను జగన్నాథదేవవర్మ నుంచి పొందినట్టు రిజిస్ర్టేషన్ చేయించుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రూ.120 కోట్లు టీడీఆర్ చేతికి రాగానే ఆ భూమి విలువను పొరపాటున తక్కువగా చూపించామని, అక్కడ భూమి విలువ గజానికి రూ.25 వేలు అధికమని చూపిస్తూ ఈనెల 25న మరోసారి జీవీఎంసీకి సవరణ గిఫ్ట్‌డీడ్ ఇచ్చారు. దీనివల్ల అదనంగా మరో రూ.86 కోట్లు పొందేందుకు స్కెచ్ వేశారన్నమాట. ఇదిలావుండగా రేవళ్లపాలెం మీదుగా నవోదయ పాఠశాలకు పదేళ్ల కిందట రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డులో తమ భూమి పోయిందంటూ ఓ వ్యక్తి క్లెయిమ్ చేయడం, టీడీఆర్ జారీచేయాంటూ జీవీఎంసీకి గిఫ్ట్‌డీడ్ చేయడం, రెండు రోజుల వ్యవధిలోనే ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా రూ.120 కోట్ల విలువైన టీడీఆర్‌జారీచేసేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
జీవోను కూడా పక్కనబెట్టి...
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే టీడీఆర్‌ల జారీకి సంబంధించిన విధి విధానాలను నిర్దేశిస్తూ జీవో నంబరు 180 జారీచేసింది. దీనిప్రకారం అప్పటికే నిర్మాణం పూర్తయిన రోడ్లు, భవనాలు, పార్కులు వంటివాటి కోసం ఏదైనా ప్రైవేటు స్థలం పోతే వాటికి టీడీఆర్ జారీచేయకూడదని స్పష్టంగా పేర్కొంది. ప్రజాప్రయోజనార్థం నిర్మించే రోడ్లు, నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం చేపట్టే పనులకు ప్రైవేటు భూమి అవసరమైతే వాటికి టీడీఆర్ జారీచేసిన తర్వాతే భూమిని తీసుకోవాలని సూచించింది. అయినప్పటికీ జీవీఎంసీ అధికారులు ఆ జీవోను పక్కనపెట్టి మరీ వందల కోట్ల టీడీఆర్‌లు జారీ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాయలసీమ నేత కనుసన్నల్లోనే...
ఈ మొత్తం వ్యవహారం వెనుక రాయలసీమకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఉన్నారని, అతని ఆదేశాల మేరకే ఈ తతంగం అంతా నడిచినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా మురికివాడలు నోటిఫై పేరుతో రూ.వేల కోట్లు విలువైన టీడీఆర్‌లు కొట్టేసేందుకు వైసీపీ నేతలు తెరవెనుకుండి తతంగం నడిపిస్తున్నారు. పెదజాలారిపేట మీద రూ.2,800 కోట్లు, మధురవాడలో ఒక క్రిస్టియన్ సంస్థ పేరుతో సుమారు రూ.200 కోట్లు, బిలాల్‌కాలనీ మురికివాడ నోటిఫికేషన్ పేరుతో రూ.వెయ్యి కోట్లు, దసపల్లా భూముల మీదుగా రోడ్డు నిర్మాణం పేరుతో దాదాపు రూ.364 కోట్లు విలువైన టీడీఆర్‌లను దక్కించుకునేందుకు జీవీఎంసీలో ప్రస్తుతం ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. జీవీఎంసీ పరిఽధిలో ఎప్పుడో పోయిన భూములకు, వందల ఏళ్లుగా ఉంటున్న మురికివాడలకు ఒకదాని తర్వాత ఒకటిగా టీడీఆర్‌లు జారీచేసుకుంటూ పోతే భవిష్యత్తులో జీవీఎంసీకి ఆదాయం భారీగా గండిపడి, ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.