పదింతల ఫలితాలకు కసరత్తు
ABN , First Publish Date - 2023-03-05T01:10:50+05:30 IST
ఈ ఏడాది పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గిరిజన సంక్షేమ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థుల కోసం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు 57 రోజుల ప్రత్యేక ప్రణాళికను ఆ శాఖ అధికారులు అమలు చేస్తున్నారు.
- గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో టెన్త్ పరీక్షలకు 57 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు
- విద్యార్థుల వారీగా సబ్జక్టు టీచర్లు, ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ
- గిరిజన సంక్షేమ శాఖ డీడీ, ఏటీడబ్ల్యూవోలు, ఆశ్రమాల హెచ్‌ఎంలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన ఐటీడీఏ పీవో
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఈ ఏడాది పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గిరిజన సంక్షేమ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థుల కోసం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు 57 రోజుల ప్రత్యేక ప్రణాళికను ఆ శాఖ అధికారులు అమలు చేస్తున్నారు.
ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న 122 ఆశ్రమ పాఠశాలలు, ఎనిమిది గురుకుల పాఠశాలల్లో సుమారుగా ఆరు వేల మంది టెన్త్ విద్యార్థులున్నారు. గత ఏడాది టెన్త్‌లో కేవలం 68 శాతం ఉత్తీర్ణత సాధించగలిగారు. దీంతో గతేడాది అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా సబ్జక్టు టీచర్లు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో 57 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలుకు మండల స్థాయిలో సహాయ గిరిజన సంక్షేమాధికారులు, పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, సబ్జక్టు టీచర్లు కృషి చేస్తున్నారు.
ప్రణాళికలో భాగంగా చేపడుతున్న చర్యలు
- జనవరి నెలాఖరుకు అన్ని సబ్జక్టులకు సంబంధించిన సిలబస్‌ను పూర్తి చేయడం. ప్రతి రోజు ఉదయం ఒక గంట, రాత్రి రెండు గంటలు ప్రత్యేక స్టడీ అవర్ నిర్వహణ.
- ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సబ్జక్టుల రివిజన్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో డైలీ టెస్ట్‌ల నిర్వహణ.
- ప్రతి రోజు ఆయా సబ్జక్టులకు సంబంధించి ప్రత్యేకమైన నోట్స్‌ను రాయించడం.
- డైలీ టెస్ట్‌లను ఏరోజుకారోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల ప్రగతిని అదే రోజు అందరికీ తెలియజేయడం, వెనుకబాటునకు గురైన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి, వారికి ఉత్తీర్ణతకు అవసరమైన మార్కులు వచ్చేలా ఆయా అంశాలపై తర్ఫీదు ఇవ్వడం. అలాగే విద్యార్థులపై సబ్జక్టు టీచర్లు ప్రత్యేక దృష్టిపెట్టి పరీక్షల సమయానికి వారి స్థాయిని పెంచడం.
- డైలీటెస్ట్‌ల ఆధారంగా విద్యార్థుల ప్రగతి ఆధారంగా వారిని ఏ, బీ, సీ, డీలుగా విభజించి, డీ గ్రేడులో ఉన్న వారికి సహచర విద్యార్థులతోనే ఆయా సబ్జక్టుల్లో సందేహాలను నివృత్తి చేసి, వారిని బీ, సీ గ్రేడుల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేయడం.
- వార్షిక పరీక్షలపై విద్యార్థులకు భయం పోగొట్టడంతోపాటు డైలీ టెస్ట్‌ల ద్వారా వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపడం.
- 57 రోజులు ప్రత్యేక ప్రణాళిక సమయంలో విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడడంతోపాటు, వారిపై ఉపాధ్యాయుల నిత్య పర్యవేక్షణ ఉంచడం.
----------
ప్రత్యేక ప్రణాళిక పకడ్బందీగా అమలు (4పిడిఆర్ 3)
పదో తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే 57 రోజుల ప్రత్యేక ప్రణాళికను పటిష్ఠంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. టెన్త్ విద్యార్థులు ఇన్నాళ్లూ చదవింది ఒక ఎత్తు అయితే, ఇకపై చదివేది మరో ఎత్తు. ప్రణాళికలో భాగంగా విద్యార్థులు దృష్టిసారిస్తే చక్కని మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రధానంగా విద్యార్థులు ఇంటి బాట పట్టకుండా ఉంటే, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సబ్జక్టు టీచర్లు, ఇతర ఉపాధ్యాయులు ఈ ప్రణాళికపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
- ఐ.కొండలరావు, డీడీ, గిరిజన సంక్షేమ శాఖ, పాడేరు
--------------
ఆత్మ విశ్వాసం పెరిగింది (4పిడిఆర్ 4)
ఇన్నాళ్లూ చదివినప్పటికీ, నేను పాస్ అవుతానో? లేదో? అనే అపసమ్మకం ఉండేది. కానీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున ఆ అపోహ పోయింది. నేను కచ్చితంగా పాస్ అవుతాననే ఆత్మ విశ్వాసం పెరిగింది. ప్రధానంగా ఉదయం, రాత్రి ప్రత్యేక తరగతుల నిర్వహణ వల్ల మేం చదువుపై మరింత దృష్టి కేంద్రీకరిస్తున్నాం. ప్రత్యేక ప్రణాళిక ముగిసే నాటికి చదువు పరంగా మాలో సైతం మరింత అవగాహన పెరిగి, ఉత్తీర్ణత సాధించడం సులువు అవుతుందని నమ్ముతున్నాను.
- జంపరంగి రీతు, టెన్త్ విద్యార్థిని గూడ ఆశ్రమ పాఠశాల, హుకుంపేట మండలం