రూ.962 కోట్లతో కాఫీ సాగు విస్తరణ

ABN , First Publish Date - 2023-02-07T00:27:15+05:30 IST

మన్యంలో రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున కాఫీ సాగు విస్తరణకు రూ.962 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సమావేశ మందిరంలో కాఫీ ఉద్యానవనాధికారులు, కాఫీ రైతులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రూ.962 కోట్లతో కాఫీ సాగు విస్తరణ
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ, పక్కన ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అశోక్‌

ప్రతిపాదనలు రూపొందించాలని ఐటీడీఏ పీవో ఆదేశం

పాడేరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మన్యంలో రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున కాఫీ సాగు విస్తరణకు రూ.962 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సమావేశ మందిరంలో కాఫీ ఉద్యానవనాధికారులు, కాఫీ రైతులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ వ్యాప్తంగా 2 లక్షల 13 వేల మంది గిరిజన రైతులు కాఫీ సాగు చేస్తున్నార న్నారు. 2015లో మంజూరు చేసిన కాఫీ ప్రాజెక్టు 2023- 24 ఆర్థిక సంవత్సరంతో ముగిసిపోతుందన్నారు. ఆ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా లక్ష ఎకరాల్లో నీడ తోటలు, 50 వేల ఎకరాల్లో కాఫీ మొక్కల పునరుద్ధరణ, 75 వేల ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణ చేపట్టామన్నారు. 2020 జూలై నుంచి తొమ్మిది విడతల్లో లక్షా ఎనిమిది వేల ఎకరాల్లో సాగు భూములకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేశామన్నారు. ఆయా భూముల్లో కొంత మేరకు కాఫీ సాగు చేస్తున్నారని, మిగిలిన భూముల్లో కాఫీ సాగు విస్తరించడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాఫీ తోటల్లో ప్రగతి సాధిస్తున్న రైతుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని కాఫీ విస్తరణ, పునరుద్ధరణ, సిల్వర్‌ ఓక్‌ మొక్కలతో పాటు నీడనిచ్చే పనస, నేరేడు, సంపంగి, కొండ మామిడి మొక్కలు రైతులకు అందించాలన్నారు. కాఫీ అభివృద్ధే లక్ష్యంగా అధికారులు ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. కాఫీ రైతులు కాఫీ కల్లాలు నిర్మించుకోవడానికి రూ.కోటి 35 లక్షలతో కాఫీ బోర్డుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. కాఫీ రైతుల పిల్లలను ప్రోత్సహించేందుకు ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థికి ఏడాదికి రూ.2,250, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థికి రూ.3,750లు చొప్పున ఉపకార వేతనాలు కాఫీ బోర్డు నుంచి అందించేందుకు ప్రతిపాదిం చామని చెప్పారు. గిరిజన కాఫీ రైతులు మాట్లాడుతూ మిక్సిడ్‌ షేడ్‌తో పాటు అధిక ఆదాయాన్నిచ్చే కమల, దాల్చిన చెక్క, లవంగ, యాలికలు మొక్కలను పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వ రరావు, కాఫీ విభాగం సహాయ సంచాలకుడు ఎన్‌.అశోక్‌, ఏజెన్సీ పదకొండు మండలాల కాఫీ విభాగం ఏఈవోలు, హార్టికల్చర్‌ కన్సల్టెంట్‌లు, గిరిజన కాఫీ రైతులు పాలిక లక్కు, కంటా రాజారత్నం, లంకెల విశ్వేశ్వరపాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:27:18+05:30 IST